ఇంటి దగ్గర సుగరు/బి.పి చూసుకోవడం
ఒకప్పుడు సుగర్ చూడాలంటే ఉదయమే లేవగానే మూత్రం పట్టి దానిని డాక్టర్ దగ్గరకి పట్టుకెళితే పరిక్ష నాళికలో పోసి వెచ్చచేసి బెనిడిక్ట్ సొల్యూషన్ వేస్తే ఆ మూత్రం రంగు మారేది, ఆ రంగు నీలంగా ఉంటే సుగర్ లేనట్టూ, ఇటుక రంగు వస్తే ఎక్కువున్నట్టూ, ఇలా రంగులనిబట్టి ఎంత సుగర్ ఉన్నదీ చెప్పేవారు. ఇది ఆ తరవాత కాలంలో అవసరాన్ని బట్టి ఇంటి దగ్గరే చేసేవాళ్ళం. రోజులు మారేయి, ఒక రక్తపు చుక్కతో సుగర్ చెప్పేరోజులొచ్చాయి. ఇందులో కూడా తేడాలు. ఒకప్పుడు ఒక సి.సి రక్తం తీసుకుని టెస్టు చేసేవారు, ఇప్పుడు ఒక చుక్కచాలు.ఆ రోజుల్లో లేబ్ లు లేవు, నేడు లేబ్ లు చాలా ఉన్నాయి. కరోనా కాలంలో సుగరూ బిపి లు చూసుకోవడానికి లేబ్ వారిని రమ్మన్నా,వెళ్ళినా ఒకటే :) అందుచేత ఇంటి దగ్గరే సుగర్ టెస్టు చేసుకునే విధానం ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఈ సాధనాలు చాలాకాలం కితమే ఉన్నా వీటి అవసరం ఇప్పుడు బయట పడింది, ఎందుకూ, కరోనా తో మనిషిని చూస్తే భయం మూలంగా
సుగర్ చూసుకునే మిషన్ని గ్లూకో మీటర్ అంటారు. చాలా కంపెనీలు తయారు చేస్తున్నాయి, కొన్ని ఉచితంగా కూడా ఇస్తున్నాయి.లాభం లేందే సెట్టి వరదని పోడని సామెత. ఈ మీటర్ ఊరికే వచ్చినా ఇందులో టెస్టుకోసం ఉపయోగించే స్టిక్కులు కొనుక్కోవాలి, అదీ అసలు సంగతి.ఈ meter ఖరీదు తక్కువే పదేను వందలలోపు, స్టిక్కులు మాత్రం ఒక్కోటి పన్నెండు రూపాయలపై మాట.
ఇక బి.పి ఇది పది నిమిషాల వ్యవధిలోపలే రీడింగ్ మారిపోతూ ఉంటుంది.ఐతే సిస్టోలిక్ మారుతున్నా డైస్టోలిక్ అంత వేగంగా మారదు. దీనికీ మీటర్ దొరుకుతున్నాయి. ఇప్పుడు డాక్టర్లు బి,పి చూడటం లేదు, ఆటొమేటిక్ డిజిటల్ బి.పి మీటర్ తో నర్సులే చూస్తున్నారు, ఫలితం నోట్ చేస్తారు, డాక్టర్ చూస్తారు. దీనిని ఇంటీ దగ్గరె చూడచ్చు. మీటర్ ఉన్నదని అస్తమానమూ చూస్తే గాభరా పుడుతుంది.ఇది కూడా ఐదు వేలలోపే ఖరీదు. అనుమానం తీర్చుకోడానికి పనికొస్తుంది, అంతే. రీడింగులు చూసి గాభరా పడద్దు.
ఇక అసలు విషయానికొస్తే ఏ రెండు మీటర్లూ ఒకలా చూపవు.ఇక ఈ సుగర్ మీటర్ సంగతి, మన దగ్గర మీటర్ ఎక్కువ రీడింగ్ చూపుతుంది, లేబ్లో మీటర్ తక్కువ చూపుతుంది. మోసంకాదా అనిపిస్తుంది,ఆవేశపడ్డాకూడా. తెలిసినవారు విషయం వివరించినది చెబుతా. మనం తీసుకునే రక్తపు చుక్క ధమనులనుంచి వచ్చే రక్తం. లేబ్లో టెస్ట్ కోసం మన దగ్గర తీసే రక్తం సిరల నుంచి.ధమనుల్లో రక్తంలో గ్లూకోస్ శరీర చివరి భాగాల దాకా అందిస్తుంది కదా! దానిలో గ్లూకోస్ ఎక్కువ ఉంటుంది, సిరలలో రక్తంలో అది తక్కువ ఉంటుంది. సిరలలో రక్తం ఎందుకు టెస్ట్ చేస్తారు? చెప్పలేను. ఇలా ఈ తేడా ఎంతా అన్నది తెలియాలంటే లేబ్ కి రక్తం ఇచ్చిన వెంటనే మనమూ మన దగ్గర మీటర్ తో చూసుకుంటే తేడా తెలుస్తుంది. ఇది సాధరణంగా 20'% ఉంటుందంటారు. కాని నా అనుభవం 38% తేడా ఉంది, మరి రెండు మూడు సార్లు తేడా గమనించాలి.
ఇక బిపి మీటర్లో ఈ తేడాలు గమనించలేం.కాని బిపి తీసుకునే ముందు జాగ్రతలూ తెలిసినవే చెబుతా. నడచిన వెంటనే, సైకిల్ తొక్కిన వెంటనే, భోజనం, టిఫిన్ చేసిన వెంటనే బిపి ఎక్కువ ఉంటుంది.ఇక మాట్లాడుతూ బిపి చూసుకుంటే ఎక్కువ ఉంటుంది. కుర్చీలో కూచుని కాళ్ళు కత్తెరేసి కూచుంటే బిపి ఎక్కువ చూపుతుంది. అంతెందుకు మీ చేతికి కట్టే బేండు వదులుగా కడితే బీపీ పరిగెడుతుంది. అందుచేత మీ శరీర పరిస్థితి గమనించుకోవాలి. అవసరాన్ని బట్టి డాక్టర్ని సంప్రదించాలి. కంగారు పడిపోకూడదు సుమా!ఈ రీడింగులు చూసుకుని మందులు మానెయ్యడం డోసులు మార్చేసుకోడం చేయకూడదు, ప్రమాదం తెచ్చి పెడతాయి. తస్మాత్ జాగ్రత.