5, ఫిబ్రవరి 2026, గురువారం

రాముని రాజ్యం-భరతుని పట్టం-3

 

రాముని రాజ్యం-భరతుని పట్టం-3


ఇంతకు ముందు భాగాలు లింకుల్లో చదవండి.

https://kasthephali.blogspot.com/2023/03/1.html

https://kasthephali.blogspot.com/2023/04/2.html


జరిగిన కథ సంక్షిప్తంగా .......   

అయోధ్యకు రమ్మని మేనమామల ఇంట ఉన్న భరతునికి కబురు పoపినదీ,అతను తిరిగిరాగా తెలిసినవిషయాలు,ఆపై  అతను తీసుకున్న చర్యలూ చూసాం. రాముని తిరిగి తీసుకురావడానికి తన ఇంటిలో వారికి ఎలా చెప్పి, తాను చెప్పినది నిజమని నమ్మించాడో చూసాం. రామునిదే రాజ్యం అని చెప్పి తనపరివారాన్ని,ప్రజలను నమ్మించినదీ చూసాం. రాముని తీసుకురావడానికి అడవులకు బయలుదేరినదీ చెప్పుకున్నాం. దీనంనీ 'ఇంట గెలవడం'గా అనుకున్నాం కదా! ఇప్పుడు రచ్చ, అనగా బయటవారికి రామునిదేరాజ్యం అని చెప్పి ఎలా ఒప్పించాడు, అలా బయలుదేరి భరతుడు ఎవరెవరిని కలిసాడు,ఏం జరిగింది ముందు చూదాం...  

అవగాహన..

అలా ససైన్యంగా,రాణివాసంతో బయలుదేరిన భరతుడు గంగానదీ తీరాన ఉన్న శృంగబేరిపురం చేరాడు. డేరాలు వేసుకుని మకాం చేసాడు.గంగ దాటడానికి, ఆపై అడవిదారుల్లో భరద్వాజాశ్రమం చేరేదారి,మిగిలిన విషయాలు చర్చించుకుంటున్నాడు. ఈ సైనక సందోహం గమనించి,  దానిని దశరథుని సైన్యంగా గుర్తించిన ఆ ప్రాంత పరిపాలకుడు గుహుడు,ఇలా తలపోసాడు.

 'భరతుడు, రాముని అడవులలో కూడా ఉండనిచ్చేలా లేడు. ఆయన పరివారం,మిత్రులమైన మనను చంపనూ వచ్చు', అనుకుని తనవారిని సమావేశపరచి,'మన దగ్గరున్న వీరులందరిని అస్త్ర,శస్త్రాలతో గంగ ఒడ్డున ఉండమనండి. మనదగ్గర 500 నావలున్నాయి. ఒక్కొక నావకు వందమంది చొప్పున వీరులు సిద్దoగా ఉండండి',అని చెప్పి తాను పళ్ళు,తేనెలు తీసుకుని భరతుని దర్శించడానికి బయలుదేరాడు. 

 దూరాన్నుంచే గుహుని గమనించిన సుమంత్రుడు భరతునితో 'ఆ వచ్చే ముసలాయన  ఈ ప్రాంత పరిపాలకుడు, అంతేకాదు ప్రజ్ఞాశాలి,  ఈ ప్రాంతమంతా వీరికి కొట్టిన పిండి.  చాలా సైన్యం కలవాడు.రామునికి మిత్రుడు. అతనికి వెంటనే దర్శనం ఇవ్వడం మoచిది' అని సలహా చెప్పేడు. భరతుడు గుహుని వెంటనే కలిసాడు.       

కుశలప్రశ్నల అనంతరం, 'తమరాక ముందు తెలిస్తే, నేనే ఎదురొచ్చి స్వాగతం చెప్పేవాడిని కదా! ఈ ఫలాలు,తేనెలు స్వీకరించమని' అంటాడు గుహుడు. ఆపై 'మా ఆతిధ్యం ససైన్యంగా స్వీకరించ'మంటాడు. దానికి భరతుడు 'నీవు అన్నరాముని కడుకూర్చుమిత్రునివి, నీవు మాకు చేయదలచిన మర్యాదల  అభిలాష కడు అపూర్వం', అంటూ 'ఈ ప్రాంతం గంగా జలాలతో నిండి ఉన్నది,దీన్ని దాటే మార్గం,ఆపైన భరద్వాజ ఆశ్రమానికి చేరే సులువైన మార్గమేది?' అడిగాడు.'నేను నీ కూడా వస్తాను,మా యోధులు మనకు రక్షణగా వస్తారు. శ్రీరాముడు ఎవరికి కీడు తలపెట్టేవాడు కాదు,అటువంటివాడిని చూడ్డానికి వెళుతూ ఇంతటి మహా సైన్యంతో పనేమి?' అడిగాడు గుహుడు. దానికి భరతుడు 'అటువంటి దుష్కాలం నాకెప్పుడు రాకుండుగాక. రాముడు నా సోదరుడు,తండ్రితో సమానుడు',అంటాడు. 'నేను రాముడిని వెనక్కు తీసుకువెళదామని  బయలుదేరి వెళుతున్నాను. నేను పలుకుతున్న ఈ మాట ముమ్మాటికీ సత్యం' అన్నాడు. దానికి గుహుడు ఆనందభరితుడై 'నీవు చేస్తున్నది చాలా గొప్పపని,నీ కీర్తి చిరస్థాయిగా ఉంటుంది' అన్నాడు . ఇంతలో ఇనుడస్తమించాడు.  ఇక్కడికి ఆపుతాను,ఇది పెద్ద ఘట్టం. టైప్ చేయడం కోసం కూచోవడం ఇబ్బందితో చిన్నచిన్నగా చేయక తప్పలేదు,మన్నిచండి.  

    ఆలోచన.

దూరాన్నించి గుహుణ్ణి చూసి సుమంత్రుడు భరతునికి చెప్పినమాట తీవ్రహెచ్చరిక. పెద్ద సేనను తీసుకుని బయలుదేరిన భరతుని,సుమంత్రుడు పూర్తిగా  నమ్మినట్టనిపించదు. అందుకే, ఈ పరోక్ష తీవ్ర హెచ్చరిక ఐ ఉండచ్చు. వచ్చేవాడు నీటిపైన,ప్రాంతంతెలిసినవాడుగా బలవంతుడు,మన సైన్యం ఏమీ చేయలేదు,ఇతనిని చిన్నవాడనుకుని ఉపేక్ష చేయకు  అన్నది ఈ తీవ్రహెచ్చరిక. డిప్లమసీ గురించి తెలుసుకోవాలన్నా,డిప్లమసీలో మాటాడటం ఎలాఉంటుందన్నది తెలుసుకోవాలన్నా రామాయణం చదవడం కాదు,  పారాయణ చేయాలి. గుహుడు భయపడ్డాడు,ఆత్మరక్షణచర్యలు తీసుకున్నా,విషయం తెలుసుకోడానికే భరతుణ్ణి కలవడానికొచ్చాడు. అవసరాన్ని బట్టి,యుద్ధానికే సిద్ద పడ్డాడు. వచ్చినవాడు మొహమాటం లేకనే రాముణ్ణి వెనక్కి తీసుకువెళ్ళడానికి ఇంత సైన్యం ఎందుకు? అన్న ప్రశ్న సూటిగానే వేసాడు. దానికి భరతుడు డిప్లమాటిగ్గా సమాధానమిచ్చాడు, పూర్తి అనుమాన నివృత్తి చేసాననుకున్నాడు. పెద్ద సైన్యాన్ని ఎందుకు వెంటబెట్టుకొచ్చాడన్న ప్రశ్న భరతుణ్ణి ఇక ముందుకూడా వేధిస్తుంది,అనుమానానికి నాంది చేస్తుంది. అంత సైన్యం ఎందుకు అన్నదానికి భరతుడు సమాధానం చెప్పినట్టు లేదు. గుహుడు భరతుణ్ణి పొగిడాడు,నీవు చేస్తున్నపని చాలా గొప్పదని,డిప్లమసీలో అవసరాన్నిబట్టి,సందర్భాన్ని,సమయాన్ని బట్టి తగుమాత్రం పొగడ్త కూడా భాగం. ఇంతలో సాయంత్రమయింది.

రాముణ్ణి వెనక్కి తీసుకువెళ్ళడానికే బయలుదేరానన్న భరతుని మాట గుహుడు నమ్మలేదు,నమ్మినట్టు నటించాడు..
 సైన్యం మాటముందూ వస్తుంది గనక ఒక మానుకుందాం. భరతుడు యుద్ధానికి దిగితే రామలక్ష్మణులు ఏం చేసి ఉండేవారు? మెదడుకి మేత ఆలోచించి,సకారణంగా,సహేతుకంగా  చెప్పండి.   

అనుమానం తీరని గుహుడు తరవాత ఏమి చేసాడో తెలుసుకోవాలంటే, తరవాత టపా కోసం ఎదురు చూడాల్సిందే! 
   

3, ఫిబ్రవరి 2026, మంగళవారం

కలికి చిలకల కొలికి .......

 కలికి చిలకల కొలికి .......

                              

 చిత్రం :  సీతారామయ్యగారి మనవరాలు (1991)

సంగీతం :  కీరవాణి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  చిత్ర


కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి


కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి

అత్తమామల కొలుచు అందాల అతివ

పుట్టిల్లు యెరుగని పసిపంకజాక్షి


మేనాలు తేలేని మేనకోడల్ని

అడగవచ్చా మిమ్ము ఆడ కూతుర్ని

వాల్మీకినే మించు వరస తాతయ్య

మాయింటికంపించవయ్య మావయ్యా


కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి


ఆ చేయి యీ చేయి అద్ద గోడలికి

ఆ మాట యీ మాట పెద్ద కోడలికి

నేటి అత్తమ్మా నాటి కోడలివి

తెచ్చుకో మాయమ్మ నీదు ఆ తెలివి

తలలోని నాలికై తల్లిగా చూసే

పూలల్లొ దారమై పూజలే చేసే

నీ కంటి పాపలా కాపురం చేసే

మా చంటిపాపనూ మన్నించి పంపూ


కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి


మసకబడితే నీకు మల్లెపూదండ

తెలవారితే నీకు తేనె నీరెండ

ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు

ఏడు జన్మలపంట మా అత్త చాలు

పుట్టగానే పూవు పరిమళిస్తుంది

పుట్టింటికే మనసు పరుగుతీస్తుంది

తెలుసుకో తెలుసుకో తెలుసుకో

తెలుసుకో తెలుసుకో మనసున్న మామ

సయ్యోధ్యనేలేటి సాకేత రామా


కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి

కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి

*****


ఈ పాట వింటుంటే ఒక తెనుగు జానపదగీతం గుర్తొస్తుంది. అది ఇదే ..


Courtesy:Whatsapp

మొదటి పాటలో ఆ చేయి ఈ చేయి అద్దగోడలికి, ఆ మాట ఈ మాట పెద్దకోడలికి అనే చరణం ఉంది. దీని అర్ధమేమి అనే ఒక ప్రశ్న చూసాను.సమాధానం చూడలేకపోయా! నాకు తోచినది చెబుతున్నా!


ఆ చేయి ఈ చేయి అద్దగోడలికి.......

ఈ అద్దగోడ గురించి తెలియాలంటే ఆచారం చేసేవారి వంటిల్లు ఎలా ఉంటుందో తెలియాలి. ఈ వంటిల్లు 15/8 కొలతల్లో ఉంటుంది. ఇందులో 10అ పొడుగు తరవాత అడ్డంగా ఒక గోడ 5 అడుగులపొడుగు రెండడుగుల వెడల్పు 4 అడుగుల ఎత్తునా ఉంటుంది. ఇందులో 10 అడుగులవైపు వంటపొయ్యిలు,పాలు,పెరుగు,పప్పూ ఉప్పులు పెట్టుకునే అలమారలు. వండుకున్నవి పెట్టుకోడానికి వేరుగా అలమార,పైన దండేలు,మడిబట్టలు ఆరేసుకోడానికి,ఎండుపుల్లలు తాళ్ళు వేలాడదీసి మధ్యలో పెట్టే ఏర్పాటు, అద్దగోడలో మడి మంచినీళ్ళ బిందెలు పెట్టుకునే ఏర్పాటూ ఉంటుంది. ఇది 'మడి' పక్క ఉండేది,దీన్నే ఆచారం వైపు అనగా అచారం చెయ్యి. ఇక రెండో భాగంలో తరవాణీ కుండ,చద్దెన్నాల ఊరగాయి జాడీలు, చద్దెన్నపు కంచాలూ, ఇలా ఉంటాయి. ఇది అనాచారం చెయ్యి. (అనాచారమంటే పనికిరానిదనికాదు,కొద్ది ఆచారం తక్కువ చేసేది.) ఈ ఆచారం చేతికి అనాచారం చేతికి హద్దు ఒకగోడ. ఆ గోడ అర్ధగోడ, హద్దుగోడ, కాలంలో అర్ధగోడ ఆతరవాత అద్దగోడగా రూపాంతరం చెందిది. ఇదే ఆచేయి ఈ చేయి అద్దగోడలికి కత.     

ఇక ఆమాట ఈ మాట పెద్దకోడలికి..

పాత తరం ఉమ్మడి కుటుంబాలంటే ఇంటిపెద్ద, ఆయన భార్య, వారి సంతానం. ఒక్కో ఇంట్లో 5 నుంచి 7 మంది కొడుకులు,అదేలెక్కన కూతుళ్ళూ ఉండేవారు. అటువంటి ఉమ్మడి కుటుంబం నేడు ఊహించనుకూడా లేము.  అటువంటి ఇంట పెద్దకోడలిది ప్రత్యేక హోదా,బాధ్యత,(చెప్పబడని)అధికారం.  ఈమె పెద్దలలో చిన్నది,చిన్నవాళ్ళలో పెద్దది. ఈమె తరాల మధ్య సరిహద్దులోది. పెద్దవాళ్ళ బాధలు కష్టాలు దగ్గరగా చూసేది,అర్ధం చేసుకోగల వయసుకు దగ్గరగా ఉన్నదీ. ఇక చిన్నవాళ్ళలో పెద్దది,చిన్నవాళ్ళ ఇష్టాలు,సరదాలు, ఇబ్బందులూ తెలిసున్నది. ఈమె అటు పెద్దవాళ్ళనూ ఇటు చిన్నలనూ సముదాయించగల స్థితిలో ఉంటుంది,చెప్పి ఒప్పించేవయసులో ఉంటుంది. సంసారం ఒడుదుడుకులు లేకనడుస్తోందంటే పెద్దకోడలు చాలా బాధ్యత తీసుకున్నట్టే. అటువంటి పెద్దకోడలు ఇటు పెద్దలమాట,ఇటు చిన్నలమాటా వింటూ సందర్భాన్ని బట్టి చెప్పి ఒప్పించడం,సముదాయించడం చేసేది గనక,ఆ మాట ఈ మాట పెద్దకోడలికి అన్నారు. ఇదీ పెద్దగోడలికి,అద్దగోడకి పోలిక. అందుకే 'అద్దగోడకి,పెద్దకోడలికి పనెక్కువ'అనే నానుడి పుట్టింది.
=====

27, జనవరి 2026, మంగళవారం

దొందూ దొందే!!!

దొందూ దొందే!!!

ఒకకొత్తగా పెళ్ళయిన జాయ,పతి. ఇద్దరూ కలసి ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో నది దాటాల్సి వచ్చింది. పడవెక్కి, ప్రయాణం తరవాత దిగేరు. నది ఒడ్డు ఎక్కుతూ తలపైకెత్తి చూస్తే, ఒడ్డున విరగబూసిన చింతచెట్టు కనపడింది ఇద్దరికీ,

పతి అసంకల్పితంగా   

తింతతెట్టు పూసిందే అన్నాడట!

చింతచెట్టు పూసిందే అన్నమాట.

దానికి జాయ మాటకలుపుతూ

తాతే పూతే తాలానికి తాయదా? పూయదా? అందట.

కాచే పూచే కాలానికి కాయదా?పూయదా అని ఆమె మాట. 

ఒకరికి "చ"పలకదు,మరొకరికి "క" "చ" రెండూ పలకవు.

ఇది విన్న పడవ సరంగు దొందూ దొందే!అన్నాడు.

ఇద్దరూ ఇద్దరే అన్నమాట. ఇతని "ఇ", "ర", ఒత్తులు పలకవు. 

ఈ చిన్ని కతని సరదాగా చెప్పుకుంటూ ఉంటారు. ఇది మేధావుల పరంగా ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం, ఒకరిని మరొకరు ఉత్పేక్షాలంకారలో పొగుడుకుంటూ ఉంటారు.

26, జనవరి 2026, సోమవారం

కలికాలం

 భారత గణతంత్రదిన శుభకామనలు


కలికాలం 


కలికాలం I

ఇది కలికాలం II


ఆకలి కాలం, 

మూకల కాలం,

కేకల కాలం,

రూకల కాలం. 


కలికాలం I

ఇది కలికాలం II


రూపుల కాలం,

మాపుల కాలం,

రేపుల కాలం, 

పాపుల కాలం.


కలికాలం I

ఇది కలికాలం II


చూపుల కాలం

రాపిడి కాలం

చావుల కాలం

దోపిడి కాలం.

22, జనవరి 2026, గురువారం

రోగం రొష్టు-సంసారం గుట్టు

 రోగం రొష్టు-సంసారం గుట్టు


ఇదొక నానుడి,నాటికాలందే కాదు నేటికాలందీనూ!

 రోగం రొష్టు

ఏం? ఎందుకూ కదా కొచ్చను. నాటికాలంలో వైద్య సహాయం తక్కువ,కావల్సినవారందరికి కబుర్లు చేసి మరీ చెప్పుకునేవారు,ఉత్తరాలూ రాసుకునేవారు. మీ అల్లుడికి జ్వరం ఎంతకీ తగ్గటం లేదు,వైద్యం దారి వైద్యందే జ్వరందారి జ్వరందేలాగా ఉందీ అని, అటునించి  ఈ మాత్రలువాడి చూడు అని మనిషిచేత పంపడమో,ఉత్తరం రాయడమో చేసేవారు. ఇందుకోసం రోగం రొస్టు. నాటి రోజుల్లో జబ్బులు కూడా చెప్పుకునేవే ఉండేవి.   నేడు డాక్టర్ దగ్గరకెళితే చాంతాడంత టెస్టులు రాసి చేయించుకురా అని పంపితే అవి పూర్తయ్యేటప్పటికే వారం పడుతుందిలా ఉంది. ఇక వైద్యం సంగతి చెప్పేదేలేదు. మరెవరితోనైనా చెప్పుకుంటే, ఆయన దగ్గరకెందుకెళ్ళేరు, ఈయన  దగ్గరకెళ్ళలేకపోయారా? ఇలా సలహాలిస్తే వెళ్ళిన ప్రతి డాక్టరూ టెస్టులు రాస్తే,చేయించేమని చెప్పినా మళ్ళీ చేయించాల్సిందేనంటే చద్దికంటే ఊరగాయి ఎక్కువైన చందమైపోయింది,నేటి వైద్యం. అబ్బే! అమెరికా తీసుకెళ్ళలేకపోయారా? అమెరికాలో వాళ్ళు వైద్యం గొప్పగా చేసినా అక్కడివాళ్ళు ఎందుకు చస్తున్నట్టు? ఇదికదా కొచ్చను. అంచేత నేడు రోగం గుట్టైయింది. ఇప్పుడు చెప్పుకునే రోగాలూ రావటం లేదేమో!  ఇక దేశంలో కూడా సెకండ్ ఒపీనియన్ వైద్య శాలలు వెలిసాయి.వీరు వైద్యం చెయ్యరు. టెస్టులు చేసి అన్నీ  రోగ నిర్ణయంచేసి చెబుతారు.పాత వైద్యం తాలూకు రికార్డ్ ఇవ్వక్కరలేదు.  టెస్టులలో తేడా పాడా ఉండదనీ,రోగనిర్ణయం కచ్చితాంగా చేస్తామనీ చెప్పుకుంటారు.పంపించేస్తారు. ఆ తరవాత రోగి ఇష్టం.   


ఇక సంసారం గుట్టు. 

సంసారంలో అనేక ఇబ్బందులుంటాయి. పెళ్ళాం గయ్యాళి కావచ్చు,లేదా మేదకురాలు కావచ్చు. అలాగే మొగుడున్నూ! పిల్లలు చెప్పినమాట  వినకపోవచ్చు. ఈడొచ్చిన పిల్ల ప్రేమలో పడచ్చు. ఇలా ఉంటాయి. లేదా డబ్బు ఇబ్బందులూ,రాబడి తక్కువా,ఇలా అనేకం.   బయట చెప్పుకునేవా?  అమ్మా! మా ఆయన ఎందుకూ పనికిరాడే, అందుకూ పనికిరాడే  అని పాటికేళ్ళు సంసారం చేసినామె తల్లితొ చెప్పుకుంటే,తల్లి మాత్రం ఏం చేయగలదు? చులకన కావడం తప్పించి. అందుకే పెద్దలు


ఆయుర్విత్తం గృహఛ్ఛిద్రం 

మంత్రమౌషధ సంగమౌ 

దానమానావమానశ్చ

నవగోప్యా మనీషిభిః 


వయసు,సాంసారంలోని ఇబ్బందులు,మంత్ర,తీసుకునే మందు,స్త్రీ పురుష సంగమం,దానం,మానం,అవమానం ఈ తొమ్మిదీ గుట్టురా బాబూ అన్నారు. ఆపై మీచిత్తం.  ఇప్పుడంతా పబ్లీకున చెప్పుకునేవే అంటారా?అంతా ట్రాన్స్పరెన్సీ అంటారా? తమ చిత్తం.    

16, జనవరి 2026, శుక్రవారం

తీర్థానికి వెళ్ళొచ్చా!

       తీర్థానికి వెళ్ళొచ్చా!

 తీర్ధoలోకి వెళ్ళె ముందు ఒక చిన్న మాట. 

మళ్ళీ సంవత్సరమేమో మనమేమో అని ఒకసారి తీర్థం చూసిరావాలనుకున్నా

ఈ  ఊరువచ్చింది మొదలు తీర్ధం చూస్తూనే ఉన్నా. భోగినాడు ఉదయమే అమ్మను దర్శించడం ఆనవాయితీ,కాని తీర్ధానికి వెళ్ళాలంటే దీపాలు పెట్టేకానే వెళ్ళాలి,అందుకు సంక్రాంతి రోజు సాయంత్రం వెళ్ళడానికి ముందుగా కోడలమ్మాయికి చెప్పేను. అబ్బాయికి చెప్పినట్టుంది, ఎప్పుడు వెళదాం తీర్థానికని అడిగాడు. సంక్రాంతిరోజు రాత్రి 6 దాటాకా అనడంతో నా తీర్థానికి ప్రయాణం నిశ్చయమయింది. నా చిన్నకొడుకు ఇప్పుడు నువ్వు తీర్థానికి వెళ్ళకపోతే నష్టమేం లేదు,జనంలో నడవలేవని విసుక్కోలేదు.  బండి మీద తీసుకెళ్ళి తీసుకొస్తా,భయము లేదని చెప్పి ఒప్పించాడు. 

ఎక్కడికి ఒకడినే వెళ్ళే సాహసం చెయ్యడం మానేసి చాలాకాలమయింది,పిల్లలతోడు అవసరమూ అయింది. బయలుదేరాలంటే ముందు కోడలమ్మాయి స్వెట్టరు తొడికి మంకీ కేప్ పెట్టి కర్ర చేతికిచ్చి తయారుచేసి బండెక్కించింది. బండి ఎక్కడ పెట్టాలో వగైరా చెప్పబోతుంటే నేను చెబుతారండి అనేసేడు. నాకేమో, వాడు చిన్నపిల్లాడిలా కనపడతాడు. వాడేమో ఏభైదాటి లోకం చూస్తున్నవాడు. అన్నీ తెలుసని వాడనుకుంటే చిన్నపిల్లాడు ఏమీ తెలియనివాడని నేననుకుంటా ఇక్కడొస్తుంది తేడా కాలం మారిందన్న విషయం మరచిపోతుంటా,పిల్లల దగ్గర.  

అలా తీర్ధాని చేరి దూరంగా భద్రంగా ఉండే చోట బండి పెట్టేకా నా కర్రతో నా నడక తీర్థంలోకి మొదలయింది.  జనం,ఒకటే జనం. అదేమో 100 అడుగులరోడ్డు  రైల్వే స్టేషన్ నుంచి రాజమండ్రి-కాకినాడ కాలగట్టు రోడ్డు దాకా ఒక కిలో మీటర్ పొడుగు, దానిలో ఈ తీర్థం. ఎల్.ఇ.డి దీపాలతో తీర్థం వెలిగిపోతోంది. లోపలికి అడుగెట్టగానే గుండెలవిసేలా డి.జె సౌండు, గుండెలు పట్టేసినట్టయింది. గబగబా ఆ ప్రదేశం నుంచి కదలిపోయా,ముందుకు.,జనంలో. 

                                                      అమ్మగారబ్బాయి.


గ్రామ దేవత వీరుళ్ళమ్మ

కత్తి చేతితో దొరికిందట,మ్మఅందుకు వీరులమ్మ
( వీరుల తల్లి) అని నామకరణం చేసేరు. ఆ తరవాత అదికాస్తా వీరుళ్ళమ్మ ఐపోయింది. ఇది ఒకప్పటి ఫోటో,నేడు గుడి చాలా అభివృద్ధి చేసేరు. అమ్మను మొన్న భోగిరోజు ఉదయమే దర్శించి వచ్చా..

మా (స్లోగన్)నినాదం అందరూ బాగుండాలి,అందులో మనముండాలి. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే.




ఈ సారి గాజు సామాను కొట్లు,పింగాణీ సామాను కొట్లు ఎక్కువ వచ్చాయి.
తీర్థంలో అడుగెట్టగానే ఛాట్ మసాలా వాసన గుప్పున కొట్టింది. తీర్థంలో  పానీ పూరి,ఇతర తినుబండారాల కొట్లే ఎక్కువ కనపడ్డాయి. అక్కడే జనం ఉన్నారు. 

జైశ్రీరాం జండాలు బాగానే అమ్ముడుపోతున్నాయి.ఒకటి కొన్నా!


బతికి ఉన్న త్రాచునే మెడలో వేయించుకుందో అమ్మాయి. ఫోటో తీసేలోపు తీసేసింది. నీ ధైర్యానికి మెచ్చే, అని చెప్పేను. భర్త అనుకుంటా ఆ తరవాత ఆముదం తాగినవాడిలా మొహం పెట్టి పామును మెడలో వేయించుకున్నాడు,తాను భయపదటం లేదని. నేను ఆ అమ్మాయిని ప్రశంస చేస్తుంటే జనం మూగేసేరు,చుట్టూ. ఈ సందర్భంగా ఒక శ్లోకం గుర్తొచ్చింది.


స్త్రీణాం ద్విగుణమాహారం బుద్ధిశ్యాపి చతుర్గుణమ్
సాహసం షడ్గుణం చైవ, కామోష్ట్య గుణి ముచ్యతే. 

మగవాడితో పోలిస్తే స్త్రీలు ఆహారం రెట్టింపు తీసుకుంటారు, తెలివి నాలుగురెట్లు, ఆరు రెట్లు సాహసం, కామం ఎనిమిదిరెట్లు ఉంటుందని చెబుతున్నారు పెద్దలు.


పచ్చబొట్టు వేసేవాళ్ళు ఇద్దరు కనపడ్డారుగాని,వేయించుకునేవాళ్ళే కనపడలేదు. కిందటి సారి ఇల్లాలితో  వచ్చినపుడు జరిగిన సంభాషణ గుర్తొచ్చి మనసు చేదు తిన్నట్టయింది  


వాచీల కొట్టు. ఇంకా వాచీ పెట్టుకునేవాళ్ళు ఉన్నారా అనుకున్నా ఏదైనా 150, కొంటున్నారు. రెండు కొట్లు కనపడ్డాయి. 



కాలవగట్టు రోడ్డు,మైన్రోడ్డు కలిసేదగ్గర వెలసిన రాజరాజేశ్వరీ దేవి. వీరుళ్ళమ్మ,రాజరాజేశ్వరీ దేవిల ఆలయాల మధ్య ఈ తీర్థం. ఇద్దరమ్మల కాపు.


మెత్తటి రాయి (సోప్ స్టోన్) తో తయారు చేసిన పిల్లల ఆటవస్తువులు,రుబురోళ్ళు,వగైరా


జీళ్ళు,ఖర్జూరం కొట్లు తక్కువగానే ఉన్నాయి,రెండో మూడో కనపడ్డాయి.



                                                    బొమ్మల కొట్లు ఎక్కువే ఉన్నాయి.


జనంలో నడవడమే కష్టమయింది. ఎక్కువ ఫోటో లు తీయలేకపోయా.మొత్తానికి స్త్రీల అలంకరణ సామాను,పిల్లల ఆటబొమ్మల కొట్లు ఎక్కువ. జయింట్ వీల్ ఉన్నవైపు పోలేదు. ఇక్కడికే నీరసమొచ్చింది. దేవి సెంటర్ లో గుడి పక్క క్రీనీడలో నిలిచాడొక ఎస్.ఐ గారు,నీరసం మొహాన కొట్టినట్టు కనపడుతూనే ఉంది. భోజనం చేసేరా? అడిగా, లేదు, అన్నాడు. అయ్యో! అని, కేరేజి తెప్పించుకోవచ్చుగా ఇంటినుంచి అన్నా! భోజనం చేయడం కుదరదండి, ఈ మూడు రోజులూ ఇంతే,టిఫిన్ తోనే కాలం గడపాలన్నాడు. దగ్గరేం లేకపోయింది,తినడానికి ఇవ్వడానికి. పాపం! పోలీస్ జీవితం ఇంతేనా అనిపించింది. 

14, జనవరి 2026, బుధవారం

పట్నాలలో, పల్లెలలో కూడా,

                                               పట్నాలలో, పల్లెలలో కూడా

తెల్లవారు ఝామున లేచే అలవాటు లేదు.
ఒంటిని నువ్వులనూనె రాసింది లేదు.
సున్నిపిండి లేదు.
నలుగు మొదలే లేదు. 
మాగిళ్ళు వదిలింది లేదు.
కుంకుడు కాయ,షీకాయ తలంట్లు లేవు.
సాంబ్రాణి పొగ వేసే అలవాటు లేదు. 
నిప్పుల కుంపటి లేదు.
నీళ్ళ పొయ్యి, బొగ్గులసలే లేవు. 
టైలర్ కుట్టిన బట్టలు లేవు.
లంగా ఓణీ వేసిన ఆడపిల్లలేదు.
పంచగట్టిన, కోరమీసమున్న మగాడు లేడు.
తెనుగు రాయను చదవను వచ్చినవారు లేరు.
రెండు మాటలకు ఒక ఇంగ్లీషు పదం మాటాడని తెనుగువాడు లేడు. 
పిజ్జాలు బర్గర్లు అల్పాహారం, ఆవిరికుడుములు వగైరాలు లేవు.
వంట చేసిన ఇల్లు లేదు. 
దానం లేదు,ధర్మం మొదలే లేదు.
హస్తకళలు లేవు.
హరిదాసులు,కొమ్మదాసర్లు,గంగిరెద్దులు లేవు.
ముగ్గు వేసిన వాకిలి లేదు.
వరి కళ్ళాలు లేవు.
కంది చేలు కనపడటం లేదు.
పెరడున్న ఇల్లు లేదు.
మొక్కలు,చెట్లు ఉన్న ఇళ్ళు మొదలే లేవు.
కార్నివాల్స్ తప్పించి తీర్థాలు లేవు.
వేష భాషల్లో ఆడా,మగా తేడా లేదు.
ఉమ్మడి కుటుంబాలు లేవు.
బంధువులే లేరు.
వదిన,మరదళ్ళ సరసం లేదు.
బావా మరదళ్ళ హాస్యం లేదు.
దొంగ ముద్దులు లేవు.
పడుచు జంటలు లేవు.
పిల్లలు లేరు.
సెల్ ఫోన్ లేనివారు లేరు.
నెట్ లేనిఫోన్ లేదు. 
మందుకు తప్ప, తిండికి డబ్బు లేదు.
కోడిపందాలు లేని ఊరు లేదు. 

చిభాశర్మ

12, జనవరి 2026, సోమవారం

నిషేధం

నిషేధం.


ఏరకుమీ కసుగాయలు

దూరకుమీ బంధుజనుల దోసము సుమ్మీ

బారకుమీ రణమందున

మీరకుమీ గురువునాజ్ఞ మేదిని సుమతీ

పచ్చి కాయలు కొయ్యకు.బంధువులలో లోపాలు ఉండచ్చు,అంతలో వారిని తూలనాడడం తగదు,తప్పు సుమా! యుద్ధరంగం నుంచి పిరికివాడిలా పారిపోకు.దేశానికి అవసరమైనపుడు పారిపోవడం తప్పు.గురువు చెప్పిన మాట అతిక్రమించకు.


నేటికాలంలో పచ్చికాయలే కోసి, రకరకాల కృత్రిమ పద్ధతుల ద్వారా పండబెడుతున్నారు. అన్ని స్థాయిలలోనూ, కృత్రిమంగా పెంచుతున్నారు. అన్ని కాయలకి పళ్ళకి ఇంజక్షన్లు చేస్తున్నారు. చివరికి, కొబ్బరికాయ కల్తీ లేనిదనుకున్నా నేటి దాకా,కాదు కొబ్బరికాయకి చెట్టున గెలపై ఉండగా ఇంజక్షన్ చేస్తున్నారు. మనల్ని దేవుడే రక్షించాలి.  


బంధుజనలెక్కడబాబూ! ఒకప్పుడు ఇద్దరు లేక ముగ్గురుచాలు మారోజుల్లో మాట, అరవైయేళ్ళ పైమాట. ఆ తరవాత మేమిద్దరం మాకిద్దరు,ఇదీ స్లోగను. ఆపై మేమిద్దరం మాకొక్కరు. ఇప్పుడు స్లోగన్ పెళ్ళొద్దు పెళ్ళాం కావాలి,పెళ్ళొద్దు మొగుడు కావాలి,ఇదీ స్లోగను. ఏరోజుకారోజే కొత్త మొగుడు,కొత్తపెళ్ళాం. లివ్ ఇన్ చాలు,పిల్లలా? బెడద. ఇక బంధువులెక్కడనుంచి వస్తారు? ఎవడి పెళ్ళాంతో ఎవడేనా తిరగచ్చు, లైనేయచ్చు, తప్పుకాదు.. ఆడామగాకి తేడాలేని రూలు, ఇదే చట్టం,ఇదే న్యాయం. ఇప్పుడు రాజకీయ నాయకులు ముగ్గురు నలుగురు పిల్లల్ని కనండి, ప్రోత్సాహకాలు ఇస్తామంటున్నారు. మళ్ళీ పెళ్ళి చేసుకుంటే ఎలా ఉంటుంది? ఆలోచిస్తున్నాను,లేదూ, ఎవడి పెళ్ళానికైనా లైనెయ్యాలి.  

  

మూడో ప్రపంచయుద్దం  రాబోతోంది. అంతా సిద్ధం కావాల్సిందే,ముసలి,ముతకతో సహా!  చావో! రేవో!! నేటికాలంలో అందరూ కీబోర్డ్ వారియర్లే, అలా కుదరదు.


గురువు? ఎక్కడబాబూ! అంతలోనూ కట్,పేస్టు ప్రొఫెసర్ల సంఖ్య పెరుగుతోంది. కట్ పేస్టుకి, కాపీ పేస్టుకి తేడా తెలియని గొప్పోళ్ళూ తయారవుతున్నకాలం. ఏమవుతుంది,ముందు కాలంలో? భగవాన్ జానే!!!