సిరివెన్నెల-మారదులోకం-స్మృత్యంజలి.
సిరి వెన్నెల మరి లేదు, కనుమరుగయింది, కాని సిరివెన్నెల కలం బాలు గొంతులో చిరంజీవిగా ఉండిపోయింది.మిత్రుడు చేంబోలు సీతారామ శాస్త్రి అనే సిరివెన్నెల బహుముఖ ప్రజ్ఞా శాలి, అతని పాటలలోనే కొన్ని మచ్చుకి.
మేటనీ పిక్చరుంది బోటనీ లెక్చరుంది దేనికో ఓటు చెప్పరా?
అనగల చిలిపి చెలికాడు.
ఐయాం సారీ అన్నాగా వందో సారి
అని ప్రేయసి చేత అనిపించి, ఏం వంద సార్లు చెప్పాలా అని సన్నగా ప్రియుణ్ణి సాధింప జేయగల కొంటెవాడు.
మారదు లోకం, మారదు కాలం, ఎవ్వరు ఏమైపోనీ
నిగ్గదీసి అడుగు, నిప్పులతో కడుగు ఈ సమాజ జీవఛ్ఛవాన్ని, మారదు లోకం, మారదు కాలం
అంటూ, సమాజాన్ని మార్చేసాం,అని, నిప్పులతో కడిగి నిగ్గదీసిన వారెందరు చరిత్రలో లేరు? ఐనా సమాజం మారిందా? లేదు మారదు అని నొక్కి వక్కాణించి చెప్పిన మేధావి. సమాజం మారదు ఎవరు ఏమైపోయినా కాలం మారదు, మారుతుందనే భ్రమలో బతక్కు, నిజాన్ని చూడు అని చెప్పిన విప్లవవాది.
జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది.
సత్యం.ఈ మానవ సమాజం అంతా ఒక కుటుంబం కాని ఎవరి బతుకు వారిదే, ఎవరిచావు వారిదే అనే నిష్టుర సత్యాన్ని సినీ పాట ద్వారా సామాన్యులకి చేర్చగల తాత్వికుడు.
బిచ్చమడిగేవాని నేమి అడిగేది, బూది నిచ్చేవానినేమి కోరేది?
నిందాస్తుతితో శంకరుణ్ణి వశంకరుణ్ణి చేసుకునే మార్గాన్ని బోధించినవాడు. కోరికలతో వేగిపోకు, కర్మఫలం అనుభవింపక తప్పదు, ఈ ఉపాధిలో కొత్తగా కర్మఫలాన్ని పొగేసుకోకు, బూది అంటే వైభమనే మాట చెప్పి తనలో కలుపుకునే వైభవాన్ని ఇచ్చేవాడిని ఇంకా ఏమడుగుతావన్న వేదాంతి.వేదాంతాన్ని చినచిన్న మాటలలో సినీ గేయంలో ప్రజలకి చేరువజేయగల నేర్పరైన మిత్రుడు నిజంగానే బోళా శంకరుడు.కుడుము చేతికిస్తే పండుగనుకునేవాడు.
నిజమే నిజంగానే భోళా శంకరుడు కనుకనే ఏకాదశి మరణం ద్వారా నిరూపితమయింది. ఏకాశి మరణం ద్వాదశి దహనం అన్నవి పుణ్య ఫలశేషాలని పెద్దల మాట.మరో మాట కూడా చెబుతుంది లోకం, ఎమీ తెలియనివానికి ఏకాశి మరణం, అన్నీ తెలిసినవానికి ఆమావాస్య మరణం, అని.మిత్రుడు ఏకాదశి రోజు ఇహలోక యాత్ర ముగించి పరలోకానికి చేరిన వాడు వైకుంఠ ప్రాప్తి చెందినట్టుగానే భావిస్తాను.
ఎంతచెప్పినా మిత్రుడు లేనిలోటు తీర్చరానిదే. మిత్రుని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ స్మృత్యంజలి ఘటిస్తున్నాను.
---------------------------------
మిత్రుని గురించి ఎంత చెప్పినా కొంత మిగిలుంటుంది.మిత్రుని మరణ వార్తను నాకుటుంబ సభ్యులు చేరవేశారు నాకు, ఆ తరవాత మిత్రులు విన్నకోటవారు తెలియజేశారు.కొంతకాలంగా కంటికి విశ్రాంతినివ్వడం కోసం అన్ని మీడియాలనుంచీదూరంగా ఉన్నాను. ఫోను కంప్యూటర్లు వాడటం లేదు, చదవను కూడా మానేశాను. సృత్యంజలి సమర్పించడం ఆలస్యమయింది.