కరోనా నడక
కరోనా తగ్గిందా? పోయిందా? తగ్గిపోయిందా??ఏమోగాని వాళ్ళని తీసుకెళ్ళేరు,వీళ్ళని తీసుకెళ్ళేరు, నలుగురు హౌస్ క్వారంటైన్ వార్తలు లేవు.మా ఊళ్ళో ఒక కరోన ప్రైవేట్ హాస్పిటల్ ఖాళీగానే ఉందని వార్త.పల్లెటూళ్ళలో పెద్దగా అలజడి లేదు. వర్షాలు వెనకబట్టేయి ఒక వారం నుంచి, చలి తిరిగింది కొద్దిగా. బడి తీస్తారట, కార్పొరేట్ల సంబరమేమో! ఏమో పిల్లలు కదా, భయంగానే ఉంది. ఒక తరం జారిపోతోంది, మారిపోతోంది.
కరోన వార్తలకి లోటు లేదు. వారాలు, టెస్టులు, కరోన తెలియడం, ఏం లేదు మూడు రోజుల్లో అంతా ఫినిష్ ఒక వార్త, గుండెలవిసేలా, అదేం ఆనందమో. మరోవార్త ఇదంతా హంబగ్ చైనాను ఒంటరి చెయ్యాలనే ప్రయత్నం, అందులో మోడిగారు కూడా ఉన్నారు. పాపం చైనా ఎన్ని కష్టాలలో ఉందీ ఇది మరో వార్త. జర్మనీ,బ్రిటన్, ఇటలీ, France మళ్ళీ లాక్డవున్ అంటున్నాయి, మనమేమో ఓపెన్ అంటున్నాం, ఇదేంటీ. అదుగో వాక్సీన్ ఇదిగో, వాక్సీన్, అన్నీ సిద్ధం చేసుకోండి మరో వార్త. ఏదో ఒకటి అమ్మేసుకుని సొమ్ము చేసుకోవాలి, కొంతమంది తాపత్రయం.
కరోనాకీ వలపక్షమే.ఎ బ్లడ్ గ్రూప్ వాళ్ళమీద పిలవకపోయినా వాలిపోతుందిట. బి గ్రూపంటే మొహమాటంట. ఎబి వాళ్ళంటే ముట్టదుట, ఒ గ్రూపంటే భయమేనట. సరే ఆడాళ్ళంటే మొదలే భయంకదా కరోన కి. ఇక కరోన వచ్చి తగ్గినవాళ్ళ గురించి ప్రచారమూ లేదు, వాళ్ళ సంగతీ తెలీదు. మరోమాట కరోన వచ్చి తగ్గిన పదిమందిలో ముగ్గురికి మాత్రం మానసికరోగం చిరస్థాయిగా ఉంటుందిట. కొంతమందికి దీర్ఘకాలానికి కొన్ని వ్యాధులు బయట పడతాయని కొందరి ఉవాచ. ఏంటో! అంతా విష్ణు మాయ.! ఏది నిజం పరమాత్మకీ తెలియదేమో!
ఏదొచ్చినా బాలీ ఉడ్ వారికి వింతే. పోయేవాళ్ళు పోతున్నారు.పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పుట్టేవాళ్ళు పుడుతున్నారు. బాలీవుడ్ కి చెడ్డకాలం సెలిబ్రిటీలు రాలిపోతున్నారు. కష్టజీవులకి, మురికివాడలవారికి కరోన రాదు, ఇదో రిసెర్చ్ రిజల్ట్, మరో వార్త, ఎందుకంటే వారి వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉంది, అశుభ్రమైన ప్రదేశంలో బతుకుతున్నారు కనక, ఎవరిష్టం వారిది, ఎవరివార్త వారిది. బలమైన జీవులే బతుకుతాయన్నది సైన్స్ వారి వార్త అంతేకాదు, ఇది ప్రకృతి చెప్పేమాట. Survival of the fittest. దీనికి కావలసింది రోగ నిరోధక శక్తి, అదెలా వస్తుందిబాబూ, ఎక్కడ దొరుకుతుంది,మార్కెట్లో దొరుకుతుందా? డాక్టర్లని ఆశ్రయిస్తే విటమిన్ డి మాత్రలేసుకో అంటున్నారు.రోజూ నడవండోయ్! ఉదయంచిన సూర్యుణ్ణి చూడండొయ్! డి విటమిన్ చేరుతుంది, రోగ నిరోధక శక్తి అదేవస్తుందంటే, ఎండోపతీ అని నవ్వినవారున్నారు.పోనిద్దురూ ఎవరిష్టం వారిది కదా,లోకో భిన్నరుచిః. ఏడెనిమిది నెలనుంచి కాలు బయట పెట్టలేదు, నడకలేదు, ఇంట్లోనే మిడుకుతున్నామని నడక మొదలెడదామనుకున్నా, విజదశమిరోజు. ఆలోచనొచ్చేటప్పటికే సాయంత్రమయింది,మర్నాడనుకుంటే ఏకాదశీ సోమవారం, దగ్ధయోగమని మానేశా :) మంగళవారం మొదలెట్టేను.
కర్రపుచ్చుకు బయలుదేరినా, కాలు నిలవటం కష్టంగానే ఉంది. తేలిపోతానో,తూలిపోతానో,పడిపోతానో, తూలిపడిపోతానో అని నెమ్మదిగా కుంటుకుంటూ, గ్రవుండికి చేరా! అన్నీ ముసిలి తలకాయలే! రండి రండంటూ చేతులూపుతూ స్వాగతం పలికేసేరు. అందరికి పలకరింపు చేతులు ఊపేసి, నమస్కారబాణాలలా, ట్రేక్ కిదణ్ణం పెట్టి అడుగు ముందు కేసాను. కాళ్ళకి సూదులు గుచ్చినంత బాధ. వర్షాలకి ట్రేక్ మీద గులక రాళ్ళు తేలాయి. అలాగే నెమ్మదిగా నడిచా! నాలువందల మీటర్లు నడవడానికి పదేను నిమిషాలు పట్టింది.పక్కనే ఉన్న పచ్చగడ్డి మీద నడిచా, బాగుందిగాని పల్లేరు కాయలు గుచ్చుకున్నాయి. కుంటుకుంటూ పక్కనే ఉన్న ప్లాట్ పాం మీదకి చేరా, బాసిన పట్టు వేసుకుని కూచుందామని. అబ్బే కాళ్ళు దగ్గరకి రావే! వామో! ఏదో ఐపోతోందనుకుని నెమ్మదిగా కాళ్ళు దగ్గరకి తీశా. కాళ్ళు నొప్పులెట్టేశాయి. నెమ్మదిగా ఇoటికి చేరా. మర్నాడు నడవగలనా అనుమానమే వచ్చేసింది. ఏమైనా నడవాలని ట్రేక్ మీద నడిస్తే పదినిమిషాలు పట్టింది. ఫరవాలేదనుకుని కాళ్ళు నొప్పులున్నా నడక మానలేదు. ఆదివారానికి నాలుగువందల మీటరు నడవడానికి ఆరు నిమిషాలు పట్టింది. పచ్చ గడ్డి మీద 8 లూప్ నడక చేయడం మొదలెట్టా. బాసినపట్టు వేసి పావుగంట కదలకుండా కూచున్నా! సాధనమున పనులు సమకూరు ధరలోన!
మూడో రోజనుకుంటా పై చిత్రంలోలా రక్తపుముద్దలా భాస్కరుని దర్శనమైంది, ఫోటో తీసి నమస్కారం పెట్టుకునే లోపే ఫోన్ టింగ్ మంది, ఇంత పొద్దుటే ఎవరబ్బా! ఎవరూ ఇంకా మంచాలమీంచే దిగరుకదా అనుకుంటూ చూస్తిని కదా ఒ పజ్జం ఊడిపడింది :)