అవి ఒక పట్నంలో ఉండి పల్లెల ఉద్యోగం చేస్తున్న రోజులు. ఏరోజూ ఖాళీ ఉండేది కాదు. టవున్ లో పని చేస్తున్నతను ఔట్డోర్ పరిచయం తక్కువున్నవాడు. టవున్ కి కేబుల్ ప్లాన్ వేయాల్సివచ్చి వేసి పంపితే రెండు సార్లు తిరిగొచ్చిందని, సాయం చేయమని కోరేడు, టవున్ జె.యి. ఉండడం టవున్ లోనే ఉన్నా గాని పూర్తిగా టవున్ చూడలేదు. టవున్ ఒక సారి కాలి నడకనే తిరగాలి అని బయలుదేరి మూడు రోజులు సందులు గొందులు తిరిగేసేం. మూడో రోజు నడుస్తుండగా ఒక ఇంటి ముందు నా సహచరుడు నన్ను ఆపి నేం బోర్డ్ చూపించాడు. నా ఇంటి పేరు కనపడింది, చుట్టాలా? ప్రశ్నించాడు. ఒకే ఇంటి పేరు అనేకమందిలో ఉంటుందనీ, ఒకే ఇంటి పేరున్నవాళ్ళంతా చుట్టాలు కారని చెప్పి ముందుకు అడుగేయబోయా. మిత్రుడు మాత్రం వీళ్ళు మీ వాళ్ళే, ఈయన ఊళ్ళో కొంచం పెద్దవాడు కూడా. కలిసొద్దాం అని లోపలికి అడిగేశాడు. నేను అడుగు కలపక తప్పలేదు.
ఆయన హాల్ లోనే ఉన్నాడు, పెద్దవాడని బీరువాలూ పుస్తకాలూ వగైరా చెప్పకనే చెబుతున్నాయి. మా మిత్రుడు తనను తను పరిచయం చేసుకుని, నన్నూ వీరు ఫలానా, పల్లెటూళ్ళు చూస్తారు, మీ ఇంటి పేరువారే అని పరిచయం చేశాడు, తను ఆయన ముందున్న కుర్చీ లాక్కుని కూచుంటూ. ఆయన కనీసం కూచోమని కూడా అనలా. కుర్చి లో కూచున్న ఆయన కొద్దిగా ముందుకు కూడా వంగలేదు, అంటే కనీసం కుతూహలం కూడా చూపించలేదు. మాటా లేదు, చూస్తూ ఉండిపోయాడు, కనీసం మంచి నీళ్ళు తీసుకుంటారా అని కూడా అడగలేదు.. నాకైతే ఏం మాటాడాలో కూడా తోచలేదు, నోరు పెగుల్చుకుని, నాపేరు చెప్పుకుని ఈ ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నా, టెలిఫోన్ జ్.యి గా, మా ఇంటి పేరు కూడా మీ ఇంటి పేరే! మిత్రుడు చెబితే పెద్దవారిని కలుద్దామని వచ్చాము, వేరే ఏమీ పని లేదని, చూచి పోదామని వచ్చామని చెప్పేను. ఆయన చూడడం అయిందిగా ఇక దయచెయ్యమన్నట్టు ముఖం పెడితే చాలా ఇబ్బంది పడ్డాను, నన్ను చూసి మిత్రుడు ఇబ్బంది పడిపోయాడు, కుర్చీలో ఇబ్బందిగా కదిలాడు. నేను లేచి నమస్కారం, వస్తాం అని చెప్పి వెను తిరిగి చూడక వచ్చి బయటికి వచ్చేశాను. మిత్రునితో కూడా మాటాడాలనిపించలేదు. నన్ను చూసి మిత్రుడూ పలకరించలేదు. ఇంటి కొచ్చేశాం.
ఇంటికొచ్చిన తరవాత ఇల్లాలికి విషయం చెప్పాను.ఇల్లాలు ''పిలవని పేరంటానికి వెళ్ళ కూడదు, జరిగిందేదో జరిగింది, మరచిపొండి'' అంది. నేను సద్దుకో లేకపోయా! అవమానంగానే తోచింది. మర్నాడు మిత్రుడు వచ్చి కలిసి, " సారీ! మిత్రమా, నిన్న సాయంత్రం నేను చేసినది తప్పు,మన్నించు" అన్నాడు. ఇల్లాలు నాకు చెప్పినమాట మిత్రునికి చెప్పాల్సివచ్చింది.
చుట్టాలకి దూరంగా నీటికి దగ్గరగా ఉండాలని సామెత.