రానివారిని పిలవ వేడుక బోడితల అంట వేడుక
రావాలి!రావాలి! అంటూ ఉంటారు ఉయ్యాలలో పిల్లల దగ్గరకెళ్ళి, నిజమే కాబోలనుకుని ఆ పిల్లలు చేతులందిస్తారు,స్వయంగా లేవలేరు గనక. కాని ఇలా అన్నవారు వారిని ఎత్తుకున్న పాపానపోరు. పాపం చీర నలిగిపోదుటండీ :) ఇలా పిలవడం ఒక వేడుక.
రావాలి!రావాలి!! రమ్మంటె రావాలి
రకరకాల రసికతలెన్నో రాణిగారు తేవాలి!!
రాణిగారు తేవాలి!!
ఆగాలి! ఆగాలి!! ఆగమంటె ఆగాలీ!
ఆలుమగలమయ్యేదాకా
అయ్యగారు ఆగాలి! అయ్యగారు ఆగాలి!!
ఆవిడ బ్రేకులేసినా వినేలా లేరు జనం.ఇదెప్పటీదో యుగళ భావగీతం. అప్పటికి ఇప్పటికి మార్పులేనిది ఇదొకటేనేమో!! ఇది మాత్రం పిలవ వేడుక కాదేమో?
మీరు మావూరొస్తే మా ఇంటికి తప్పక రావాలి! అటులటులటులనే సమాధానం, తప్పక వస్తానండీ వాగ్దానం. ఈయన కదిలేదే లేదు, కాదు కదలలేడు.. ఈ పిలుపొక వేడుక, అంతే అదంతే!!!!
ఎన్నాళ్ళని నాకన్నులు కాయగ ఎదురుచూతురా గోపాలా!
ఎంత పిలచినా ఎంతవేడినా ఈ నాటికి దయ రాదేలా?
గోపాలా నంద గోపాలా!
ఆర్తి పిలుపే, శాంత కుమారి గొంతులో తల్లి వేదన, ఏదీ వచ్చాడా? వేడుకే అయిపోయిందా పిలుపు.
రారా కృష్ణయ్యా!రారా కృష్ణయ్యా!! అబ్బో ఈ పిలుపు ఎంతకాలం నుంచి ఉన్నదో! ఆయన విన్నాడా? అసలున్నాడా? అన్నదే నేటి కొచ్చను. ఇలా అనుమానంతో అవసరమొచ్చినపుడు పిలిస్తే ఆయనొస్తాడా? నువ్వేం గజేంద్రుడివా? నీ పిలుపులో ఆర్తి లేదు, అదక్కడికి చేరలేదు, అంతే. చేరదు కూడా! మరెందుకు పిలవడం ? పిలిచామండీ ఆయనే రాలేదు అని, మళ్ళీ నెపం ఆయన మీదకే తోసెయ్యడానికే! ఒక వేళాయన పొరబాటుగా వచ్చినా, ఏంటీ? నువ్వు కృష్ణుడివా? నన్ను నమ్మమన్నావా? ఇదీ ప్రశ్న :) అందుచేత ఆయనెందుకొస్తాడు? రాడు! రాడుగాక రాడు!!! ఈ పిలుపొక వేడుక కదా!!!!!!!!!
వీరెవరూ పిలిచినా రారు,అందుకే పిలవ వేడుక. నిజంగా వస్తే భరించలేరు, ఎందుకో తెలుసా? వీరంతా సేవలు చేయించుకునేవారే! ఎవరికంత తీరిక ?
ఇక బోడితల గురించి చెప్పేదేలేదు. నేటి రోజుల్లో నూటికి తొంభై మంది ఖర్వాటులే. ఎందుకనీ? అందరూ మేధావులేగా! అందుకనీ.అందరూ కూర్చున్న దగ్గరనుంచి లేచిన పాపాన పోరు. మేధావులందరీ బట్టతలుంటుంది(ష). వీరికి ఒంటికి నూని రాసుకుని నలుగు పెట్టుకుని తలంటుకునే భాగ్యం ఉన్నట్టా? ఇటువంటి ఖర్వాట మేధావిని కట్టుకున్న ఇల్లాలు ఇవేళ భోగి తలంటుకోవాలి లేవండి తలంటుతానని లేపిందిట, ఉదయమే!. పాపం ఈ మేధావి పెళ్ళాం మాట జవ దాటలేనివాడు. బాత్ రూం లోకి అన్నట్టు దీన్ని వాష్ రూం అనాలష, బరబరా లాక్కుపోయి నెత్తిన నాలుగు చెంబుల నీళ్ళు పోసి తలంటేసేనందిట. కుంకుడుకాయ,షీకాయ, షాంపూల బెడదలేదు, తల ఆవిడ చేతుల్లో తబలా వాయిద్యం కాదు. బోడితల అంట వేడుకకాదా? కొచ్చను.
No comments:
Post a Comment