Sunday, 22 December 2019

కనులు తెరచినా నీవాయె కనులు మూసినా నీవాయె

భారతిగారి టపాలు చూసిన తరవాత కలిగిన ఆలోచన

ఒక్కటే 
పరబ్రహ్మమొక్కటే
సగుణం, నిర్గుణం కూడా
ఈ చరాచర జగత్తంతా బ్రహ్మమే
చరాచర జగత్తంతనీ పరబ్రహ్మంగా చూడగలిగితే?
 కామ,క్రోధ,మోహ,లోభ,మద, మాత్సర్యాలు లయం కాకనే
అలా చూడలేకనే బాధంతా!
బ్రహ్మము ఒక్కటే ఐనపుడు ఇన్ని రూపాలేల?
 లోకో భిన్న రుచిః 
పుఱ్ఱెకో బుద్ధి జిహ్వకో రుచి కదా 
ఎవరికిష్టమైన రూపు వారు ధ్యానించచ్చు.
ఎలా?
పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్... ప్రహ్లాదుని మాట.  
కాని ఈ నిలకడ కనపడటం లేదు
కాలంతో 
కనులు తెరచినా నీవాయె కనులు మూసినా నీవాయె అనే తత్త్వం అర్ధమైనపుడు
అంతా పరబ్రహ్మమే!

”నేను” సాధిస్తున్నాను ఒట్టి మాట.
నాచే తెలుసుకోబడుతున్నాడు డొల్లమాట.
పంచేంద్రియాలే ఇంకా రాజ్యమేలుతున్నపుడు


”నేను” ఇంకా చమురున్న పెంకు..అది పూర్తిగా కాలేదాకా...ఇంతే!

Thursday, 12 December 2019

నాస్తి జాగరతో భయం




       కృషితో నాస్తి దుర్భిక్షం
జపతో నాస్తి పాతకం
మౌనేన కలహో నాస్తి
నాస్తి జాగరతో భయం



ఐడియా బాగానే ఉందిగాని ప్రమాదం జరిగేటపుడు పరిస్థితులు ఇలా ఉండవు. సిలిండరు వంట ప్లాట్ ఫాం కింద ఉంటుంది. అప్పుడిలా చేయడం సాధ్యమా?  అందుచేత మరో ఐడియా

ఇదీ తెలుసున్నదే. 

మందపాటి, దుప్పటిలాటి దానిని తడపి సిలిండర్ చుట్టూ కప్పేయండి. సిలిండర్ దగ్గరికి పట్టుకెళ్ళేటపుడు విడదీసి మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ పట్టుకెళ్ళండి, సిలిండర్ మీద కప్పేయండి. మంటలు ఆరిపోతాయి, రెగులేటర్ కట్టేయండి. బస్. 

ఇలా గుడ్డ తడపడం సమయం పడుతుంది, అవును. అందుకుగాను, గోనె బస్తాని వంటింటి గుమ్మం దగ్గర తడిపి వేసి ఉంచండి, కాళ్ళు తుడుచుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడూ తడిపి ఉంచండి. అవసరం వస్తే తీసి విప్పి సిలిండర్ మీద వేయండి. ప్రమాదం తప్పించుకోండి. సిలిండర్ దగ్గర కాక స్టవ్ దగ్గర మంటలొచ్చినా ఇలాగే తడిపిన గోనె వేయండి. రక్షణ పొందండి.

తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు
౧.వంటింటిలో ఉన్నంత సేపు సింథటిక్ వస్త్రాలు ధరించకండి
౨.వంటింటిలో ఉన్నంత సేపు సెల్ఫోన్ వదిలేయండి.
౩.సెల్ ఫోన్ వంటింటిలో కి తేకండి 
౪.ఎవరితో నైనా అర్జంటుగా మాటాడక తప్పకపోతే గేస్  కట్టేసి వంటింటి బయటికొచ్చి మాటాడండి. 

ఇది మీకోసం, మన కోసం, మనందరికోసం.

Tuesday, 10 December 2019

పీతల మంగం

పీతల మంగం

అనగనగా ఒక ఊరు. ఆ ఊరు చెరువులో చేపలు పడుతున్నాడో జాలరి. వల వేసి పట్టిన వాటిలో చేపలు,పీతలు, నత్తలు ఇలా చాలా రకాలున్నాయి. చేపల్లో కొన్ని వలలో పడి కూడా ఎగిరి ఎగిరి పడుతున్నాయి. అలా ఎగిరిపడుతున్న, చచ్చినట్టు పడున్న చేపలన్నిటినీ ఒక బుట్టలో వేసి బుట్ట మూతకి ఉన్న తాడు దగ్గరకి లాగేస్తున్నాడు, చేపలు ఎగిరెగిరి పడుతున్నాయిగాని తప్పించుకోలేకపోతున్నాయి. ఇక మిగిలిన పీతల్ని తీసి ఒక మంగం అంటే వెడల్పైన మూతిగల బుట్టలో వేస్తున్నాడు. మిగిలిన నత్తలు వగైరాలని నీటిలోకి విసిరేసేడు. వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ మళ్ళీ వల వేయడానికి వెళుతున్నాడు. 

ఇదంతా పరీక్షగా చూస్తున్న ఓ పని లేని పోలయ్య జాలరిని ఆపి, ''చేపల్ని బుట్టలో వేసి బుట్ట మూత దగ్గరకి నొక్కేసేవు, మరి పీతల్ని అలాగే మంగంలో వదిలేసేవే, అవి తప్పించుకుపోవా?'' అని అడిగాడు. దానికి జాలరి, ''ఇక్కడే ఉండి చూడు,ఏం జరుగుతుందో, కుక్కగాని రాగలదు జాగ్రత'' అని వలపుచ్చుకుని చెరువులో దిగేడు. వల విసిరి మళ్ళీ చేపల్ని పట్టేడు, గట్టుకొచ్చి చేపల్ని బుట్టలో వేసి బుట్ట మూత దగ్గరకి నొక్కేడు, పీతల్ని మంగంలో పడేసేడు. 

అప్పుడు పనిలేనిపోలయ్యని ''నేను వలపట్టుకుని చెరువులో దిగిన తరవాతేం జరిగిందో చెప్పు'' అన్నాడు. దానికి పోలయ్య ''చేపలు తప్పించుకోలేకపోయినా బుట్టలో ఎగిరెగిరి పడుతూనే ఉన్నాయి.  ఇక పీతలు మంగంలో నుంచి తప్పించుకోడానికి మంగం అంచుకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాయి, నాలుగు వైపులనుంచీ. ఒక పీత పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటే మరో పీత దాని కాళ్ళు పట్టుకుని కిందకి లాగేస్తోంది. ఇలా ఒకరి కాళ్ళొకరు పట్టుకుని లాగేసుకుంటున్నందున పీతలన్నీ మంగంలోనే ఉండిపోయాయి. ఒక్కటీ తప్పించుకోలేదు. ఏంటీ చిత్రం'' అని ఆశ్చర్యపోయాడు.

''పోలయ్యా! ఇంత చూసిన తరవాత కూడా నీకు అర్ధం కాలేదా? ఇవి తెనుగు పీతలయ్యా'' అనేసి మంగంలో వలని చేపల బుట్టని సద్దుకుని వెళిపోయాడు. 

కత కంచికి మనం ఇంటికి. 

Sunday, 8 December 2019

లవంగ చిక్కుడు

లవంగ చిక్కుడు ఆకు

లవంగ చిక్కుడు  పూవు
లవంగ చిక్కుడు కాయ

Friday, 6 December 2019

కాలంలో కన్న బిడ్డ

కాలంలో కన్న బిడ్డలేనా ఉండాలి కాలంలో గడించిన డబ్బేనా ఉండాలంటారు, ఇదొక సామెత, జీవిత సత్యం.

పెద్దవయసులో జీవితం గడవాలంటే కాలంలో కన్న బిడ్డలేనా ఉండాలి కాలంలో సంపాదించిన సొమ్మేనా ఉండాలంటారు,

ముందుగా చెప్పినది కాలంలో కన్నపిల్లలు. కాలంలో కన్నపిల్లలంటే యుక్తవయసు ఇరవై, ముఫై సంవత్సరాల మధ్య కలిగిన పిల్లలు. అదేం. వీరు ఆ కాలంలో కలిగితే స్త్రీ బిడ్డని కనడానికి,పెంచడానికి తగిన శారీరిక, మానసిక శక్తులు కలిగి ఉంటుంది. మగవాడికి ఏభై సంవత్సరాలొచ్చేటప్పటికి బిడ్డ చేతికందొస్తాడు.బిడ్డలు, తల్లి తండ్రులకి ఏమీ చేయకపోయినా తన కాళ్ళమీద తను నిలబడగలడు/దు. అతని బతుకు/ఆమె బతుకు వారు బతకగలరు. వారిని సాకాల్సిన అవసరం ఉండదు. వారే తల్లితండ్రులను చూడగలరు. ఈ కాలంలో చూస్తున్నారా అని అడగచ్చు, అందరూ చూడనివాళ్ళే ఉండరు. స్త్రీకి వయసు ముదిరిన తరవాత బిడ్డ బరువే, కనడానికి పెంచడానికి కూడా. ఇప్పటి రోజుల్లో నలభై దగ్గరగా కాని మగ ఆడ వివాహం గురించే తలపెట్టటం లేదు. మరి వీరికి బిడ్డలు పుడితే! అమ్మో ఊహించడమే కష్టం. కొంతమంది సహజీవనం చాలు,బిడ్డలక్కరలేదు అన్నవారూ కనపడుతున్నారు. వీరిలో స్త్రీల శాతం హెచ్చుగా ఉందనుకుంటా. ఇక బిడ్డలు లేనివారు, తమ్ముళ్ళో,చెల్లెళ్ళో చూడకపోతారా అనుకోవచ్చు, స్త్రీ పురుషులిద్దరూ కూడా.. పొరబాటు. ఎవరూ చూడరు, కడుపున కన్నవాళ్ళే చూడని రోజులు. ఎవరిగోలవారిదే! వీరు డబ్బున్నంతకాలమే చుట్టూ ఉంటారు. ఈ విషయంలో శంకరుల మాట గుర్తుంచుకోవాలసినదే, యావద్విత్తో పార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః, డబ్బు ఉన్నవరకు,డబ్బు సంపాదించే వరకు నిజపరివారం కూడా ఉంటుంది. 

అందుకుగాను చేయవలసినది వయసులో డబ్బు సంపాదించడం కూడా తప్పక చేయాలి, సొమ్ము కూడ బెట్టాలి, తప్పక. ఎంత? ఇది తెలుసుకోవడమే విజ్ఞత. ఒక సారి సంపాదన కూడ బెట్టడం మొదలైతే ఈ దాహం తీరేదికాదు, అవగాహన లేకపోతే. తనకు తన భార్య కు తగిన అనగా అవసరాలకు తగిన సొమ్ముండాలి. జరలో బాధించేది రుజ. ఏదో రోజు అందరూ చెల్లిపోయేవారే. చెల్లిపోవడం లో బాధ పడక లేదా తక్కువ బాధతో చెల్లిపోవడమే కావలసినది. ఎంత సొమ్మున్నా ఆయువును కొనలేదు కదా. అందు చేత కాలంలో సంపాదించిన సొమ్ము కావాలి.వయసుడిగిన తరవాత సంపాదన కష్టం.

కాలంలో కన్నబిడ్డలు కాలంలో సంపాదించిన సొమ్మూ రెండూ ఉండి జీన సమతూకం కావాలి.అనాయాసేన మరణం అదృష్టం, అది అందితే..... అలా దాటిపోయినవారే అదృష్టవంతులు



Monday, 2 December 2019

శర్మ కాలక్షేపంకబుర్లు-ఏడిచేవాళ్ళ ఎడం పక్క.........



ఏడిచేవాళ్ళ  ఎడం పక్క కుట్టేవాళ్ళ కుడిపక్క కూచోకూడదు,ఇదొక నానుడి. ఏం ఎందుకు కూచో కూడదూ? కూచుంటే ఏమవుతుంది? ఇది జిజ్ఞాసువుల ప్రశ్న. ఏమవుతుందా?

నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళేవస్తాయన్నారు సినీకవి, ఇది నిజమేకాని ఏడిస్తే మాత్రం కన్నీళ్ళతో పాటు ముక్కులో కూడా నీళ్ళొస్తాయి, ఇది నిజమే... ప్రయత్నించకండి.... :). ఈ ఏడుపుంది చూశారూ, దీని దుంప తెగ దీనికీ ఆడ మగ తేడా ఉందిటండి. ఆడవారి నెత్తిన నీటికుండ సిద్ధంగా ఉంటుందనీ అంటారు. పాపం అలాగయినా వారు తమ గుండె బరువు దించుకుంటారు, మరొకరికి ఆ బరువు ఎక్కించేస్తారు లెండి. ఇక ఏడ్చేవారి ఎడంపక్క కదా అసలు సంగతి,ఏడిస్తే కన్నీళ్ళతో పాటు ముక్కులో కూడా నీళ్ళొస్తాయి కదండీ, వాటిని, కొండొకచో, అవి గట్టిపడి పచ్చని ముద్దగా కూడా తయారవుతాయి. వాటిని సుతారంగా ఎడమ చేతి వేళ్ళ మీదకి చీది, అలా చీదిన పదార్ధాన్ని, అదేలెండి దాని పేరే చీమిడి, దీన్ని నేల మీద విసిరి కొట్టి పక్కన ఏం ఉంటే దానికి చెయ్యి రాసేస్తారు. అమ్మయ్య ఇప్పుడు తెలిసిందా ఎడమ పక్క ఎందుకుకూచో కూడదో!  మనం కూచుంటే మనమీదే చీదెయ్యచ్చు లేదా ఆ చెయ్యి రాసెయ్యచ్చు. మరి కుట్టేవాళ్ళకి కుడి పక ఏమని కదా! ఇప్పుడంటే సూదితోనూ, దబ్బనం తోనూ అసలు కుట్టటమేలేదు. చేతికుట్టు లేనే లేదు, అందుచేత తెలియదు కదా. కుట్టేవారు ఎడమ చేత్తో బట్టని పట్టుకుని కుడి చేత్తో సూది పట్టుకుని బట్టని కుడతారు. అలా కుట్టిన సూదిని దారం ఉన్నంత పొడుగునా పైకి లాగుతారు. అలా పైకిలాగబడిన  సూది కుడి పక్క కూచుంటే మనకి గుచ్చుకోడం ఖాయం కదా! అందుచేత  కుట్టేవారి కుడిపక్క కూచోవద్దన్నారు.


ఏం ఏడం చేతిలోకే చీదుతారా? కుడి చేతితోనే కుడతారా అని అనుమానం రావచ్చు, తప్పు కాదు లెండి. మానవ మెదడు రెండు అర్ధభాగాలుగా ఉంటుంది. అవి ఎడమవైపు అర్థభాగం , కుడివైపు అర్థభాగం. మన శరీరం లో కుడివైపు అవయవాలను మెదడులోని ఎడమవైపు అర్థభాగమూ, ఎడమవైపు అవయవాలను మెదడులోని కుడి వైపు అర్థభాగమూ నియంత్రిస్తుంటాయి. ఎడమవైపు పక్షవాతమొస్తే కుడివైపు మెదడు దెబ్బతిన్నట్టుట.  సామాన్య మానవుల మెదడులో ఎడమ వైపు అర్థభాగం, కంటే కుడివైపు దానికంటే చురుగ్గా ఉంటుంది. అందుకే అందరూ సాధారణంగా కుడి చేయి వాటమై ఉంటారు. మరి ఎడం చేతివాటం వాళ్ళు దీనికి వ్యతిరేకంగా కుడివైపు అర్థభాగం చురుగ్గా ఉంటుందట. ఇలా ఎడం చేతివాటంగాళ్ళు, (చేతివాటం గాళ్ళు కాదులెండి,)  గొప్పవారై ఉంటారట. కొంతమంది కుడి ఎడమ చేతులతో ఒకేలా పని చేయగలరు, వీరు సవ్యసాచులు, అంటే వీరి మెదడులో రెండు అర్థభాగాలూ సమానంగా పని చేసాయన్నమాట. ఇంత తిరకాసున్న మెదడు స్త్రీ పురుషులలో సమానంగా ఉంటుందా? తెలియదు కాని ఆడవారు మగవారికంటే అన్నిటిలోనూ ఎక్కువేనట, శాస్త్రకారుని మాటే ఇది. ఇదిగో చూడండి.


స్త్రీణా ద్విగుణమాహారం బుద్ధిశ్చాపి చతుర్గుణమ్

సాహసం షడ్గుణంచైవ కామోష్ట్య గుణిముచ్యతే

పురుషునితో పోలిస్తే స్త్రీ ఆహారం రెండు రెట్లు తీసుకుంటుంది, తెలివిలో నాలుగు రెట్లు హెచ్చు. సాహసంలో ఆరు రెట్లు, కామం, కోరికలో ఎనిమిది రెట్లూ ఉంటుందిష. అదేంటో కాని ఇన్ని చెప్పినాయన ఏడుపులో చెప్పేరు కాదు కాని, అమ్మో వీరి ఏడుపు మరొకరినిఏడిపిస్తుందండీ. 


నేటి కాలానికి మరొక మాటా చెప్పేరటండి ఆధునికులు. రాజకీయనాయకుడికి ముందూ గాడిదకి వెనకాలా నుంచోవద్దనీ, ఎందుకో తెలిస్తే చెప్పరూ :)

Friday, 29 November 2019

కాకినాడ జ్ఞాపకాలు




 విన్నకోటవారు కాకినాడ జ్ఞాపకాలని కదిలించారు. 

నిన్న కొన్ని జ్ఞాపకాలు కామెంట్ గా వర్మ గారి బ్లాగ్ లో వేశాను.
వర్మగారి బ్లాగ్ కబ్జా చేస్తున్నానేమో అనే భయం, అందుకు ఇక్కడ టపా ముఖ్యమైనవి చెప్పి ముగించేస్తా. ఇవన్నీ ఏభై సంవత్సరాల కితం మాట, కొన్ని మార్పులూ జరిగి ఉండచ్చు.

జగన్నాధపురంలో మునసబుగారి వీధి ప్రాంతంలో ప్రముఖ హాస్య నటుడు రేలంగి గారిల్లు.రంగూన్ మేడ వెనక పెద్ద పెద్ద పడవల తయారీ కేంద్రం. ఈ పడవలు చాలా పెద్దవి,ఓడ దగ్గరకి సరుకులు తీసుకెళ్ళేవి. ఇంత పెద్ద పడవలని కాకినాడలోనూ కలకత్తాలోనూ తయారు చేసేవారు,నాటి కాలంలో. పాతవంతెన దాటితే వార్ఫ్ రోడ్ వైపు ఒన్ టవున్ పోలిస్ స్టేషను అలా ముందుకెళిపోతే రైల్ గేట్ ముందు మైన్ రోడ్ చివర రెండవ పోలీస్ స్టేషను. మైన్ రోడ్ వెంట ముందుకొస్తే ఎడమవైపు మేడ మీద తేలుకాటుకి మంత్రం వేసి వేడి కాఫీ ఫ్రీగా ఇచ్చి పంపే ఉడిపి అయ్యరు హోటలు. పట్నాల చిట్టెయ్య సెంటర్ నుంచి ఎడమవైపు వీధిలో జైన్ దేవాలయం. వీరిదే దిల్వారా టెంపుల్ అంత ప్రాధాన్యం ఉన్న దేవాలయం మండపేట నుంచి ఆలమూరు వెళ్ళే రోడ్లో కుడి పక్క గుమ్మిలేరు గ్రామానికి ఇవతల ఉన్న జైన్ దేవాలయం. కుడి వైపు వీధిలో కూరగాయల మార్కెట్ దాన్ని ఆనుకుని ఒక చెరువు. మైన్ రోడ్లో మసీదుకు పక్కగా కొద్ది దూరంలో కోటయ్య కాజా ఇల్లు,మసీదు సెంటర్ దాటిన తరవాత సెంటర్లో ఎడమ వైపు సుధితా బుక్ స్టోర్స్, ఇంజనీరింగ్,మెడికల్ పుస్తకాలు దొరికేవి. సెంటర్లో మూల మీద నూర్జహాన్ కిళ్ళీ షాప్ జానీ.ముందు కెళితే టవున్ హాల్ సెంటర్లో టవున్ హాల్ లైబ్రరీ, ఎదురుగా ఉడిపి గణేశ్ భవన్, ఆపక్క వేదార్ధ నిధి జటావల్లభుల సూర్యనారాయణ శాస్త్రిగారిల్లు, ఆ పక్కనే కోదండరామస్వామి ఆలయం. టవున్ హాల్ సెంటర్ నుంచి ఎడమపక్క వీధిలో జడ్జి బంగళా. టవున్ హాల్ సెంటర్ నుంచి కుడి వైపు వీధిలో కాంగ్రెస్ ఆఫీస్ దాని ఎదురుగా ఐ.సి.హెచ్, కల్పనా ధియేటర్, మునిసిపల్ ఆఫీస్. జడ్జి బంగళా కి ఎదురుగా మెక్లారిన్ హైస్కూల్. ముందుకెళితే ఆక్సిడెంట్ స్పాట్, పక్కనే పిండాల చెరువు, దాని వెనక రాజ రాజేశ్వరి ఆలయం. బాలాజీ చెరువు, దీన్ని మూసేసి టి.టి.డి కల్యాణమంటపం, దగ్గరలోనే తాలూకా ఆఫీస్.. కోర్ట్ కాంప్లెక్స్ పక్క పాత బస్ స్టాండ్. కలక్టర్ ఆఫీస్ పక్క లేడిస్ క్లబ్బు. (లాకులు)బ్రిడ్జ్ దాటితే చీడిగ పోస్టాఫీస్ పక్క శివ పురాణాన్ని తెనుగు చేసిన మా మిత్రులు శ్రీ విశ్వనాధ సత్యనారాయణ మూర్తిగారిల్లు.

వాకలపూడి లైట్ హవుజ్.
సర్పవరం,పండూరు మామిడితాండ్ర
చిత్రాడ మొక్కలు,పువ్వులు,అంట్లు,తాటి తాండ్ర, తేగలు
కుళాయి చెరువు దగ్గర జరిగే సంవత్సరపు ఫల పుష్ప ప్రదర్శన
ఊరుకి దూరంగా నీటిపై విహారానికి బోగందాని చెరువు 

ఇలా ఎన్నెన్నో! ఆపేస్తా, దీనికి అంతు కనపట్టం లేదు.. :)

Thursday, 28 November 2019

చిటకా!

చిటకా!

పళ్ళు గార కట్టేయి. ఏ పేస్ట్ తో తోమినా పోవటం లేదు. డాక్టర్ దగ్గరకెళితే డి స్కేల్ చేస్తారు, ఓక గంట కూచోవాలి. అబ్బా!

చిన్న చిటకా చేసి చూడండి, పళ్ళు మిలమిలా మెరుస్తాయి. కొద్దిగా ”ఈనో”  ENO తీసుకోండి పళ్ళు తోముకుని పుక్కిలించి ఉమ్మెయ్యండి, ఇప్పుడు చూడండి. పళ్ళు మిలమిలా!! 

చేతులోకి తీసుకుని తోముకునే పళ్ళా? :) ఇబ్బందేలేదు.. 

Monday, 18 November 2019

కోళ్ళగంప


కోళ్ళగంప లో పిల్లి పడ్డా
కచ్చలో నిప్పు పడ్డా
కచ్చేరీ లో కాయితం పడ్డా   నష్టం తప్పదు. 

Saturday, 2 November 2019

పదుగురాడు మాట

పదుగురాడు మాట పాటియై ధర జెల్లు 
నొక్కడాడు మాట ఎక్కదెందు
నూరకుండువాని నూరెల్ల నోపదు
విశ్వదాభిరామ వినుర వేమ

పదిమంది మాటాడేమాట చెల్లుతుంది. ఒక్కడు మాటాడేది చెల్లదు. అలాగే ఊరుకుని ఉన్నవాడిని ఊరు మొత్తం ఏం చేయలేదు అన్నారు వేమనతాత.

పదిమందిమాటాడేది అంటే మెజారిటీ మాటాడేది,నిర్ణయించేది చెల్లుబాటవుతుంది, అదే డెమోక్రసీ అంటారు తాత. డెమోక్రసీ అంటే ఏంటో తెలియని కాలం లోనే రాబోయే డెమోక్రసీ గురించిన నిర్వచనం చెప్పినవాడు మన వేమన తాత. డెమోక్రసీ అంటే చెబుతున్న నిర్వచనం నూటికి ఏభయ్యొక్కమంది చెప్పేమాట చెల్లుబాటు కావాలి,మిగిలిన నలభతొమ్మిది మంది చెప్పేమాట మెజారిటీ వినాలి, కాని మెజారిటీ చెప్పినదాన్నే అమలు చేయాలి.  ఎవరిదోవ వారిదే అనడానికి లేదు. ఎందుకంటే ఇది మనందరిది అనుకోవాలి. ప్రభుత్వ పక్షము ప్రతి పక్షము, రెండూ   ప్రజలకు జవాబుదారీయే. ప్రతి పక్షమూ ప్రభుత్వంలో భాగమే. మందిని ఆకట్టుకోవడమే గొప్ప.  ప్రభుత్వ పక్షాన్ని ఎప్పుడు చీల్చి చెండాడాలో తెలిసినదే అసలైన ప్రతి పక్షం, లేకపోతే అది రెక్కలు తెగిన పక్షి. అసందర్భంగా నోరు పారేసుకుంటే నవ్వుల పాలే!

అలాగే, ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం లేదని సామెత. అలాగే మన మాట సాగదని అనిపించినపుడు ఊరుకుని ఉండడమే ఉత్తమం. ఊరుకు ఉన్నవానిని ఊరంతా కలసి కూడా ఏం చేయలేదు కదా! 


వ్యక్తుల విషయంలో, లోకులు కాకులు. ఎలాగైనా అరుస్తారు,సావకాశాన్నిబట్టి, అందుచేత లోకులను పట్టీంచుకోక ఊరుకుని తనపని తాను చేసుకునేవాడిని లోకం ఏమీ చేయలేదు కదా!

పదుగుర్ని ఒక మాట మీదకి తేవడం కష్టం, విడదీయడం తేలిక,ద్వేషం రెచ్చకొట్టడం బహు సులభం. ఆశయాలు ప్రధానంగా సంస్థలు కొనసాగించండి. వ్యక్తులు ప్రధానంగా సంస్థల మనుగడ కొద్దికాలం దే. 


విడదీసి పాలించడం కొంతకాలమే సాగుతుంది, అంతకాలమూ సాగదు. దేశము, ప్రజల అభ్యున్నతి ముఖ్యాశయాలుగా సంస్థలని నడపండి. ప్రభుత్వాలు ప్రజలకోసమే ఉండాలి. ప్రభుత్వం వేరు,ప్రజలు వేరు కాదు. చేస్తున్న పనిలో పొరబాట్లు తప్పులు ఎత్తి చెప్పినపుడు తప్పులు దిద్దుకునే ప్రభుత్వాలే కొనసాగుతాయి. ప్రజలనాడికి స్పందించని ప్రభుత్వాలు కూలిపోతాయి,ఎంత గొప్ప వ్యక్తులు అధికారంలో ఉన్నా! పదుగురాడు మాట పాటియై ధరజెల్లు! అదీ తాతమాట. 

Thursday, 24 October 2019

వెల్లుల్లిం, దిలపిష్టమున్

కుల్లాయించితి, గోకజుట్టితి, మహాకూర్పాసముందొడ్గితిన్
వెల్లుల్లిం, దిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్తవడ్డింపగాఁ
జల్లాయంబలిద్రావితిన్, రుచుల్ దోసంబంచు బోనాడితిన్
దల్లీ! కన్నడ రాజ్యలక్ష్మీ! దయలేదా నేను శ్రీనాథుడన్


కుళ్ళాయి లేదా కుల్లాయి అంటే తలపాగా, తెలుగు కన్నడనాట తలపాగా చుట్టడం అలవాటుండేది. అందునా ముఖ్యంగా నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే జిల్లాలలో. ఇదై చాలా పొడుగ్గా ఉండేదట, ఎందుకంటే ఎండలో ప్రయాణం చేసేటపుడు తలకు రక్షణ అదేగాక మంచినీటి వసతి తక్కువగా ఉన్నచోట దిగుడు బావులే గతి, వాటిలో కూడా నీరు చాలా లోతుగానూ ఉండేది. గొంతు తడుపుకోడానికి ఈ తలపాగాను ఉపయోగించుకునేవారు. శ్రీనాథుడు బయలుదేరితే మంది మార్బలం పల్లకీలు ఏనుగులు ఇలా సపరివారంగా బయలుదేరేవాడు ఒంటిగా సామాన్యునిలా తలపాగా చుట్టుకుని కాలి నడకన సంచారం చేశారన్నదానికిది సూచిక. నాటి సామాన్యులంతా ఈ తలపాగాలు ధరించేవారనమాట. 

కోక జుట్టితి, కోక అంటే నేడు స్త్రీలు కట్టుకునే వస్త్రమనే అర్ధం నిశ్చితమైనది తప్ప, నాడు కోక అంటే స్త్రీ పురుషులిద్దరు కట్టుకునే దానిని కోక అనే అనేవారు. శ్రీనాథుడు పట్టు పీతాంబరాలు కట్టుని పైన మరొక పీతాంబరం వేసుకునే అలవాటున్నవాడు, సామాన్యులు కట్టుకునే పంచ కట్టుకున్నానని చెబుతున్నమాట. 


కూర్పాసం అంటే పొట్టి చొక్కా!కటివలయం దాకా ఉండేది. మహా కూర్పాసం అంటే పెద్ద చొక్కా. ఆ చొక్కా ఎలా ఉండేది? చేతులు లేని జుబ్బా లాగా పొడుగ్గా పక్క జేబులతో మోకాళ్ళు దిగేదాకా ఉండేదే మహా కూర్పాసం. పల్లెలలో సామాన్యులు దీన్నే తొడిగేవారన్నది సూచన. 


ఇక్కడికి ఆయన ఆహార్యం చీని చీనాంబరాలు, పట్టు వస్త్రాలనుంచి ఎంత సామాన్య స్థితికి దిగజారిపోయిందో చెప్పారు.


ఇక ఆహారం గురించి చెబుతున్నారు. ఒకప్పుడు బంగారు పళ్ళెంలో రాజనాలు, మొలగొలుకులు 
లాటి మేలి వరి అన్నం, షడ్రుచులతో భోజనం చేసినవాడు, ఇప్పుడేలా ఉన్నది చెబుతున్నారు. 


తిలపిష్టం అంటే తెలగపిండి. నేటికి తెలగపిండి కూర అంటే నీచంగానే చూస్తారు. ఈ తెలగపిండి కూరలో వెల్లుల్లి వేయడం సామాన్యులకు అలవాటూ. మరి శ్రీనాథుడు ఆహితాగ్ని, వెల్లుల్లి తినడం నిషేధం, కాని వెల్లుల్లి వేసిన తెలగపిండి కూర తిన్నాను అన్నారు. అది కూడా ఎంత హీనస్థితిలో, ఆచారం ఐతే విశ్వస్త వంట చేసిన,వడ్డించినా ఆహితగ్నులకు పనికిరాదు. మరి శ్రీనాథుడు కడుపు కాలిపోతుంటే వెల్లుల్లివేసిన తెలగపిండి కూర తిన్నానన్నారు. విశ్వస్త అంటే విధవ, సకేశి అనగా కేశములుంచుకున్న విధవ.   ఆహితాగ్ని ఐన శ్రీనాథునికి ఈమె వడ్డిస్తే తినడం నిషిద్ధం. చల్లాయంబలి ద్రావితిన్, ఆయన జన్మలో ఎప్పుడూ చల్లగాని అంబలికాని తాగలేదు అప్పటి వరకూ, పెరుగు మాత్రమే ఎరిగినవాడు, అది లేదు సరికదా చల్ల తాగేనన్నారు, అది కూడా దొరక్కపోతే అంబలి తాగేనన్నారు. కడుపులో కాలుతుంటే, దోషమని తెలిసినా రుచులు, ఆచారాలు వదిలేశానన్నారు. 


 తల్లీ కన్నడ రాజ్యలక్ష్మీ, దయ చూపవా,  నేను శ్రీనాథుడిని సుమా,  అన్నారు. 

Tuesday, 22 October 2019

ఆ చూపులకర్ధమేంటి?






కదలబోతున్న లిఫ్ట్ లోకి ఒక యువకుడు దూసుకొచ్చాడు. లిఫ్ట్ నా తాహతు కు మించిన బరువు మోయలేనని, కదల్లేనని మొరపెడుతూ ఒకళ్ళని దిగమని అరుస్తోంది.. చూసిన యువకుడు నాకేం సంబంధం లేదన్నట్టుగా,  నేను అదనపు బరువు కాదు, బయటికిపోనన్నదానికి సూచనగా  మొరాయిస్తూ తలవిదిలించి,తలొంచుకుని ఫోన్ లో ములిగిపోయాడు. అప్పటికే లిఫ్ట్ లో ఉన్నవారు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు, చివరగా దూసుకొచ్చిన యువకుని కేసీ చూశారు. సమయం మించిపోతోందని వాచీలు చూసుకున్నారు, ఎవరు లిఫ్ట్ నుంచి బయటకు నడవలేదు. లిఫ్ట్ అరవడం మానలేదు, కదల లేదు. ఇంతలో ఒకమ్మాయి నెమ్మదిగా, వెనుకనుంచి దారి చేసుకుని బయటికొచ్చింది,నడవడానికి ఇబ్బంది పడుతూ ఊతకర్రల సాయంతో. లిఫ్ట్ లో అందరూ ఆమెను చూశారు, యువకుడూ చూశాడు. అప్పుడూ అతనిలో మార్పురాలేదు. మిగతావారు మాటాడ లేదు. అమ్మాయి లిఫ్ట్ నుంచి బయటకు వెళ్ళి వెనుతిరిగి చూచింది, విరిసీ విరియని పెదవులపై చిరునవ్వో, మౌన నిరసనో తెలియనట్టు. ఇంతకీ, ఈ సంఘటనలోనివారి, ఆ నడవలేని ఆయువతి చూపులకర్ధమేంటీ?


యువకుడు:- నేను పైకి వెళ్ళాలి, నా అవసరం తీరాలి, లిఫ్ట్ కదలకపోడానికి నాది కాదు పొరబాటు,వ్యవస్థ తప్పు.  ఒకళ్ళు దిగిపొండి. నడవలేక ఊతకర్రల సాయంతో నడచే యువతి దిగినపుడు " అది ఆమె ఇష్టం, నాకేం సంబంధం" అనే తిరస్కార భావం. 


లిఫ్ట్ లో ఉన్నవారు:- కదలబోతున్న లిఫ్ట్ లోకి యువకుడు దూసుకురావడంతోనే బరువు ఎక్కువై లిఫ్ట్ కదలనంటోంది, దాని ఓపికకంటే ఎక్కువ బరువు కావడం చేత. ఎవరు దిగాలి? చూపులలోప్రశ్న  . చివరికి దూసుకొచ్చిన యువకుని మూలంగానే బరువు ఎక్కువైంది కనక, అతనే దిగాలని ఏకాభిప్రాయం, కాని ఒక్కరి నోటి వెంట వెలువడని నిర్ణయం. యువకుని నిర్లక్ష్యం. అతనిని బయటికి  పంపలేని అసహాయత. చివరికి కాళ్ళు గట్టిగా లేక చంకకర్రలతో నడిచే యువతి దిగినప్పుడైనా నోరు విప్పలేని అసహాయత, అన్యాయం జరుగుతున్నా,  అన్యాయం జరుగుతోందని తెలుస్తున్నా మాటాడలేని, తప్పు సరి దిద్దలేని పెద్దలు.


యువతి చూపులకర్ధమేంటీ:- విరిసీ విరియని పెదవులపై అది చిరునవ్వా? లేక సమాజం మీద ఎక్కుపెట్టిన నిరసనా? నిర్ణయంగా చెప్పలేను.

అది చిరునవ్వయితే......
చిరునవ్వు:- యువకుడిని ఉద్దేసించి, ''అన్నా కాళ్ళు బలంగా లేకున్నా, ఊతకర్రల్తో నడిచే శక్తి ఇచ్చిన భగవంతునికి ప్రణామం. నేడు మెట్లు ఎక్కి ఐనా ఆఫీస్ కు చేరగలనన్న నమ్మకం నాకుంది, నేను జీవన గమ్యం చేరడానికి ఆలస్యం కావచ్చేమోగాని, కచ్చితంగా మాత్రం గమ్యం చేరతాననే ధైర్యం ఉన్నది. నీవు జీవన గమ్యం చేరడానికి,  తొందరగా చేరాలనే ఆతృతలో తప్పులు చేసి అసలు గమ్యమే చేరలేవేమో చూసుకో! భగవంతుడు నాకు గట్టి కాళ్ళివ్వకపోయినా సంఘం పట్ల నా గట్టి నిర్ణయాన్ని అమలు చేసే తెలివి, సంస్కారం,ఆలోచన ప్రసాదించాడు, నీకది శూన్యమేమో తెలుసుకో! ''అన్నా! నీ శరీర అవయవాలన్నీ బాగున్నా, నీ మనసులోని అవిటితనానికి నా సానుభూతి.

అది నిరసనైతే....
నిరసన... ఒక  పాపం జరిగినపుడు దాని పాప  ఫలితం  ముగ్గురు పంచుకుంటారు, వారు, కర్త,కారయిత,అనుమోదకులు. కర్త, పాపం చేసేవాడు. కారయిత,  పాపం చేయించేవాడు. అనుమోదకుడు,   పాపం ను బాగుందని ప్రోత్సహించేవాడు. ఇందులో మీరెవరు? మీరు నోరు విప్పనంతకాలం, సమాజం ఇలాగే లిఫ్ట్ లాగే కదలదు.  అన్యాయం మీదాకా వచ్చినపుడు మాత్రమే మీకు నొప్పి కలుగుతుంది, అప్పుడు బాధపడి లాభం ఉండదు, చేతులుకాలిన తరవాత ఆకులు ప ట్టుకున్నట్టవుతుంది. ధర్మో రక్షతి రక్షితః ..నేడు లిఫ్ట్ కదలడానికి, నేను అదనపు బరువు కాకపోయినప్పటికీ, స్వయంగా నేనే అదనపు బరువుగా భావించుకుని తొలగిపోయాను, మీ అందరూ పైకి వెళ్ళడానికి సహకరించాను. సమాజం కూడా కదలలేని లిఫ్ట్ లాగానే ఉంది. అదనపు బరువైనవారి కోసం ఎవరో ఒకరు త్యాగాలు చేస్తూనే ఉన్నారు, ఇక ముందు సాగదేమో, హెచ్చరిక, తస్మాత్ జాగ్రత! 


కొసమాట:- లిఫ్ట్ అరుపులు తప్పించి, మాట లేని చిన్న టెలిఫిల్మ్ లో దర్శకుడు అన్నీ తానే ఐ కనిపించాడు విశ్వరూపంతో. గొప్ప భావాలను చూపులతోనే తెలుపగలిగిన దర్శకునికి జే జేలు. నటీ నటులంతా పాత్రలలో జీవించారంటే అతిశయోక్తి కాదు, దర్శకుని భావాలను కళ్ళతోనే పలికించారు. యువకుడు నటనలో జీవించాడు, పాత్రలో. యువతి విరిసీ విరియని పెదవులలో చిరునవ్వో, మౌన నిరసనో, తెలిసీ తెలియనట్లు భావాన్ని ప్రదర్శించి లఘు చిత్రానికి కొలికి పూసైయిందంటే,ఆశ్చర్యం లేదు.

వాట్సాప్ లో కనిపించిన ఈ చిత్రం పాతదే కావచ్చు, నా దృష్టిని ఆకర్షించింది.  
I feel it is an old, short  telefilm. OLD IS GOLD. Enjoy!!!

Monday, 14 October 2019

వసుదేవుడు గాడిద కాళ్ళు


వసుదేవుడు గాడిద కాళ్ళు..... 

వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు అంటుంటారు. వసుదేవుడంతవాడు గాడిద కళ్ళెందుకు పట్టుకోవలసి వచ్చింది, అసలు గాడిద కాళ్ళు పట్టుకున్నాడా? భాగవతంలో చూదాం..రండి...

భాగవతంలో ఎక్కడా వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్న సందర్భం కనపడలేదు. పరమాత్మ పుట్టడమే నాలుగు చేతులతో శంఖ, చక్ర,గద లతో పుట్టేరు, తల్లితండ్రులకు అలా దర్శనమిచ్చి ఆ తరవాత మామూలు బాలకుడయ్యాడని భాగవతం చెబుతోంది. ఆ సమయం లో లోకమంతా గాఢ సుషుప్తిలో ఉన్నదని భాగవతం మాట.  కాని లోకం మాటేంటంటే, పరమాత్మని తలపై బుట్టలో ఉంచుకుని తీసుకు వెళుతున్న వసుదేవుని చూసి గాడిద ఓండ్ర పెట్టిందనీ, ఆ అరుపుకు కావలివారు లేస్తే పరమాత్మని వ్రేపల్లె చేర్చడం కుదరకపోవచ్చు గనక ఓండ్ర పెట్టద్దని వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడంటారు. లోకమంతా గాఢ సుషుప్తిలో ఉండగా ఈ గాడిద మాత్రం ఎలా మెలుకువగా ఉండగలిగింది? ఈ ప్రశ్న అడిగినవారూ లేరు, దీనికి సమాధానమూ లేదు.

మనం కొంచం ముందుకెళ్ళి దేవకి, వసుదేవుల గురించి కంసుని గురించి చూదాం. 

దేవకి కంసుని పినతండ్రి కూతురు. తోడబుట్టిన చెల్లెల్లు కాకపోయినా కంసుడు దేవకి పై ప్రేమ చూపాడు. వసుదేవునికిచ్చి దేవకిని వివాహం చేసిన సందర్భంలో స్వయంగా రథం నడుపుతూ, దేవకిని అత్తవారింటికంపుతున్న సందర్భం. ఇంత ఆనందకర సందోహంలో ఆకాశవాణి అసదర్భంగా ఇలా పలికింది. ”కంసా! ఇంత ఆప్యాయతతో అత్తవారింటికంపుతున్న ఈమె అష్టమ గర్భం నీకు మారకం కలగజేస్తుందీ” విన్న కంసుడు విచలితుడై చరాలున కత్తి దూసి దేవకిని సంహరించడానికి పూనుకుంటాడు. ఆ సందర్భంగా వసుదేవుడు పలికిన పలుకులు చిత్తగించండి. 

”దేవకి కి అన్నవు కదయ్యా! చీరలు,సారెలు పెట్టడమో,చక్కగా మాటాడటమో చేయాలిగాని, ఆకాశవాణి చెప్పిందని, అది నిజమనీ నమ్మి 
చెల్లెలిని చంపకు! ఆలోచించు,తొందరపడకు” అని బతిమాలాడాడు. కోపం మీద ఉన్న కంసుడు కంగలేదు. దాంతో మళ్ళీ నీ చెల్లెలు ముద్దరాలు, ఏమీ తెలియనిది, నీ క్షేమమే ఎప్పుడూ కోరేది అటువంటి దానిని బయటవారి మాట పట్టుకుని చంపుకుంటావా? అని నిలదీసాడు.నువ్వు పుట్టడంతోనే కూడా మృత్యువూ పుట్టింది, ఇప్పుడో మరో నూరేళ్ళకో చావు తప్పదు అంటూ

కర్మంబులు మేలునిచ్చును, గర్మంబులు కీడు నిచ్చు కర్తలు దనకున్
గర్మములు బ్రహ్మకైనను,గర్మగుడై వరల దడవగా నేమిటికిన్.....

ఇంత చెప్పినా కంసుడు వినలేదు.ఇలా మరికొన్ని మాటలు చెబుతూ వసుదేవుడు ఆలోచించాడు తనలో.
''ఎంతదాకా వీలుంటే అంతదాకా ప్రయత్నం చేయాలి కదా అనుకుని కష్టంలో ఉన్న దేవకిని రక్షించాలంటే కొడుకుల్ని ఇచ్చేస్తాను అని చెప్పడం మంచిది కదా! ఇప్పుడీమె ప్రాణాలు దక్కితే రేపేమవుతుందో ఎవరికెరుక? కొడుకులు పుడితే వారి చావు వెంట వస్తే తప్పించగలవారెవరు? అంతెందుకు వీడు బ్రహ్మరాత కొద్దీ రేపటికేమవుతాడో ఎవరి కెరుక? వీడి కర్మ ఎలారాసి ఉందో ఎవరికి తెలుసు? అందుకని కొడుకులనిస్తానని భార్యను విడిపించుకోవడం నేటి నీతి,కర్తవ్యం''  అని తలపోసి ”కొడుకుల్ని ఇచ్చేస్తాను దేవకిని వదిలేయ”మంటే అలాగేనని ఒప్పుకుని వారిని నగరులోని సౌధంలో ఉంచాడు. నజర్ బంద్ అనమాట అంటే కళ్ళెదురుగా ఎక్కడికి పోకుండా బందీగా మహల్ లోనే ఉంచటం. హవుస్ అరస్ట్. అలా బందీగా ఉండడానికే వసుదేవుడు ఇష్టపడ్డాడు. నీ చెల్లెలు, ఇప్పుడే పెళ్ళి చేసుకున్నాను, దీనికి పుట్టే వాడు నీ ప్రాణహానికి కారణమని, నీ చెల్లిని చంపుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకో నాకేం, మరో పెళ్ళాం దొరకదా! అని వదిలేసిపోక  కంసుని గాడిదను చేసి,
కాళ్ళు పట్టుకున్నంత పని చేసి దేవకిని రక్షించుకున్నాడు. 


వసుదేవుడు కాళ్ళు పట్టుకున్నంత దైన్యంగా మాటాడినంతలో కంసుడు గొప్పవాడుకాలేదు, వసుదేవునికి చిన్నతనమూ రాలేదు. కంసుడే గాడిదయ్యాడు.
14.10.19
చిన్న వివరణ:- కంసుడు దేవకి వసుదేవులను మొదటగా హౌస్ అరస్ట్ మాత్రమే చేశాడు. దేవకి సంవత్సరానికి ఒక బిడ్డని కన్నట్టు కన్నది. కన్న బిడ్డలను ఎప్పటికప్పుడు కంసుని వద్దకు వసుదేవుడు తీసుకుపోయాడు. కంసుడు అలా తీసుకువచ్చిన బిడ్డలను, ''వీడు నా శత్రువు కాదు,  అష్టమ గర్భంలో జన్మించేవాడే నాకు శత్రువు తీసుకుపొమ్మని'' వసుదేవునికిచ్చి పంపేశాడు. ఇలా ఆరుగురు పుత్రులను వెనక్కి ఇచ్చేశాడు. ఒక రోజు నారదుడు కంసుని వద్దకు వచ్చి ''దేవకి,వసుదేవుడు యాదవులు అందరు దేవతాంశవారు , నీవు రాక్షసుడవు, కాలనేమి అంశవాడివి'' అని చెప్పిపోయాడు. కంసునిలో కోపం రగిలింది, వసుదేవుని ఆరుగురు బిడ్డలను నరికేశాడు. దేవకి వసుదేవులను కారాగృహంలో సంకెళ్ళతో బంధించాడు. అలా కృష్ణుడు కారాగారంలో జన్మించాడు. ఇది భాగవతం మాట
కీ అలవాటు పోలేదనమాట’’ అనడంతో మానిటర్ తన పక్క తిప్పుకుని పూర్తిగాచదివి……
సుదేవుడు కండి కాళ్ళు

Saturday, 12 October 2019

మానసిక రోగులు


మానసిక రోగులు.

ఇదెప్పటి మాటా? ఏభై సంవత్సరాల పైబడినది. ఒక రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాకా కాఫీ ఇచ్చి కబుర్లు చెబుతూ ఓ కార్డ్ చేతిలో పెట్టింది, ఇల్లాలు.ఏంటన్నట్టు చూసా. మీరే చూడండన్న మాటగా చూసింది. ఈలోగా అమ్మ కలగజేసుకుని ఇటువంటి ఉత్తరాలు వస్తూనే ఉంటాయి, అనేసి వెళిపోయింది. 

అసలింతకీ ఉత్తరంలో సంగతేమంటే ”ఓం నమో వేంకటేశాయ” అని పాతిక సార్లు రాసి పదిమందికి పంపండి మీ కష్టాలు తొలగిపోతాయి, అదీ సారాంశం. నిజమే పీకలోతు కష్టంలో ఉన్నాం, అప్పటికి. పెద్దమ్మాయికి వినపడదు, మాటలు రాలేదు, ఏం చేయాలి? నీటిలో ములిగిపోతున్నవాడు గడ్డిపరక దొరికినా ఆసరా చేసుకోడానికి ప్రయత్నించినట్టు, ఎవరేది చెబితే అది చేస్తున్న కాలం.

నాకైతే ఇలాటి వాటిని నమ్మేవాడిని కాదుగాని, ఇల్లాలేమంటుందోనని చిన్న భయం. ఆవిడేమో చెళ్ళపిళ్ళవారికి ముద్దుల ఆడపడుచు, మరో పక్క దువ్వూరి సుబ్బమ్మగారికి (స్వాతంత్ర్య సమరయోధురాలు) అనుంగు శిష్యురాలు. ఈ దువ్వూరి సుబ్బమ్మ అనేపేరు చాలామందికి ఉన్నదికాని అసలు సుబ్బమ్మగారిది కడియం, ఇల్లాలు ఆవిడకి అనుంగు శిష్యురాలు, అదనమాట సంగతి. 

ఏంటన్నట్టు చూశా,మళ్ళీ. ఇలా కార్డులు రాసేస్తే కష్టాలు తొలగిపోతుంటే, ఇంకా లోకంలో చాలామందికి కష్టాలెందుకున్నాయంటారు? ప్రశ్నించింది. ఏం చెప్పాలో తోచలేదు. కార్డ్ పట్టుకు వెళిపోతుంటే ఆపేను, రేపు పొద్దుటే నీళ్ళపొయ్యి అంటించుకోడానికి ఏమీ లేదే అని చూస్తున్నా అంటూ కార్డ్ పట్టుకుని వెళ్ళిపోయింది. తన భావమేంటో అర్ధమయి ఊరుకున్నా!

కాలం గడుస్తుండగా ఇటువంటివే కొన్ని భయపెడుతూనూ, కొన్ని మభ్యపెడుతూ, మరికొన్ని ప్రలోభపెడుతూ రకరకాల ఉత్తరాలొస్తుండేవి. అలవాటయిపోయాయి కూడా. కాలం మారింది ఉత్తరాలు రాసే అలవాటేమో వెనకబట్టింది, కాని మనుషుల్లోని అవకరం మాత్రం వెనకబట్టలేదు. ఆ తరవాత కాలంలో మెయిళ్ళొచ్చాయి. ఈ మెయిల్ పాతిక మందికి ఫారావార్డ్ చేయండి, పార్వార్డ్ చేయండి  గంటలో శుభవార్త వింటారు, ఇలా రకరకాలే..మెయిళ్ళూ వెనకబట్టేయి, ఇప్పుడు మరీ తేలికైపోయింది, వాట్సాప్ లో. కింద మెసేజి చూడండి. 




 వీరు ఇటువంటివి ప్రచారం చెయ్యడమే కాక పుకార్లు పుట్టించడంలో ప్రచారం చేయడం లో సిద్ధ హస్తులు కూడా. ఈ మధ్య కాలంలో వీరికి కొంత సొమ్ముకూడా గిట్టుబాటవుతున్నట్టే వుంది





టెక్నాలజీతో అవకరం కూడా పెరిగిందిగాని తరగలేదు. ఇటువంటి మానసిక రోగులై తే పెరుగుతూనే ఉన్నారు.



వీరు మానసికరోగులు మరో మానసిక రోగిని తయారు చెయ్యాలనే తాపత్రయంలో ఉన్నారంతే 


Tuesday, 1 October 2019

15th August 1947 న కూడిన మొదటి తరం సినీ నటీనటులు,గాయనీ మణులు


Photo courtesy... Sree. Vinnakota Narasimha Rao.

నాకు సినిమాల గురించి తెలిసినది తక్కువ, పల్లెటూరిలో పుట్టి పెరగడం చేత. ఈ నటీనట గాయనీమణులలో కొంతమంది తెలియరు. తెలిసినవారిని వరుసగా.

కూర్చున్నవారు. ...  రావు బాలసరస్వతీ దేవి..గాయని లలితగీతాలు,భావగీతాలు. అద్భుత గాత్రం.

కుర్చిలలోవారు. ...   మాలతి కొద్దిగా తెలుసు.  మాలతిని చూసి భానుమతిగా పొరబడ్డా. శాంత కుమారి  పాడవోయిభారతీయుడా.

 ఆ తరవాత నటి,గాయని,దర్శకత్వం,రచయిత్రి, వ్యాపారి, ఒకటేమి సినిమా అంటే నిర్వచనం. అభిమానంతో కూడిన భయం. భయంతో కూడిన అత్మీయత. తిరుమతి భానుమతి. మాట కరుకు మనసు వెన్న.

 టంగుటూరి సూర్యకుమారి యా?

నిలబడ్డవారు.. నాగయ్య, నాటి హీరో! మనసున్న మనిషి. గోవిందరాజుల సుబ్బారావు. అద్భుత నటుడు. గుండె పట్టేసే లింగమూర్తి.సి.ఎస్. ఆర్ అసలు పేరు  సి.ఎస్. ఆర్ ఆంజనేయులు,ఇంటి పేరు తెలీదుగాని సీతారామాంజనేయులు, నటుడు, విలన్ కి నిలువెత్తు రూపు, తడిగుడ్డతో గొంతు కోసే రకం విలనీకి మారు పేరు. నారాయణరావు నాటి హీరో. రంజన్, ఆర్. నాగేశ్వర రావు విలన్ కాకముందు విలన్. రామచంద్రన్ ఆనాటి నటుడు,  అప్పుచేసి పప్పుకూడు లో నటించినట్లు గుర్తు.

మిగిలినవారు తెలియదు. కొంతమంది లేరు. అందులో ముఖ్యులు బొడ్డపాటి,విన్నకోట. 
ఫోటో పెద్దది గా ఇచ్చాను, ఇబ్బంది లేకుండా గుర్తించడానికి.  ఎందరు సజీవులో తెలియదు. వీరంతా ఆల్ ఇండియా రేడియో లో సమావేశానికి సూత్రధారి కెమెరా వెననకుండిపోయినట్టుంది.

Friday, 27 September 2019

ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినన్

 
Courtesy.. What's app

కష్ట జీవుల బతుకింతే! రెక్కాడితేగాని డొక్కాడదు.


Wednesday, 25 September 2019

ఆరునెల్లు సావాసం చేస్తే

ఆరునెల్లు సావాసం చేస్తే

ఆరునెల్లు సావాసం చేస్తే వారు వీరవుతారని సామెత. అదెలా? అసలదేంటీ?

అంటే ఆరు నెలలు కనక ఒకరితో సహవాసం అంటే స్నేహం కనక కొనసాగిస్తే వారు అనగా ఎవరితో ఐతే మనం స్నేహం కొనసాగించామో వారి అలవాట్లు,లక్షణాలు మనకి అలవాటవుతాయన్నది దాని భావం. మరో చిత్రమేంటంటే  ”సిరి అబ్బదు చీడ అబ్బుతుందని” సామెత. 

వీరిలా వారు  కావచ్చుగా అని అడగచ్చు. ఇక్కడ ఉన్నమాట చూస్తే వారు వీరవుతారని చెప్పబడిందిగాని వీరు వారవుతారని చెప్పలేదు,గుర్తించండి.చెడ్డ అలవాట్ల దగ్గర స్నేహం తొందరగా బలపడుతుంది.

ఇదే భార్య భర్తలైతే ఒకరిని మరొకరు అనుసరిస్తే జీవితం ఏమిహాయిలే హలా

సిరి అంటే ధనం అది ఏ రూపం లోనైనా కావచ్చు, మంచి అలవాటు, విద్య, ప్రత్యక్షంగా ధనం ఇలా ఏదైనా జీవితానికి ఉపయోగపడేది కావచ్చు. 

చీడ అంటే వారికున్న చెడు లవాట్లు, తొందరపాటు, అబద్ధం చెప్పడం, మందు కొట్టడం, సిగరెట్టు కాల్చడం ఇలా అవకరాలు తప్పక అలవాటవుతాయి. చెడు అలవాటైనంత తొందరగా మంచి అలవాటు కాదు. దీన్నే చీడ అంటారు. 

అంచేత స్నేహితుని ఎంచుకునేటపుడు జాగ్రత! 

తెలియక స్నేహం చేసేసాం, కొంత కాలమూ గడచింది, కొన్ని అవకరాలూ అలవాటయ్యాయి, మాన్చుకోడం ఎలా? సాధనమున పనులు సమకూరు ధరలోన.....

కావలసింది ఈ చీడ వదిలించుకోవాలనే ధృడ సంకల్పం... ఇదంత తొందరగా అలవడదు. తస్మాత్ జాగ్రత!

Friday, 20 September 2019

కొండొండోరి చెరువులకిందా//అర్ధం


కొండొండోరి చెరువులకిందా
Courtesy: Whats app

ఈ వీడియో మరియు పాట కోసం నేనే ప్రయత్నమూ చేయలేదు. వాట్స్ ఆప్ లో కనపడితే ఎవరో కావాలన్నది చూసి ఇక్కడ పంచుకున్నానంతే! 

దీని అర్ధమూ తెలియదు. నాకు ఎవరి ద్వారా తెలిసినా ఇక్కడ పంచుకుంటాను.

20.09.2019
ఈ పాట అర్ధం శ్రీ తాడేపల్లి పతంజలిగారు చెప్పినారట. ఈ కింది లింక్ లో చూడగలరు. లింక్ పంపిన శ్రీమతి భారతి గారికి ధన్యవాదాలు.

https://m.facebook.com/story.php?story_fbid=2645063862184248&id=110755208948472

Thursday, 19 September 2019

కనకపు సింహాసనమున


కనకపు సింహాసనమున

శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునం

దొనరగ బట్టము గట్టిన

వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!

బంగారు సింహాసనం మీద కుక్కని కూర్చోబెట్టి మంచి ముహూర్తంలో 

వైభవంగా పట్టాభిషేకం చెసినా తన పాత గుణం మానలేదు.

ప్రతి జంతువుకు దాని సహజ లక్షణాలుంటాయి. మానవుడు కూడా

జంతువే. ‘’జంతూనాం నర జన్మ దుర్లభం’’ ఇది శంకరుల  మాట.

కుక్క గ్రామ జంతువు, ఇది ఏ జాతి కుక్కైనా ఏ పేరుతో పిలిచినా అది కుక్కే!

 సింహం కాదు, కాని కుక్కకి గ్రామ సింహం అనే బిరుదు మాత్రం ఉంది.

 పిల్లికి ఎలుక ఆహారం, పిల్లికి కుక్కని చూస్తే భయం. కుక్కకి మానవ

 ఉచ్చిష్టం కతకడం ఇష్టం. కుక్కకి సింహాసనమైనా మరో గొప్ప ఆసనమైనా 

ఒకటే, అది బంగారు సింహాసనమైనా దాని విలువా తెలియదు. అంత గొప్ప 

బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి మంచి ముహూర్తంలో పట్టాభిషేకం 

చేసినా మానవ  ఉచ్చిష్టం కనపడగానె గబుక్కున దానిని నోట కరచుకుంటుంది, 

ఇది సహజ లక్షణం కనక.


కుక్క గురించి ఇంత ఎప్పాలా? కాదు ఇది కుక్కగురించికాదు,అది కవిగారి 

అభిప్రాయం.

మానవులు ఎంత గొప్పవారైనా తమ సహజ నీచ లకక్షణం మాన్చుకో లేరు.


ఎంత ఉన్నత పదవులకు ఎగబ్రాకినా వారి వైఖరి మారదు.

దీనినే వేమనతాత ఇలా అన్నారు.

ఎంత చదువు చదివి ఎన్ని నేర్చినగాని

హీనుడవగుణంబు మానలేడు

బొగ్గు పాలగడుగ పోవునా మలినంబు

విశ్వదాభిరామ వినుర వేమ.

ఎంత చదువుకున్నా,ఎన్ని నేర్చుకున్నా సహజంగా హీన గుణం ఉన్న 

మానవుడు, తన సహజత్వాన్ని వదులుకోలేదు. ఎలాగంటే బొగ్గు నల్లగా 

ఉంటుంది. పాలు తెల్లగా ఉంటాయి పాలతో బొగ్గును ఎంత కడిగినా తన 

సహజమైన నల్లరంగు వదలలేదు. అలాగే నీచబుద్ధి కలవాడూ సహజగుణం 

వదల లేడు.


Tuesday, 17 September 2019

''మందోపాఖ్యానం''

''మందు'' యజ్ఞం

వానొచ్చినా, వరదొచ్చినా, పిడుగులు పడ్డా, భూమి కంపించినా, యీ యజ్ఞం కొనసాగవలసిందే
మందుతో గుడ్డు బలం



ఆ ఒక్కబుడ్డి ఖరీరు ఎంతో కాదు నలభై రెండు లక్షలు



మా దగ్గర తాటి చిగురని తయారు చేస్తారు. తాటి చెట్టునుంచి తీసిన దానిని తెల్లటి సీసాలో నింపి భూమిలో కప్పెడతారు. ఎంతకాలం, కలిగినవారైతే ఎంతకాలమైనా ఉంచుతారు. పాతికేళ్ళ పైబడిన చిగురు దేనికీ సాటి రాదు. 

Tuesday, 10 September 2019

నేటి ప్రయాణ పదనిసలు

మా బలేగా దొరికేడు చలాన్ రాసెయ్

దిగితేగాని లోతు తెలియని రోడ్ మీద గుంతలకి ఎవరి పేర చలాన్ రాయాలీ?

హెల్మెట్ పొరబాటుగా పెట్టుకుంటే చలాన్ రాస్తారా?

చలాన్ లొద్దు!. ఏసెయ్యి దరువేసెయ్!! ఇదే మందు!!!


మొండివాడు రాజు కంటే బలవంతుడు.

డ్రైవింగ్ లైసెన్స్..లేదు.
బండికి ఇన్సూరెన్స్..లేదు
హెల్మెట్ ...........లేదు
రాంగ్ సైడు రావడం..... నా ఇష్టం.

ఏంచెయ్యగలర్రా! దిక్కునచోట చెప్పుకోండెహె!!

All videos Courtesy: Whats app

Tuesday, 3 September 2019

హమ్మయ్య! పీడా విరగడయ్యె!!!

హమ్మయ్య! పీడా విరగడయ్యె!!!

పేపర్ చదవడం అలవాటెప్పటిదీ? అరవైఐదేళ్ళ కితంది. పద్నాలుగో ఏట నాలుగో ఫారం చదివేటప్పుడైనది కదూ!  అలవాటెలా అయిందీ? ఆరోజుల్లో పేపర్ పల్లెటూరికి రావడమంటే, అదో యజ్ఞం. ఈ రోజు పేపర్ రేపో ఎల్లుండో టపాలో వచ్చేది. ఆ పల్లెలో ఎంత మంది కొచ్చేది పేపరు? ఒకటి హైస్కూల్ కి రెండవది ఓ కలిగిన షావుకారు గారికి. . షావుకారు గారికి ఆదివారం,శలవురోజుల్లో పేపర్ చదివి వినిపించడం అలవాటు.ఆయనా కాంగ్రెస్ వాదే! కాకపోతే భూస్వామి, ఈ చిల్లరమేళం తమ బూమి మీదకేమైనా వస్తారేమో తెలుసుకోడానికే ఆయనకి పేపర్ అవసరం.   ఆయనకి దృష్టి దోషం, అందుకు నా అవసరం.పేపర్ చదివి పెట్టినందుకు బత్తాయి తొనలో, కరకజ్జమో..ఏదో ఒకటి చేతిలో పెట్టి పంపేవాడు.

హెడ్ మాస్టరి ఇంటికి ఎదురుగా ఉన్న మరో మాస్టారి ఇంటి అరుగు మీద చదువుకునేవాడిని. రోజూ హెడ్మేస్టారికి ఇంటికొచ్చిన పేపర్లు పుస్తకాలు మరునాడు ఉదయం స్కూల్ కి పట్టుకెళ్ళి అప్పజెప్పడం, నా పని. ఇలా పేపర్లు నా దగ్గర ఉదయం ఒక గoట ఉండేవి. ఆ సమయంలో నా పేపరు చదవడం అలవాటయి, బలవత్తరంగా ఇన్నాళ్ళు కొనసాగింది.


ఇంతకి ఆరోజుల్లో ఉన్న పేపర్లెన్ని? నాలుగో ఐదో! చెప్పుకోతగినవి, ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రిక తెలుగులోనూ, INDIAN EXPRESS,THE HINDU  ఇంగ్లీష్ లోనూ వచ్చేవి. ఇందులో హిందూ మొహం ఎప్పుడూ చూడలేదు. ఏ వార్తలుండేవి? తెలుగు పేపర్లలో ఎప్పుడూ కాంగ్రెస్ వారి ముఠాతగాదాల కబుర్లు తప్పించి మరో మాట లేదంటే నమ్మలేరు. ఇక ఇంగ్లీష్ పేపర్ లో మొదటి పేజిలో జి.కె.రెడ్డి అని గుర్తు ఆయన రాసిన వార్త తప్పక ఉండేది. వార్త రాసిన వారి పేరు కూడా ప్రచురించేవారు. ఇంగ్లీషు పేపర్ చదవడానికి కొంత కష్టపడ్డాను. కూడబలుక్కుని చదివినా అర్ధమయ్యేది కాదు. అప్పుడు హెడ్ మాస్టారు నా సంగతి చూసి ఒక నిఘoటువు ఇచ్చి ,చదువు, అర్ధం కాని పదాలకు అర్ధం చూసి రాసుకో . అలా అలవాటు చేసుకోమన్నారు. క్లాసు పుస్తకాలకే దిక్కులే దు మరి పేపర్ చదివి పదాలకి అర్ధం రాసుకోడానికి పుస్తకమేదీ? ఒక మిత్రుడు నా అవస్థ చూసి ఒక వైపు రాసిన కాగితాలిచ్చి వాడుకోమన్నాడు. అలా ఇంగ్లీషు పేపర్ చదవడానికో సంవత్సరం పట్టిందంటే నమ్మగలరా? ఆ తరవాత కాలంలో ఎడిటోరియల్, లీడర్ ఆర్టికల్ చదివే స్థాయికి ఎదిగాను.

ఆ తరవాత కాలంలో ఇంగ్లీషు పేపర్ తెప్పించుకోవడం, ఉద్యోగాలకి దరఖాస్తులు చెయ్యడం అదో ఘట్టం. ఆ తరవాత ఉద్యోగం, ఆ కాలంలో ఇంగ్లీషు పేపర్ తోబాటుగా తెలుగు పేపరు, తెలుగు వార పత్రికలు, ,R.K.KARANJIA BLITZ, BABURAO PATEL QUESTION&ANSWERS ఇలా మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లింది. తెలుగు పత్రికలు క్షీణ దశకు చేరుకున్న సమయం, ఇంగ్లీష్ పేపర్లపైన వెగటు కలుగుతున్న కాలంలో కొత్త పత్రికలొచ్చాయి. అందులోవే ఈనాడు,ఉదయం వగైరా..

వీటిలో ఈనాడు ఎన్ని ఊళ్ళు ఉద్యోగరీత్యా మారినా వెంటబడి వచ్చింది. చివరికి రిటయిర్ అయి వచ్చాకా కూడా వదల లేదు. 

స్వంత ఇంటిలో అన్నీ మొక్కలే మామిడి,పనస నుంచి,మల్లె,మొల్ల,జాజి,కలబంద, అరటి ఇలా ఎన్నో! ప్రతి రోజూ ఉదయమే పేపర్ కోసం ఈ మొక్కల్లో వెతుక్కోడమో పని. ఏ రోజు పేపరు ఏ మొక్క మొదటిలోనే మామిడి చెట్టు పైనో,పనసచెట్టు పలవలోనో దొరికేది. మా చుట్టు పక్కలెవరి ఇళ్ళలోనూ మొక్కలుండవు. ఈ అగచాట్లకీ అలవాటు పడిపోయాం. కాలం మారింది, పేపర్ పంపిణీ చాలా చేతులూ మారిపోయింది. ఇంతకీ ఈ పేపర్లో నేడు వస్తున్న వార్తలన్నీ ఏదో ఇంగ్లీషు పేపర్ నుంచి తర్జుమా చేసినవే! సరే లీడర్ గురించి చెప్పే పని లేదు. అలవాటు బలవత్తరం కదా! రోజూ పేపర్ ఒక సారి తిరగెయ్యకపోతే సిగరెట్టు మానేసినవాడి బాధలా ఉండేది. 

మొన్న జూలైనెలాఖరు, రాత్రి నుంచి వర్షం పడింది,దొడ్డి నిండా నీరు, వర్షo ఇంకా పడుతూనే ఉంది. పేపర్ కోసం చూస్తే నీళ్ళలో పూర్తిగా నానిపోయి,పెరటి గచ్చు మీద ఉంది. ఇటువంటివి ఇదివరలో చెప్పడం,సరి చేస్తాననడం మామూలైపోయింది గాని ఈ సారి, వెంఠనే డిస్ట్రిబ్యూటర్ ని పిలిచి పేపర్ చూపించి, రేపటినుంచి పేపర్ తేవద్దని చెప్పెయ్యడం అయిపోయింది. ఇలా లవాటే గనక మరునాడొచ్చి కోడల్ని బతిమాలి నెల చివరదాకా పేపర్ వేస్తానని చెప్పి ఒప్పించుకుని వెళ్ళేడు. ఈలోగా కోడలు మరో ప్రయత్నం చేసింది, పేపర్ చదవక ఉండలేరేమో, తెమ్మంటానని, నిర్ణయం నిర్ణయమే, సిగరెట్లు మానెయ్యలేదూ అలాగే ఇదీ, ఇక పేపర్ మొహం చూసేది లేదని చెప్పేసా! నెల దాటింది, పేపర్ చదవకపోతే ఏమయిందీ.

హమ్మయ్య! పీడా విరగడయ్యే!!!





Monday, 12 August 2019

Sinking Ship






ములిగే ఓడ. 

ఓడ  ఎందుకు ములుగుతుందీ? ఓడ కెప్టెను, ఓడలో వేసే సామాను, వేసేటపుడు సరిగా సమతూకంగా  ఉండేలా సద్దించుకోకపోతేనూ, ఓడను అలలపై కాచుకుంటూ సరిగా నడపలేకపోతేనూ  వీడియోలో లా ములిగిపోతుంది. మరి  ఓడ కెప్టెన్ ఏం చేయాలి? 



ఓడ ములిగే పరిస్థితి వస్తే కెప్టెన్ ఓడలోవారందరిని సురక్షితం చేసి చివరగా ఓడను వదలి రావడంగాని లేదా ఓడతో ములిగి జలసమాధి కావటంగాని చేయడం సముద్రం మీద బతికే వారి పరిపాటి. అదివారి ఆచారం కూడా. ఎప్పుడూ ఓడను రక్షించుకోవడం కుదరకపోవచ్చు,అప్పుడు అందరిని రక్షించుకుని బతికి బయటపడి మరో ఓడతో జీవించడం మంచి పని, ఇది ధీరుని లక్షణం. 


 ఓడ ములుగుతోందని తెలిసి ఓడలోవారిని  ఓడను వారి కర్మానికి వారినొదిలేసి తాను బయట పడటం, భీరువైన కెప్టెన్ లక్షణం. భీరువు చరిత్రలో కలిసిపోతాడు, ధీరువు చరిత్రలో మిగిలిపోతాడు, అంతే తేడా!

Sunday, 4 August 2019

పూర్ణశుంఠలు సభా పూజ్యులైరి.

అధిక విద్యావంతు లప్రయోజకులైరి
పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతుల మాట జన విరోధంబయ్యె
వదరుబోతుల మాట వాసికెక్కె
ధర్మవాసన పరుల్ దారిద్ర్య మొందిరి
పరమలోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగభూత పీడితులైరి
దుష్ట మానవులు వర్ధిష్ణు లైరి
పక్షివాహన మా వంటి భిక్షుకులకు శక్తి లేదాయె, నిఁక నీవె చాటు మాకు
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర !! (52)

ఓ నారసింహా ! ఈ లోకమదేమిటో కాని అతి విచిత్రంగా మారుతోంది. బాగా చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతున్నారు. ఏమాత్రం చదువు రాని శుంఠలు సభాపూజ్యులై సన్మానాలు పొందుతున్నారు. నిజం చెప్పేవారి మాట లోకవిరోధమౌతోంది. అబద్దాలాడేవారికి సమాజం లో అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ధర్మబుద్ధిగలవారు దారిద్య్రాన్ని అనుభవిస్తుంటే పిసినారులు ధనవంతులై కులుకు తున్నారు.పుణ్యాత్ములు రోగగ్రస్థులై పీడించబడుతుంటే పాపాత్ములు పల్లకీలలో ఊరేగుతున్నారు. ఓ గరుడవాహనా ! మావంటి యాచకులకు ఎటువంటి పోషణలేదు నీవే మాకు దిక్కు.

Courtesy: Owner


నృసింహ శతకంలో పద్యం చదువుకుంటున్నాం కదూ! మొన్న మొదటి పాదం చదివేంగా. ఇప్పుడు రెండో పాదం, అవధరించండి. 




మొదటిపాదంలో అధిక విద్యావంతులు అప్రయోజకులౌతున్నారన్నారు. అప్రయోజకులంటే పనికిరానివారని అర్ధం. ఈ శుంఠ శబ్దానికి అదే అర్ధం చెబుతోంది ఆంధ్రభారతి. తేడా ఏంటీ?




పండిత పుత్ర పరమ శుంఠ అన్నది పెద్దలమాట.ఈ మాటలోని పరమ శుంఠ పదాన్ని కవిగారు పూర్ణ  శుంఠ అన్నారనుకుంటా! పైవాళ్ళు అర్ధ శుంఠలైతే వీరు పూర్ణశుంఠలట. పూర్ణశుంఠ అనడం లో అవసరమూ ఉన్నది సుమా! పై పాదంలో పనికిరానివారు అన్నవారు పూర్ణశుంఠలు కారు. కొంత సానబడితే వారు పనికిరావచ్చు గాని ఈ పూర్ణశుంఠలు మాత్రం పుటమేసినా పనికిరారని చెప్పడానికే పూర్ణశుంఠ అన్నారనుకుంటా. 




పండిత పుత్రులు పరమశుంఠలు ఎలా అవుతారు? అలా పరమ శుంఠలైనవారు సభాపూజ్యులెలా అవుతారు అన్నదే అనుమానం.పండితునికి తన పాండిత్యం ద్వారా కలిగే వ్యవహారాలమీద తప్పించి సంతానం ఎలా ఉన్నదో పట్టించుకునే తీరిక ఉండదు. మరి వీరిని చూసేవారెటువంటివారుంటారు? వీరు సమయం గడుపుకోవాలనే స్వార్ధపరులై ఉంటారు.ఇతరులను పొగడ్తలలో ముంచి పబ్బం గడుపుకునేవారవుతారు. వీరు ఆ పండితుని పొగిడి అవసరం గడుపుకునేవారు కావడంతో పిల్లలికి చెడ్డ బుద్ధులే అబ్బుతాయి, వీరి చదివు సంధ్యలు వెనకబడతాయి. వీరిని సరి దిద్దేవారుండరు, ఎత్తుచేతివారి బిడ్డలు కదా!.పిల్లలను కూడా పండితుని కంటే గొప్పవారని పొడ్తలలో ముంచి పబ్బం గడుపుకుంటూ, పండితుని పిల్లలను పరమ శుంఠలుగా తయారు చేస్తారు.  ఆ తరవాత వారు కూడా ఈ పండితుని గౌరవంలో కాలం గడిపేస్తారు. పిచ్చి ప్రజలు పండితుని ప్రజ్ఞ పాటవాలు వీరిలో కూడా ఉన్నాయనుకుంటారు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడమైపోతుంది. కాలం గడుస్తుంది, చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందెలు పుడతాయి. అప్పటి దాకా ఈ పరమ శుంఠలు సభాపూజితం పొందుతూనే ఉంటారు.  

Thursday, 1 August 2019

అధిక విద్యావంతు లప్రయోజకులైరి

అధిక విద్యావంతు లప్రయోజకులైరి
పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతుల మాట జన విరోధంబయ్యె
వదరుబోతుల మాట వాసికెక్కె
ధర్మవాసన పరుల్ దారిద్ర్య మొందిరి
పరమలోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగభూత పీడితులైరి
దుష్ట మానవులు వర్ధిష్ణు లైరి
పక్షివాహన మా వంటి భిక్షుకులకు శక్తి లేదాయె, నిఁక నీవె చాటు మాకు
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర !! (52)

ఓ నారసింహా ! ఈ లోకమదేమిటో కాని అతి విచిత్రంగా మారుతోంది. బాగా చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతున్నారు. ఏమాత్రం చదువు రాని శుంఠలు సభాపూజ్యులై సన్మానాలు పొందుతున్నారు. నిజం చెప్పేవారి మాట లోకవిరోధమౌతోంది. అబద్దాలాడేవారికి సమాజం లో అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ధర్మబుద్ధిగలవారు దారిద్య్రాన్ని అనుభవిస్తుంటే పిసినారులు ధనవంతులై కులుకు తున్నారు.పుణ్యాత్ములు రోగగ్రస్థులై పీడించబడుతుంటే పాపాత్ములు పల్లకీలలో ఊరేగుతున్నారు. ఓ గరుడవాహనా ! మావంటి యాచకులకు ఎటువంటి పోషణలేదు నీవే మాకు దిక్కు.
Courtesy: Owner

నృసింహ శతకకర్త కాకుత్స్థం శేషప్ప కవి. పద్దెనిమిదవ శతాబ్దం వాడన్నారు. కవిగారి ఊరు ప్రస్తుతం తెలంగాణాలో ఉన్న ధర్మపురి దగ్గర అని తెలుస్తోంది. తెలుగు కవుల స్థల కాలాల మీద చాలా చర్చ జరుగుతోంది, అప్పుడప్పుడు. నిజం మాత్రం తెలియటంలేదు. అప్ప,అయ్య,అన్న, అమ్మ,అక్క నామాంత్యాలుగా తెలుగునాట పేర్లున్నమాట నిజం, ఇప్పుడవి లోపించడమూ నిజం. ఏమైనా ఈ శతకాన్ని వారే రాశారన్నదాని మీద విచాదం మాత్రం లేదు, నాకు తెలిసి, ధన్యుడను. 



చిన్నప్పుడు నాలుగు శతకాలు బట్టీ వేయించేవారు. అవి సుమతీ శతకం,వేమన శతకం, భాస్కర శతకం, నృసింహ శతకం. కొద్ది వయసొచ్చాకా మరి కొన్ని శతకాలూ చదువుకున్న రోజులు.  ఈ కోవలోనివే భర్తృహరి శతకాలు. ఇవి సంస్కృతంలో ఉండడంతో ఏనుగు లక్ష్మణ కవిగారు తెలుగు చేసిన పద్యాలే సంస్కృతం వాటికంటే అందంగా ఉంటాయి నాకు. భాగవతం వ్యాసుడు సంస్కృతంలో రాసినా నాకు పోతరాజుగారు రాసిన తెలుగు భాగవతమే అసలైనదనిపిస్తుంది, నచ్చుతుంది కూడా. 

పలికెడిది భాగవతమట

పలికించెడువాడు రామభద్రుండట నే
పలికిన భవహరమగునట
పలికెద వేరొండు గాథ పలుకగనేలా! 

భాగవతం చెబుతున్నా! పలికిస్తున్నవాడు శ్రీరామచంద్రుడు,భాగవతం చెబితే ముక్తి లభిస్తుందిట, మరెందుకు మరొకటి చెబుతానూ! మరొకగాధ చెప్పను, భాగవతమే చెబుతానన్నది అర్ధం. 



దీనికేంగాని నృసింహ శతకంలో కవిగారు కాచి వడబోసిన జీవిత సత్యాలు చెప్పేరు, అవి సార్వజనీనం, అంతే కాక ఏకాలానికైనా సరిపోయేవే! ఈ పద్యంలో కవిగారు చెప్పినది నేటి కాలానికి అతికినట్టు సరిపోతుంది చూడండి. 

”అధిక విద్యావంతులప్రయోజకులైరి” దీనితో మొదలు పెట్టేరు, పద్యం. ఏ దేశంలోనైనా ఎక్కువ చదువుకున్నవారు విజ్ఞానులనీ ఆత్మాభ్యుదం తరవాత, దేశాభ్యుదయం కోసం పని చేస్తారనీ, చెయ్యాలనీ సామాన్యులు కోరుకుంటారు. అసలీ అధిక విద్యావంతులెక్కడుంటారు? ప్రభుత దగ్గర, విశ్వవిద్యాలయాల్లోనూ కదా! నిజంగానే వీరిలో కొందరు నేడు మనదేశంలో అప్రయోజకులుగానే ఉన్నారు. వీరిలో ఆడ మగ తేడా కనపడటం లేదు. 


విశ్వవిద్యాలయాలలో ఉన్నవారు సొమ్ముకు సర్టిఫికట్లు అమ్ముకునే వ్యాపారంలో ఉన్నారు. లేదూ స్త్రీ లోలత్వానికి లోబడిపోయారు. ఇక వీరు స్త్రీలైతే చదువుకోడానికొచ్చినవారిని వ్యభిచారం రొంపిలో దింపి సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు ఆయుధాలు పట్టుకుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయమని యువతని ప్రేరేపిస్తున్నారు. వీరి 
పిల్లలు మాత్రం విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మీరు చెప్పేదాన్ని మీరెందుకు అమలు చేయరంటే, నేను సిద్ధంత కర్తను మాత్రమే, నా భార్య పిల్లలికి కూడా చెప్పేను, వారు వినిపించుకోలేదు. వ్యక్తి స్వాతంత్ర్యం ఉన్నదికదా,వారినెలా బలవంత పెట్టగలను అంటున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఉన్న మేధావులు ఇలా ఉన్నారు, అందరూ అనను సుమా!

ఇక ప్రభుతలో ఉన్న మేధావులెలా ఉన్నారయ్యా అంటే, దేశం ఏమైనా బాధలేదు, ఎవరేమనుకున్నా ఇబ్బందీ లేదు,ధన సంపాదనే ధ్యేయమన్నవారున్నారు.  దేశ వనరులపై కొంతమందికి మాత్రమే ప్రథమహక్కుందన్నవారూ ఉన్నారు.  ఇలా అధిక విద్యావంతులలో కొంతమంది కవిగారు చెప్పినట్టే ఉన్నారు కదా!



ఇప్పటికే టపా చాలా పెద్దదయింది, మిగిలినవి తరవాత