Wednesday, 28 December 2022

ఊపిరి నిలబడితే

 



ఊపిరి నిలబడితే

ఊపిరి నిలబడిన తరవాతేమవుతుంది? అది నీకనవసరం.నువ్వుండవు కదా! ఏంజరిగేది నీకు తెలీదు. నీ శరీరాన్ని ఏడు కట్ల సవారిమీద పెట్టి తడపలతో గట్టిగా బిగించినా నీకు తెలీదు.  ఆతరవాత తగలెయ్యడమో, పూడ్చిపెట్టడమో చేస్తార్లే. అదీ నీకు తెలీదు. అప్పటిదాకా ఇంజక్షన్ సూది గుచ్చితే అబ్బా అన్నవాడివి, పలకవు.

ఐనా తెలుసుకో!

మొదటిరోజు ఏడుపులు,పెడబొబ్బలు.

రెండోరోజు శవానికి అంత్యక్రియలు, అదే నువ్వు 'నేన'నుకున్న నీ శరీరానికి .

మూడో రోజు ఎత్తిపోతలు, కొడుకులు,కోడళ్ళు;కూతుళ్ళు,అల్లుళ్ళు నీ అస్థులకోసం సిగపట్లు ప్రారంభం. చివర మూడురోజులు అనగా పదోరోజు నీ బంధువులు మిత్రులు ఒక సారి నీ పేరు జెప్పుకుని గోదాట్లో ములిగి మూడుదోసిళ్ళ నీళ్ళు పోస్తారు అదే ధర్మోదకం, చాలు, అంతతో మిత్రులు,బంధువులకి సరి.

పదకొండో రోజు పెద్దల్లో కలిపేస్తారు. సగోత్రీకులకి సరి.

పన్నెండో రోజు స్వర్గపాధేయం, నువ్వు సర్గానికి పోవాలని ఆకాంక్షతో కొడుకులు కోడళ్ళు చేసేది. అంతే ఐపోయింది.  కోడుకులు కోడళ్ళకి సరి. ఆ తరవాత నిన్ను తలుచుకునేవారే లేరు.  

 ఒక్కడే  కొడుకు, 

అబ్బా! పన్నెండు రోజులు లీవ్ వేస్ట్. ఏముందిక్కడ, ఈ పెద్ద కొంప తప్పించి.ఇదెందుకూ పనికిరాదు,  మంచిల్లు టవున్ లో కొనిచావలేదు. ఏమైనా అంటే, ''తాతలు కట్టిన ఇల్లురా, ఈ జీవి ఇక్కడే పోవాలి'', అని కదిలిరాలేదు. ఇక కోడలు ''తల స్నానాలతో తలనొప్పి పట్టుకుంది, ముసలాయన ఉండి ఉండి చలికాలంలో చచ్చేడు, మా కర్మకొద్దీ!''

కొడుకులూ, కూతుళ్ళుంటే

"ఏమే అమ్మాయ్! ముసలాయన చాలా షేర్లు కొన్నాట్ట, కోటి రూపాయల ఖరీదుంటాయట, అల్లుడేమన్నా కనుక్కున్నాడా? లేకపోతే నీతోటికోడలు, మరిది కైంకర్యం చేసెయ్యగలరు.నీ తోటికోడలు తండ్రున్నాడు చూడు దేవాంతకుడు.అసలు విల్లేమన్నారాసాడటా? ఆస్థులు ఎక్కడేమున్నాయో మీ ఆయనకి తెలుసా! లేకపోతే కాళ్ళొచ్చి నడిచిపోతాయి. " ఫోన్ లో, పెద్దకోడలు తల్లి వాకబు, హెచ్చరిక, సలహా!!!!

"అడిగేరట తమ్ముణ్ణి,విల్లేదో రాసి చచ్చేడట, ఇంకా వివరాలేం తెలియవు. ముసలాయన చెప్పి చావలేదు.ఏం మిగులుతాయో ఏంపోతాయో!నా మొగుడో బుద్ధావతారం ఏంచెయ్యను చెప్పు.అటువంటివాణ్ణి కట్టబెట్టేరు."

"సరెలే ఆ సంగతిప్పుడెందుకుగాని, పనిచూడు.ముసలాయన దేవాంతకుడు". 

"ఏరా తమ్ముడూ/అన్నయ్యా! ఆస్థులన్నీ నాన్న స్వార్జితంట కదా! మన మామయ్య చెప్పేడు. మాకేమైనా రాసేడా? విల్లులో! అంతా మీరే రాయించేసుకున్నారా?"

"ఏమోనే ఇంకా విల్లు చూడలేదు, లాయర్ దగ్గరుందిట, తెచ్చుకోవాలి, అప్పుడుగాని తెలీదు, ముసలాయనేం చేసేడో!!"

"అమ్మ నగలూ అలాగే కొట్టేసేరు, మాకు అమ్మ విల్లులో ఏమీ రాయలేదని, కొద్దిగా బంగారం మా చేతులో పెట్టి తూతూ మంత్రం చేసేసేరు.ఈ ముసలాయనేo చేసేడో!"

ఇలా చచ్చిన తరవాత కూడా తిట్టించుకోవాలా? ఆస్థులు సంపాదించి.

నీ పేరు స్థిరంగా నిలబడే పని చేసిపో! నీవల్లకాదూ, అంత తాహతులేదు!అతిగా కూడబెట్టకు, అనుభవించు, ఉన్నంతలో దానం చేసెయ్యి. 

నీకొడుకులు తెలివైనవాళ్ళైతే నీ సంపాదన వాళ్ళకి అక్కర లేదు. వాళ్ళే సంపాదించుకోగలరు.

నీ కోడుకులు తెలివి తక్కువవాళైతే నువ్వు బంగారపు కొండలు సంపాదించి ఇచ్చినా నిలబెట్టుకోలేరు, పైగా ప్రాణహాని కూడా.

అందుచేత తగుమాత్రంగా సంపాదించు, అనుభవించు, నువ్వు కట్టుకున్నవాళ్ళు, కన్నవాళ్ళు, నిన్ను నమ్ముకున్నవాళ్ళు అనుభవిస్తే చూసి ఆనందించు. 


9 comments:

  1. శర్మ గారు,
    చివరి మూడు పేరాలు సరిగ్గా చెప్పారు. అబ్బాయికైనా అమ్మాయికైనా అవి సరిపోతాయి.

    ReplyDelete
    Replies

    1. Anonymous28 December 2022 at 11:02
      ఇది పచ్చి నిజమండి! కొన్ని కొన్ని తేడాలతో. చివరి పేరాలు నిక్కచ్చి నిజాలు కదా!

      Delete
  2. ఏమి టీ నిర్వేదం గురూజీ!

    ReplyDelete
    Replies
    1. Anonymous28 December 2022 at 19:09

      నిర్వేదం కదబ్బా! పచ్చి నిజం. మందు మహాత్మ్యం

      Delete
  3. BP, Sugar మందుల “మహత్యం” నిర్వేదమే.
    మీరే “మందు” గురించి మాట్లాడుతున్నారో? 🙂

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు29 December 2022 at 10:50
      మీరనుకున్న మందుకాదు :)
      జర,రుజలు విడదీయలేనివి.జర పెరిగినకొద్దీ
      రుజకి కొత్తకొత్త చిన్నెలొస్తాయి. ఆ చిన్నెలకి మందులూ తప్పవు. ఈ మందులకి పక్కవాద్యాలుంటాయి. అటువంటి ఒక మందుకి చాలా పక్కవాద్యాలున్నాయి. వాటన్నిటిని తట్టుకున్నా! ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రావడం పక్క వాద్యాలలో చివరిది. బుద్ధి జీవులపైనే దాని ప్రభావం ఉంటుందనుకుంటా.దానికి విరుగుడె ఈ టపా! అంత పిరికివాడిని మాత్రం కాదు! దేనినైనా తట్టుకుని నిలబడతా! అనుమానంలేదు.సెంచరీ నాట్ ఔట్! క్రీజ్ వదలిపెట్టేదే లేదు :)



      Delete
    2. అదీ లెక్క. “తగ్గేదే లే” అంతే. That’s the spirit 👍🙂.

      Delete
  4. ఆఖరు పేరా అంతకుముందు చెప్పినదానికి విరుద్దంగా అనిపిస్తోందండి శర్మ గారు

    ReplyDelete
    Replies

    1. Anonymous30 December 2022 at 23:01
      ఊపిరి నిలబడ్డ తరావాతేంజరుగుతుందన్నది నీ కనవసరం, ఐనా తెలుసుకో మన్నదేమాట. ఇక కొండల సంపాదనకి వ్యసనపడకు, కళ్ళు మూసుకుకూచుంటే బువ్వ నోటికి రాదు, తగు సంపాదన జీవనానికి అవసరం అన్నదే మాట. ఇందులో తేడా ఏమో నాకైతే అర్ధం సుమండీ!

      Delete