Friday, 11 December 2015

విజ్ఞప్తి-ఈ బ్లాగు మూసివేయబడినది..

విజ్ఞప్తి-ఈ బ్లాగు మూసివేయబడినది...

బ్లాగుల్లోఅసహనం పరాకాష్టకి చేరిపోయింది, ఎంతగా అంటే, ఇష్టం లేనివాళ్ళు ఇంకా చావలేదా అన్నంతగా :). నా బ్లాగులను ఆగ్రిగేటర్ల నుంచి తొలగించమని విన్నపం మాలిక,కూడలి మరి కొంతమందికి పంపుకున్నాను.కూడలి వారు తొలగించేరో లేదో కాని కొత్త టపాలు కనపడటం లేదు. కొందరు మీ బ్లాగుల్ని మాలికనుంచి తొలగించడానికి అడ్డుపదతామన్నారు,మాలికవారికి ఇబ్బందేమో తెలియదు, వారు టపాలు ఇంకా ప్రచురిస్తూనే ఉన్నారు. అందులకుగాను నేనొక నిర్ణయం తీసుకున్నాను.
ఇక  ముందు నా రెండు బ్లాగులలో టపాలు ప్రచురింపబడవు.విసిగిపోయాను,
https://kastephale.wordpress.com

http://kasthephali.blogspot.in/

చదువుకున్నవారిలో,మేదావులలో ఇంత అసహనం గూడు కట్టుకుని ఉండటం, ఘనీభవించడం చూసి ....ఇంతటి అసహనపరుల మధ్య ఉండలేను.. మన్నించండి. 

ఇక ముందు నా టపాలు చూడాలనుకునేవారు 01.01.2016 తేదీనుండి ఈ కిందిబ్లాగులో చూడగలరు. .
https://sarmabc.blogspot.com
ఈ బ్లాగు ఆగ్రిగేటర్లలో చేర్చబడలేదు.

Thursday, 10 December 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-మొక్కు,..రోజుకో పద్యం-అక్కఱ

మొక్కు......continue at కష్టేఫలే



రోజుకో పద్యం మాటకచేరీ.

అక్కఱకురాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా
నెక్కిన బారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ.
అవసరానికి ఆదుకోని చుట్టాన్నీ,నమస్కారం పెట్టినా వరం ఇవ్వని దేవుణ్ణీ,యుద్ధంలో తను ఎక్కినప్పుడు పరుగు తీయని గుఱ్ఱాన్నీ వెంటనే వదిలేయాలి అన్నారు వేమనతాత.

Wednesday, 9 December 2015

రోజుకో పద్యం.-కోపమున


రోజుకో పద్యం.

కోపమునను ఘనత కొంచమైపోవును
గోపమునను మిగుల గోడుగలుగు
గోపమడచెనేని గోరిక లీడేరు
విశ్వదాభిరామ వినుర వేమ.

మనిషి గొప్పతనం కోపంతో తగ్గిపోతుంది. దానితో బాధలు కలుగుతాయి.కోపాన్ని వదిలేస్తే కోరికలు తీరుతాయి అన్నారు వేమన తాత.. 

కోపం అందరికి వస్తుంది,’పేదవానికోపము పెదవికి చేటు’ నానుడి. పెద్దవారికోపమే కోపం మరి. పేదలది ధర్మాగ్రహం. కోపం వస్తే దాన్ని ’ఒంటికాలి మీద లేవడం’ అంటారు.జంతువులు పుట్టిన కొన్నిగంటలకే నిలబడి తల్లి దగ్గర పాలు తాగుతాయి, నడుస్తాయి కూడా. మానవుడో, నడవడం దేవుడెరుగు లేవలేడు, ఎవరో లేవదియ్యాలి, తల్లి పాలు తాగడం నేర్పాలి, కూచోడం, నుంచోడం,నడవడం నేర్పాలి. అసలు రెండు కాళ్ళ మీద నిలబడిందే ”రామా పితికస్” కాలం నుంచా? నిలబడటమే చేతకాని మానవుడు ఒంటికాలిమీద లేస్తే, అంటే మరో కాలితో తన్నాలని, ఎదుటివారిని. పాపం ఒంటి కాలి మీద లేస్తే రెండో కాలు భూమి మీద లేక సరిగా నిలబడలేక బోర్లా పడతారు. అందుచేత కోపం తెచ్చుకుని ఒంటికాలి మీద లేస్తే ఏమవుతుంది, బోర్లా పడటం తప్పించి. కోపమొస్తే ఫలితంగా పడితే పళ్ళు రాలిపోతాయి కదా! అందుచేత కోపం తెచ్చుకుంటే ఏడుపు మిగిలింది కదా! కోపం తెచ్చుకోని ఎదుటివాడు చేతకాని వాడనుకుంటే పొరబాటు. ధర్మాగ్రహం కాల్చేస్తుంది.కోపం, పులిమీద స్వారీ చేయడం లాటిది. పులి మీద ఎక్కడం తేలిక,దిగడమే కష్టం. దిగితే పులేతినేస్తుంది, ఎంతకాలం స్వారీ చేయగలరు, ఎప్పుడో ఒకప్పుడు దిగకా తప్పదు, చావకా తప్పదు :) రాముని రాయబారం వినిపించి హనుమపై కినిసి రావణుడు హనుమను చంపేయమంటే, దూతను చంపకూడదు శిక్షించు, అని విభీషణుడు చెబితే కోపంలో ఒళ్ళు తెలియక హనుమ తోకకి నిప్పు పెట్టమన్నాడు,రావణుడు . తరవాతేం జరిగింది? లంక కాలిపోయింది. రావణుని కోపం లంకను కాల్చింది. 


'తనకోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష
దయ చుట్టంబౌ'

 అదండి సంగతి. 
అందుచేత కోపం తెచ్చుకోకుండా బుద్ధితో యోచనచేస్తే తన పనులు సవ్యంగా నెరవేరుతాయని తాత మాట. ఆ( గాడిదగిడ్డు పాత చింతకాయ కబుర్లు. అవును పథ్యానికి పాత చింతకాయ పచ్చడే కావాలి, లేక మరేమైనా తింటే రోగం తిరగబెడుతుంది :)

Tuesday, 8 December 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-ఏడుస్తూ వ్యవసాయం చేస్తే….

ఏడుస్తూ వ్యవసాయం చేస్తే….......continue at కష్టేఫలే


రోజుకో పద్యం.

ఏఱకుమీ కసుగాయలు
దూఱకుమీ బంధుజనుల దోసము సుమ్మీ
పాఱకుమీ రణమందున
మీఱకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ.

పక్వానికి రాని పచ్చికాయలు నేలరాలినవి తినకు. బంధుల్ని తిట్టకు. యుద్ధం నుంచి పారిపోయిరావద్దు. గురువులమాట  విను. ఇవి చేయకపోతే దోషం సుమీ.

పచ్చికాయలు తింటే ఆరోగ్యం చెడుతుంది, వద్దన్నారు. బంధువులని తిట్టకూడదు, వారిని మార్చుకోలేము, అది కుదరని పని. అందుకు వారితో సాధ్యమైనంత సఖ్యంగా ఉండాలి, కుదరకపోతే దూరంగా ఉండాలి తప్పించి, తిట్టుకుంటే మనమే పదిమందిలో పలచనైపోతాం. యుద్ధానికి సిద్ధపడద్దు, శాంతి ఎల్ల వేళలా మంచిది, ఇక యుద్ధం చేయక తప్పకపోతే మాత్రం విజయమో వీర స్వర్గమో తేల్చుకోవాల్సిందే. యుద్ధమే చేయాల్సివస్తే, ధర్మమే ఎప్పుడూ జయిస్తుంది. గాంధారి ఏమని దీవించింది? ’యతోధర్మస్తతోజయః’ (ధర్మమెక్కడుందో అక్కడే జయమూ ఉంటుంది) అని దీవించింది, 'విజయోస్తు' అనలేదు, కొడుకే అయినా సరే దుర్యోధనుడిని.ధర్మం ఏపక్క ఉందో ఆమెకు తెలియదా? తెలుసు గనకే ’విజయోస్తు’ అనిదీవించక, ’యతోధర్మస్తతోజః’ అంది కదా! ధర్మ యుద్ధమే చెయ్యి,ప్రాణం పోయినా సరే, ఇష్టపడే యుద్ధం చెయ్యి, ఏడుస్తూ యుద్ధం చెయ్యకు.యుద్ధం నుంచి పారిపోకు, పిరికివాడివవుతావు.యుద్ధం మొదలెట్టి క్షమగురించి ఆలోచించకు, యుద్ధం లో శత్రుసంహారమే కర్తవ్యం. 'గురువు నై దేవుడు నై' ఇది కొద్దికాలం చాలా బాగా నడుస్తుంది, ఇలాటివారు చివరికాలంలో గురువో దైవమో అని పరుగులు పెడుతున్నారు, చూస్తున్నాంగా. 

Monday, 7 December 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-నమస్సులు-వివరణ.


నమస్సులు-వివరణ........continue at కష్టేఫలే




రోజుకో పద్యం.

అనఘునికైన జేకురు ననర్హుని గూడి చరించునంతలో
మన మెరియంగ నప్పుడవమానము కీడు ధరిత్రియందు నే
యనువుననైన దప్పవు యధార్ధము, తానది ఎట్టులన్నచో
నినుముని గూర్చి యగ్ని నలయింపదె సమ్మెటపెట్టు భాస్కరా

చెడ్డవాడితో స్నేహం మూలంగా ఎప్పటికైనా అవమానము, కీడు జరుగుతాయి, భూలోకంలో. ఎలా అంటే ఇనుముతో  స్నేహం మూలంగా అగ్నికి కూడా సమ్మెటపోటు తప్పలేదు కదా.

చెడ్డవానితో స్నేహం కీడు కలగజేస్తుందన్న శతకకారుని మాట ఎంతేని సత్యం. ఒక్కొకప్పుడు తెలిసి,తెలియక కూడా చెడ్డవారితో స్నేహం చేస్తాం. అప్పుడు అగ్నికి ఇనుముతో చెలిమి మూలంగా సమ్మెటపోటు తగిలినట్టు, కష్టాలు చుట్టుముట్టి అవమానం జరుగుతుంది. ఇది నిత్య వ్యవహారంలో చూస్తున్నాం కదా! ఒక పాపం పని జరిగినపుడు ఆ పాపాన్ని ముగ్గురు పంచుకుంటారని చెప్పుకున్నాం, వారు కర్త,కారయిత,అనుమోదక. కర్త తనచేసే పాపం చేసిపోతే ఆ తరవాత కారయిత, అనుమోదకులు నింద పొందుతున్నారు, అవమానం పాలవుతున్నారు. అందుచే తెలుసుకోవలసింది? పాపం చేసేవారికి దూరంగా ఉండటం, కారయిత, అనుమోదకులు ఒకరే ఐతే? పాపంలో ఎక్కువ భాగం ఎవరు పంచుకుంటున్నారు, తెలిసి, తెలియనివారే! ఎప్పుడూ పాపత్ములను దూరంగానే ఉంచాలి. ఎవరు శిక్షింపబడతారు ? తప్పు చేసినవారా? కాదు. ఇదిగో ఈ నానుడులు చూడండి. ముంజలు తిన్నవాణ్ణి వదిలేసి మోరలుతిన్నవాణ్ణి తన్నినట్టు, ఏదుపంది నొదిలేసి ఊరపందిని శిక్షించినట్టు, తప్పుచేసినవాణ్ణి వదిలేసి తలుపు తీసినవాణ్ణి తన్నినట్టు,తప్పు చేసినవారు తప్పించుకుపోయి చోద్యం చూస్తుంటే తన్నులు తింటున్నవారు అవమానపడినట్టు కదా! అందుచేత తప్పుచేసేవాడి కూడా ఉండటం కూడా......ఇది లోక రీతి.

Sunday, 6 December 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-అల్లుడితో భోజనం….

అల్లుడితో భోజనం….......continue at కష్టేఫలే


రోజుకో పద్యం.

నడువకుమీ తెరువొక్కట
గుడువకుమీ శత్రునింట గూరిమితోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ.

ఒంటరిగా మార్గంలో ప్రయాణం చెయ్యకు. శత్రువు ఇంటిలో భోజనం చెయ్యకు. ఇతరుల ధనాన్ని ఆశించి మూటకట్టకు. ఇతరుల మనసు నొచ్చేలా మాటాడకు.

ఒకప్పుడు ఒంటరిగా ప్రయాణం భయం కలిగించేదే! ఇప్పటికీ అలాగే ఉన్నట్టుంది. శత్రువని తెలిసి ఆ ఇంటిలో మిత్రుడనుకుని భుజించకు, ప్రమాదం. శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళి దుర్యోధనుడు ఇస్తానన్న విందు స్వీకరించలేదు. ఆ రాత్రికి విదురిని ఇంటికే వెళ్ళాడు. విదురునికి (మంత్రి) జీతమెంటో తెలుసా, రోజుకి రెండు శేర్లు పిండి. ఇది తెలిసీ కృష్ణుడు ఆ ఇంట ఆతిధ్యం తీసుకున్నాడు. ఇతరుల ధనం, మనది కాదు, తెలిసి దానిని దాచుకోవాలని ప్రయత్నం ప్రమాదమే తెచ్చిపెడుతుంది,నిప్పును కొంగున కట్టుకున్నట్టే, ఉదాహరలు కోకొల్లలు. ఇతరుల మనసు నొచ్చుకునేలా మాటాడకు, అకార కలహం మంచిదికాదు, ఇదెప్పుడో ప్రమాదం తెచ్చి పెడుతుంది, అప్పుడు ఏడిచి ఉపయోగంఉండదు,వ్యర్ధం. 

Saturday, 5 December 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-నమస్సులు

నమస్సులు……....continue at కష్టేఫలే



కార్తీక పున్నమి









రోజుకో పద్యం

బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమలచేత జిక్కి చావదె సుమతీ

బలమైనవాడనని ఎక్కువమందితో విరోధం పెట్టుకోవద్దు. బలమైన సర్పం కూడా చలిచీమలకి దొరికి మరణిస్తుంది సుమా.

నేడు జరుగుతున్నది,  బలముంది నోరుందని అందరిని తూలనాడితే, ఎగతాళీ చేస్తే,బాధ పెడితే, హింసిస్తే, ఏమవుతుందో! గిరినాగు భయంకరమైనినది. చిత్రంగా ఈ గిరినాగును చలిచీమలే పట్టుకుని చంపేస్తాయి. ఒక సారి వాటికి దొరికితే చావే గతి, ఏదో ఒక రోజు దొరక్క తప్పదు. ఆ రోజు అయ్యో అని ఓదార్చేవారే కరువైపోతారు. 

Friday, 4 December 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-పొట్టు వడియాలు/నల్లేరు వడియాలు.

-పొట్టు వడియాలు/నల్లేరు వడియాలు........continue at కష్టేఫలే


రోజుకో పద్యం

చేసిన దుష్టచేష్ట నది చెప్పక నేర్పున గప్పిపుచ్చి తా
మూసినయంతటన్ బయలు ముట్టక యుండదదెట్లు రాగిపై
బూసిన బంగరుం జెదరి పోవగడంగిననాడు నాటికిన్
దాసిన రాగి గానబడదా జనులెల్ల రెఱుంగ భాస్కరా!

భావం:- రాగిపై పూసిన బంగారం శాశ్వతంగా ఉండదు, కొద్దికాలం తరవాత క్రమంగా  రాగి కనపడుతుంది. అలాగే నీచుడు చేసిన పని ఎవరికి తెలియకుండా దాచినా కాలం లో అందరికి తెలియకపోదు.

నిజం నిలకడ మీద తెలుస్తుంది, ఈలోగా నిజం బాధింపబడుతుంది, ఇది నేటి లోకరీతి.

Thursday, 3 December 2015

కుమ్మరి సారె


Potters at work 1900
Courtesy:- Old Indian photos


రోజుకో పద్యం.

ఎంతచదువు జదివి ఎన్ని విన్ననుగాని
హీనుడవగుణంబు మానలేడు 
బొగ్గుపాలగడుగ బోవునామలినంబు
విశ్వదాభిరామ వినురవేమ.
భావం:- ఎంత చదువుకున్నా, ఎన్ని మంచి మాటలు విన్నా, హీనుడు=బుద్ధి హీనుడు చెడ్డగుణం నుండి తప్పించుకోలేడు. బొగ్గు నల్లగా ఉంటుంది, తెల్లనైన పాలతో కడిగినా నలుపుపోతుందా?