అధిక విద్యావంతు లప్రయోజకులైరి
పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతుల మాట జన విరోధంబయ్యె
వదరుబోతుల మాట వాసికెక్కె
ధర్మవాసన పరుల్ దారిద్ర్య మొందిరి
పరమలోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగభూత పీడితులైరి
దుష్ట మానవులు వర్ధిష్ణు లైరి
పక్షివాహన మా వంటి భిక్షుకులకు శక్తి లేదాయె, నిఁక నీవె చాటు మాకు
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర !! (52)
ఓ నారసింహా ! ఈ లోకమదేమిటో కాని అతి విచిత్రంగా మారుతోంది. బాగా చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతున్నారు. ఏమాత్రం చదువు రాని శుంఠలు సభాపూజ్యులై సన్మానాలు పొందుతున్నారు. నిజం చెప్పేవారి మాట లోకవిరోధమౌతోంది. అబద్దాలాడేవారికి సమాజం లో అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ధర్మబుద్ధిగలవారు దారిద్య్రాన్ని అనుభవిస్తుంటే పిసినారులు ధనవంతులై కులుకు తున్నారు.పుణ్యాత్ములు రోగగ్రస్థులై పీడించబడుతుంటే పాపాత్ములు పల్లకీలలో ఊరేగుతున్నారు. ఓ గరుడవాహనా ! మావంటి యాచకులకు ఎటువంటి పోషణలేదు నీవే మాకు దిక్కు.
Courtesy: Owner
నృసింహ శతకకర్త కాకుత్స్థం శేషప్ప కవి. పద్దెనిమిదవ శతాబ్దం వాడన్నారు. కవిగారి ఊరు ప్రస్తుతం తెలంగాణాలో ఉన్న ధర్మపురి దగ్గర అని తెలుస్తోంది. తెలుగు కవుల స్థల కాలాల మీద చాలా చర్చ జరుగుతోంది, అప్పుడప్పుడు. నిజం మాత్రం తెలియటంలేదు. అప్ప,అయ్య,అన్న, అమ్మ,అక్క నామాంత్యాలుగా తెలుగునాట పేర్లున్నమాట నిజం, ఇప్పుడవి లోపించడమూ నిజం. ఏమైనా ఈ శతకాన్ని వారే రాశారన్నదాని మీద విచాదం మాత్రం లేదు, నాకు తెలిసి, ధన్యుడను.
చిన్నప్పుడు నాలుగు శతకాలు బట్టీ వేయించేవారు. అవి సుమతీ శతకం,వేమన శతకం, భాస్కర శతకం, నృసింహ శతకం. కొద్ది వయసొచ్చాకా మరి కొన్ని శతకాలూ చదువుకున్న రోజులు. ఈ కోవలోనివే భర్తృహరి శతకాలు. ఇవి సంస్కృతంలో ఉండడంతో ఏనుగు లక్ష్మణ కవిగారు తెలుగు చేసిన పద్యాలే సంస్కృతం వాటికంటే అందంగా ఉంటాయి నాకు. భాగవతం వ్యాసుడు సంస్కృతంలో రాసినా నాకు పోతరాజుగారు రాసిన తెలుగు భాగవతమే అసలైనదనిపిస్తుంది, నచ్చుతుంది కూడా.
పలికెడిది భాగవతమట
పలికించెడువాడు రామభద్రుండట నే
పలికిన భవహరమగునట
పలికెద వేరొండు గాథ పలుకగనేలా!
భాగవతం చెబుతున్నా! పలికిస్తున్నవాడు శ్రీరామచంద్రుడు,భాగవతం చెబితే ముక్తి లభిస్తుందిట, మరెందుకు మరొకటి చెబుతానూ! మరొకగాధ చెప్పను, భాగవతమే చెబుతానన్నది అర్ధం.
దీనికేంగాని నృసింహ శతకంలో కవిగారు కాచి వడబోసిన జీవిత సత్యాలు చెప్పేరు, అవి సార్వజనీనం, అంతే కాక ఏకాలానికైనా సరిపోయేవే! ఈ పద్యంలో కవిగారు చెప్పినది నేటి కాలానికి అతికినట్టు సరిపోతుంది చూడండి.
”అధిక విద్యావంతులప్రయోజకులైరి” దీనితో మొదలు పెట్టేరు, పద్యం. ఏ దేశంలోనైనా ఎక్కువ చదువుకున్నవారు విజ్ఞానులనీ ఆత్మాభ్యుదం తరవాత, దేశాభ్యుదయం కోసం పని చేస్తారనీ, చెయ్యాలనీ సామాన్యులు కోరుకుంటారు. అసలీ అధిక విద్యావంతులెక్కడుంటారు? ప్రభుత దగ్గర, విశ్వవిద్యాలయాల్లోనూ కదా! నిజంగానే వీరిలో కొందరు నేడు మనదేశంలో అప్రయోజకులుగానే ఉన్నారు. వీరిలో ఆడ మగ తేడా కనపడటం లేదు.
విశ్వవిద్యాలయాలలో ఉన్నవారు సొమ్ముకు సర్టిఫికట్లు అమ్ముకునే వ్యాపారంలో ఉన్నారు. లేదూ స్త్రీ లోలత్వానికి లోబడిపోయారు. ఇక వీరు స్త్రీలైతే చదువుకోడానికొచ్చినవారిని వ్యభిచారం రొంపిలో దింపి సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు ఆయుధాలు పట్టుకుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయమని యువతని ప్రేరేపిస్తున్నారు. వీరి పిల్లలు మాత్రం విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మీరు చెప్పేదాన్ని మీరెందుకు అమలు చేయరంటే, నేను సిద్ధంత కర్తను మాత్రమే, నా భార్య పిల్లలికి కూడా చెప్పేను, వారు వినిపించుకోలేదు. వ్యక్తి స్వాతంత్ర్యం ఉన్నదికదా,వారినెలా బలవంత పెట్టగలను అంటున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఉన్న మేధావులు ఇలా ఉన్నారు, అందరూ అనను సుమా!
ఇక ప్రభుతలో ఉన్న మేధావులెలా ఉన్నారయ్యా అంటే, దేశం ఏమైనా బాధలేదు, ఎవరేమనుకున్నా ఇబ్బందీ లేదు,ధన సంపాదనే ధ్యేయమన్నవారున్నారు. దేశ వనరులపై కొంతమందికి మాత్రమే ప్రథమహక్కుందన్నవారూ ఉన్నారు. ఇలా అధిక విద్యావంతులలో కొంతమంది కవిగారు చెప్పినట్టే ఉన్నారు కదా!
ఇప్పటికే టపా చాలా పెద్దదయింది, మిగిలినవి తరవాత