Wednesday, 28 June 2023

తోలు తిత్తి ఇది

తోలు తిత్తి ఇది 


తోలు తిత్తి ఇది

తూటులు తొమ్మిది

తుస్సుమన ఖాయం

 జీవా తెలుసుకో 

అపాయం! అపాయం!!


పదోది మరిచిపోయారు గురువా!

Friday, 16 June 2023

I chatter

 I chatter


I chatter, chatter as I flow

To join the brimming river

For, men may come and men may go

But I go on forever

Lord Tennyson.

 The Brook says

I whisper, murmur, speak, talk, weep and cry, with people who have come across. They come to me with a purpose. Leave me after the purpose is served. I am lone and alone to move on to eternity.


Tuesday, 13 June 2023

చూడమని చేతికిస్తే

 చూడమని చేతికిస్తే సుక్కురారమని ఇంట్లో పెట్టుకుంది.


ఇదో నానుడి, పల్లెలలో చెప్పుకుంటాం.ఓ బుల్లి కత చెప్పుకుందాం.

అనగనగా ఒక పల్లె, అందులో ఒక పేదరాలు.జన్మలో బంగారపు ఆభరణం చేయించుకోలేదు. పెళ్ళప్పుడే మొగుడు మావిడాకు మడిచి పుస్తి కట్టేడు. ఆ తరవాత పసుపుకొమ్ము కట్టుకుంది. ఆవిడకో కోరిక, జీవితంలో, ఒక మంచి నగ చేయించుకోవాలని. చాలాకాలం తరవాత ఒక నగ చేయించేడు,పోరగా,పోరగా మొగుడు.ఇరుగు పొరుగులకి చూపించుకుంది. అంతా బాగుంది,బాగుందన్నారు,  సంబరపడింది. పక్క వీధిలో ఉన్న దూరపు బంధువు, కలిగినది, ఒంటి నిండా ఆభరణాలతోనే ఉంటుందెప్పుడూ, ఆవిడ ఇంటి కెళ్ళి ఆ నగ చూపించింది, అదేమో సాయంత్రపు వేళ, అందులోనూ శుక్రవారం. ఆవిడ చూసింది. నగ బాగుందంది, బరువు, ఖర్చైన సొమ్ము వివరాలడిగింది, ఇటువంటిది నా దగ్గర లేదనీ చెప్పింది,నీకు అందంబాగా తెలుసని పొగిడింది.  పిచ్చి, పేద ఇల్లాలు మొహం చింకి చేటంతయింది. ఇంకేంటి ఈ పేదరాలికి ఏనుగెక్కినంత సంబరమయింది. మా అత్తగారికి చూపిస్తాను, నేనూ చేయించుకుంటానంది. నగ పట్టుకుని లోపలికెళ్ళింది. ఎంతకీ బయటికి రాదు, నగ తెచ్చి ఇవ్వదు. చూసి చూసి పేదరాలు వదినా చీకటడుతోంది, నగ ఇస్తే ఇంటికెళతానూ అని కేకేసింది. చాలా సేపు కేకేసిన తరవాత ఆ ధనికురాలు బయటికొచ్చి. అదేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళిపోయావనుకున్నా, అంది. విస్తుపోయిన పేదరాలు నగ ఇస్తే వెళ్ళిపోతానంది. దానికా ధనికురాలు, ఈ వేళ సుక్కురారం కదా, అందులోనూ సాయంత్రంపడి చిన్న తల్లి ఇంటికొచ్చింది, ఎలా ఇస్తానూ, రేపొచ్చి పట్టుకెళ్ళు, అంది.ఏమనాలో తెలియని పేదరాలు ఏడుపుముఖంతో తిరిగొచ్చింది.


 మర్నాడు ఉదయమే వెళ్ళింది,  బారెడు పొద్దెక్కినా నిద్దరమంచం మీంచి లేవని మహాతల్లి నెమ్మది లేచి ఆవలిస్తూ బయటికొచ్చి, రాత్రి మావారికి చూపించా, నాకూ చేయిస్తానన్నారు, నగ కంసాలికి చూపించి, మోడల్ కోసం, ఇస్తాలే అంది నిర్లక్షంగా. ఏమనాలో తెలియని పేద ఇల్లాలు విసవిసలాడుతూ ఇంటికొచ్చింది. విసవిసలాడుతున్న ఇల్లాలిని చూసిన మగడు ఏమైందని అడిగేడు. చెప్పకతప్పలేదామెకు. జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పింది,గుడ్లనీరుగుక్కుకుంటూ.ఆమె బాధ చూచిన భర్త అనునయంగా, పిచ్చిదానా కలిగినవారితో వ్యవహారం ఇలాగే ఉంటుంది. జరిగిందేదో జరిగింది,తరవాతెళ్ళి తెచ్చుకో అని చెప్పడం తో ఊపిరిపీల్చుకుంది. తిడతాడనుకున్న మగడు సౌమ్యంగా మాటాడి అనునయించేటప్పటికి ఏడుపొచ్చి భర్తను చుట్టేసింది. మధ్యాహ్నం వెళ్ళింది. భోజనం చేస్తున్నానని గడపలో నుంచోబెట్టి, నెమ్మదిగా బయటికొచ్చి కంసాలి చూడడం అవలేదట, సాయంత్రంరా అని విసురుగా లోపలికెళ్ళుతూ,నగ తినేస్తామనుకుంటుందో ఏమో! అని గొణుక్కుంటూ లోపలికెళ్ళింది. విన్న పేదరాలు చేయగలది లేక తిరిగొచ్చింది. సాయంత్రం వెళితే నిలబెట్టి, నిలబెట్టి నగపట్టుకొచ్చి చేతికిచ్చింది. బతుకుజీవుడా అనుకుంటూ ఇంటికి తిరిగొచ్చింది. మరెప్పుడూ ఇలాటి తప్పు చేయకూడదనుకుంటూ.    


ఇదీ చూడమని చేతికిస్తే సుక్కురారం కత. జీవితం లో అప్పుడప్పుడు ఇటువంటి అనుభవాలందరికి జరుగుతూనే ఉంటాయి.

Sunday, 11 June 2023

తక్షకస్య విషం

తక్షకస్య విషం

(ఆచార్య చాణక్య)


అగ్నిరాపః స్త్రియో మూర్ఖాః

సర్పా రాజకులీన చ

నిత్యం యత్నేన సేవ్యాని

సద్యః ప్రాణహరాణి షడ్


నిప్పు,నీరు,మూర్ఖులు,స్త్రీలు,పాములు,రాజబంధువులు ఈ ఆరుగురితో నిత్యం జాగరూకతతో ఉండాలి. లేదా తక్షణ ప్రాణహాని జరగచ్చు.



దూరస్థోఽపి న దూరస్థో 

యో యస్య మనసి స్థితః

యో యస్య హృదయె నాస్తి

సమీపస్థోఽపి దూరతః


మనసుకు దగ్గరైనవారు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నట్టే. మనసుకు దూరమైనవారు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నట్టే 

 

దానేన పాణిర్న తు కంకణేన

స్నానేన శుద్ధిర్న తు చందనేన

మానేన తుష్ఠిర్న తు భోజనేన

జ్ఞానేన ముక్తిర్న తు ముండనేన


చేతులకి అలంకారం బంగారు గాజులు,మురుగులు,తోడాలు ధరించడం కాదు,దానమే అలంకారం.శుద్ది స్నానంతో అవుతుంది,చందనం ఒంటికి రాసుకోవడంతో కాదు. అర్హులకు భోజనం పెట్టడంతో తృప్తినివ్వదు, సన్మానమే తృప్తినిస్తుంది. జ్ఞానంతో ముక్తి కలుగుతుందికాని, తలగొరిగించుకున్నంతలో కాదు .(సన్యాసంతీసుకున్నంతలో ముక్తిరాదు.) 



పరోక్షె కార్యహంతారం

 ప్రత్యక్షె ప్రియవాదినం

వర్జయెత్తదృశం మిత్ర 

విషకుంభ పయోముఖం.


ఎదుటగా పొగిడి, వెనక చెడ్డగా మాటాడి, పని చెడగొట్టే వారు(వెనక గోతులు తీసేవారు), పాల పైపూతగల  విషపు కుండలాటి వారు. అటువంటి మిత్రునిలాటి వారిని వదిలేయాలి. 

  


విద్యా మిత్రం ప్రవాసేషు

 భార్య మిత్రం గృహేషు చ

వ్యాధిస్తయోషధీ మిత్రం 

ధర్మో మిత్రం మృతస్య చ


పరాయి దేశంలో విద్య మిత్రుడు, ఇంటిలో భార్య మిత్రుడు (దేవుడిచ్చిన మిత్రుడు), వ్యాధితో బాధపడేవారికి మందు మిత్రుడు, చనిపోయినవారికి వారు చేసుకున్న ధర్మమే మిత్రుడు. 


వృధా వృష్టి సముద్రెషు

 వృధా తృపేషు భోజనం

వృధా దానం ధనాఢ్యెషు

 వృధా దీపో దివాపి చ


సముద్రం మీద వర్షం వృధా, (అప్పటికే అక్కడ చాలా నీరుంది), కడుపు నిండినవానికి పెట్టే భోజనం వృధా ( పెట్టిన దానిని తిన లేడు)డబ్బున్నవాడికి దానం చేయడం వృధా, (అపాత్ర దానం)పగలు దీపం వెలిగించడం వృధా ( సూర్యుని వెలుగుండగా దీపమెందుకు? అది దర్పం వెళ్ళబోయడమే)


తక్షకస్య విషం దంతె 

మక్షికాయస్తు మస్తకె

వృశ్చికస్య విషం పుఛ్ఛె

 సర్వాంగె దుర్జనె విషమ్


 పాముకి పంటిలో విషం, ఈగకు తలలో విషం,తేలుకు తోకలో విషం,దుర్జనునికి అన్ని అంగాల విషమే


తలనుండు విము ఫణికిని

వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్

దలదోకయనకయుండును 

ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ


Wednesday, 7 June 2023

సుఖస్యాఽనంతరం

 (ఆచార్య చాణక్య నీతి)


సుఖస్యాఽనంతరం దుఃఖం

దుఃఖస్యాఽనంతరం సుఖమ్

న నిత్యం లభతె దుఃఖం

న నిత్యం లభతె సుఖమ్


సుఖాల తరవాత దుఃఖాలు, దుఃఖాల తరవాత సుఖాలు కలుగుతూ ఉంటాయి.ఎప్పుడూ దుఃఖమే స్థిరంగా ఉండిపోదు. అలాగే సుఖమూన్నూ స్థిరంగా ఉండిపోదు.


పుస్తకస్తా తు యా విద్యా

 పరహస్త గతం ధనం

కార్యకాలె సముత్పన్నె

 న సా విద్యా న తద్ధనం

 

పుస్తకంలో ఉన్న విజ్ఞానము, ఇతరులచేతిలోని మనధనము అక్కరకు రావు  (సమయానికి, అవసరానికి ఆదుకోవు)


నృపస్య చిత్తం కృపణస్య విత్తం

మనోరథా దుర్జనమానవానా

స్త్రియా చరిత్రం పురుషస్య భాగ్యం

దేవో న జానాతి కుతో మనుష్య

 

రాజు మనసు,లోభివాని సంపద,దుర్జనుని కోరిక,స్త్రీ చరిత్ర,మగవాని సంపాదన, దేవునికైనా తెలియదు, మనుషులకా?

 రాజుమనసులో మాట గుట్టు, లోభివాని సంపాదనంతా గుట్టు,దుర్జనుని కోరిక గుట్టు, స్త్రీల చరిత్ర అనగా వయసు వివరాలు గుట్టు,పురుషుని సంపాదన గుట్టు. వీరంతా తమ గుట్టు దేవుడికి కూడా తెలియనివ్వక దాచి ఉంచుతారు, మనుషులకెలా తెలుస్తుంది? అని కవి భావం. 


అత్యాసన్నాః వినాశాయ
దూరస్థాః న ఫలప్రదాః
సేవ్యంతాం మధ్య భావేన
రాజా వహ్ని గురుస్త్రియః

 

రాజు,నిప్పు,గురుస్త్రీలు  వీరిపట్ల అతి సన్నిహితంగా ఉంటే వినాశనమే, అలాగని దూరంగా ఉండి ఉపయోగం లేదు. అందుచేత మధ్యస్థ దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుని మాట.  

గురు స్త్రియం అన్న చోట వేరువేరుగా కాక గురుస్త్రియం గా చెప్పుకోవాలని చెప్పేరు. అందుకు మార్పు," రాజు,అగ్ని, గురుస్త్రీలు వీరిపట్ల అతి చనువుతో ప్రవర్తించడం ప్రమాద హేతువు,వినాశకారి. 




Thursday, 1 June 2023

ఏమిజన్మంబు? ఏమి జీవనము?

 ఏమిజన్మంబు? ఏమి జీవనము?


 ఏమిజన్మంబు? ఏమి జీవనము?

ఈ మాయకాయంబు? ఏమిజన్మంబేమి జీవనము?


పుట్టుకేంటి? పెరగడమేంటి? చావేంటి? మనిషికి మనిషిపుట్టడమేంటి? పండునుంచి పండు పుట్టడమేంటి? ఆడ, మగ తేడా ఏంటి?స్త్రీకే బిడ్డకలగడమేంటి? ఎందుకీ తేడా? ఆకలేంటి? అన్నమేంటి? అన్నం తింటే ఆకలి తీరడమేంటి?ఆలోచిస్తే ఇదంతా గందరగోళం. ప్రేమ అభిమానాలేంటి? ఎందుకు? అన్నీ కొచ్చన్లే.  సమాధానాలు లేవు.... 


ఓరోజు సాయంత్రం ఆలోచన ఈ దారి పట్టింది.బయటికెళ్ళలేక లోపలుండలేని స్థితి. ఇంతలో మందస్మితవదనారవిందసుందరి,త్రిదశి, వచ్చి కూచుంది, ”తాతగారూ రేపు ఊరునుంచి వెళ్ళిపోతున్నానూ” అంటూ, బిక్కముఖంతో. అంతలోనే అసలీ కలవడమేమి?విడిపోవడమేమి? కారణం లేని కార్యం ఉండదంటారు కదా! అడిగింది.

ఈ  ప్రశ్నకి సమాధానం భారతంలో భీష్ముడు చెప్పారు, పద్యం గుర్తులేదు, భావం చెబుతా! గాలిచేత ఎగరగొట్టబడ్డ మేఘాలు గుంపుగా చేరతాయి, అదేగాలిచేత చెదరగొట్టబడతాయికూడా! అలాగే మానవులు విధి(చాలా అర్ధాలున్నాయి, ఈ మాటకి)చేత కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. ఓ చిన్న కొచ్చను సమాధానం చెప్పూ అన్నా! తన బిక్కమొహం చూడలేక!!!


ఒక నాలుగొందల మీటర్ల వాకింగ్ ట్రాక్ మీద ఒకే చోటునుంచి ఇద్దరు గంటకు నాలుగు కి.మి ల వేగంతో ఒకే సమయంలో బయలుదేరి ఎదురెదురుగా నడుస్తున్నారు. వీరుకలుస్తారా? ఎప్పుడు ఎక్కడ?


అదేట్రాక్ మీద మరో ఇద్దరు కలిసి గంటకు నాలుగు కి.మి ల వేగంతో ఒకేవైపుకు నడుస్తున్నారు. వీరు కలిసినడుస్తారా? విడిపోతారా?


అదే ట్రాక్ మీద ఒకడు గంటకు నాలుగు కి.మి ల వేగంతో నడుస్తున్నాడు. మొదటివాడు నడక మొదలెట్టిన రెండు నిమిషాల తరవాత రెండవాడు అదే చోటునుంచి,  అదే  వేగంతో అదే వైపుకి నడకమొదలెట్టేడు. వీరిద్దరూ కలుస్తారా? ఎప్పుడు?ఎక్కడా?

ఈ కొచ్చన్లు విని మందస్మితవదనారవిందసుందరి మరింత బిక్కమొహంతో నేను లెక్కల్లో వీకూ అంది బెక్కుతూ!!! 

ఆలస్యమైతే తిక్కమొగుడు వచ్చి ఎత్తుకుపోతాడు, అంది నవ్వుతూ. ఎక్కడున్నాడు? అడిగా బయట కార్ లో కూచుని ఉన్నాడు, అందుకే కంగారు. బై అంది చెయ్యి ఊపుతూ. నువ్వు ప్రేమించబడ్డ చోట సుఖంగా ఉంటావు. నువ్వు ప్రేమించినచోట సుఖంగా ఉండలేవన్నా!బై చెప్పుతాతా అంది,పక్కకి తిరిగి కళ్ళు తుడుచుకుంటూ. బై చెప్పను బై అనకు,వెళ్ళొస్తా అనాలి, అన్నా.మరికొంచంసేపు నిలిపి ఉంచడానికి. ఏం? అడిగింది.వెళ్ళొస్తా అన్నదానిలో మళ్ళీ కలుస్తామనే ఆశ ఉంది, బైలో లేదు, అన్నా! ”ఎల్పోయొస్తా” అంది నవ్వుతూ. నిజం ఇలా అనేవాళ్ళని చూసి నవ్వుతాం, నిజానికి ఇందులో ఎంత,మళ్ళీ కలుస్తామనే ఆశ ఉంది, అన్నా! ఇంకీ సారి వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళింది, ”వస్తానూ” అంటూ, చిత్రం కదూ!!!