ఎవరిలాగ వాళ్ళే రాసుకుంటారు, ఒకరిలాగ మరొకరు రాయరు, ఇది లోక రీతి, కాని సోషల్ మీడియా రీతి అది కాదుట. నా లాగ రాసేవారు దొరికారండోయ్!
Posted on డిసెంబర్ 26, 2016
శర్మ కాలక్షేపంకబుర్లు-రావణ కాష్ఠం
రావణకాష్ఠం
రావణ కాష్ఠం అంటారు కదా దీని సంగతేంటో చూడాలని రామాయణం తిరగేశా. అందులో వాల్మీకి ఇలా చెప్పేరు. శ్లోకాలు పెట్టాలనుకున్నాగాని, టైప్ చెయ్యలేక మానేశాను, అర్ధం మాత్రమే రాస్తున్నా!
”రావణ కాష్ఠానికి గాను చందనపు కఱ్ఱలు, పద్మకములు, పేర్చారు, వట్టివేళ్ళు, సుగంధాన్నిచ్చేవాటిని పేర్చారు, వాటిపై. దానిపై జింక చర్మం పరచారు. దానిపై రావణుని శరీరాన్ని ఉంచారు. చితికి ఆగ్నేయంగా ఒక వేదిక నిర్మించారు. దానిపై పశ్చిమంగా గార్హపత్యాగ్ని, తూర్పున ఆహవనీయాగ్ని, దక్షణాన దక్షణాగ్ని ఉంచారు. సృక్కు,సృవాలతో పెరుగు,నెయ్యి కలిపినది చితిపై ఉంచారు. కాళ్ళ వైపు సోమలత తెచ్చిన బండిని ఉంచారు, తొడల మధ్య సోమలతను దంచిన కఱ్ఱరోలుంచారు. ఇక సృక్కు,సృవాలు,అరణులు,చెక్క పాత్రలు,ముసలము అనగా రోకలి ఇతర యజ్ఞ సంబంధ వస్తువులు కఱ్ఱవాటిని వాటికి తగిన ప్రదేశాల్లో ఉంచారు. మంత్రపూరితంగా మేకను బలి ఇచ్చారు. ఆ పైన నేతితో తడిపిన దర్భలుంచారు. ఆ తరవాత రావణ శరీరంపై పూలమాలలు, వస్త్రాలు ఉంచారు. ఇప్పుడు విభీషణుడు రావణకాష్ఠా నికి నిప్పు పెట్టేడు” అన్నారు.
దీనిలో చిత్రం ఏముందని కదా! రావణుడు బ్రహ్మగారి మనుమడు, అనేక యజ్ఞాలు చేసిన వాడు. ఒక యజ్ఞంలో సోమలత తేవడానికి బండి కావాలి,దానిని తయారు చేస్తారు, కొత్తది. సోమలతను దంచడానికి రోళ్ళు తయారు చేస్తారు, సృక్కులు,సృవాలు ఉంటాయి నేతిని అగ్నిలో ఆహుతి చేసేందుకు. సోమలతను దంచే రోకళ్ళుంటాయి, చెక్కపాత్రలుంటాయి, అగ్నిని మథించే అరణులుంటాయి, ఇలా యజ్ఞానికి కావలసిన సకలమూ కఱ్ఱరూపంలోనే ఉంటుంది. వీటిని తయారుచేస్తారు. ఒక యజ్ఞానికి వాడిన వాటిని మరొక యజ్ఞానికి వాడకూడదు. రావణుడెన్ని యజ్ఞాలు చేశాడో తెలియదు. యజ్ఞం చేసినవారు, వారు యజ్ఞంలో ఉపయోగించిన సామగ్రి మొత్తం దాచుకోవాలి, దానిని వారి అనంతరం వారి శరీరంతో కాష్టం మీద వేసి తగలేస్తారు, రావణుడెన్ని యజ్ఞాలు చేశాడో అంత సామగ్రి చితి మీద వేశారనమాట. ఇవేకాక రావణుడు నిత్య కర్మలో ఉపయోగించినవాటినీ ఇందులో చేరుస్తారు. మనవాళ్ళో మాటంటారు, ఎవరేనా వస్తువులు ఇలా దాచుకుంటుంటే ”చచ్చాకా మీదేసి తగలేస్తారా?” అని. అదొగో అదేఇది. అలాగే మరోమాట ”నీకు నల్లమేకపోతును బలేస్తారురా” అనీ తిడతారు,కోపంలో అది కూడా ఇందునుంచి వచ్చినదేనని నా ఊహ. యజ్ఞం చేసిన ఒకరు కాలం చేస్తే, ఈ ప్రక్రియకి కొంత సాయం చేశా, అందుకు ఇదంతా గుర్తొచ్చింది. ఇలా రావణకాష్ఠం మామూలుకు అనేక రెట్లు పెరిగిపోయి, చాలా ఎక్కువ సేపు తగలబడిందన మాట. ఇలా ఎక్కువ సేపు ఉండిపోయే తగవును రావణ కాష్ఠంతో పోలుస్తారు.
4 THOUGHTS ON “శర్మ కాలక్షేపంకబుర్లు-రావణ కాష్ఠం”
స్పందించండి
రావణకాష్ఠం అంటే..
చితిపై సుగంధ చందన కట్టెలు, పద్మకములు, వట్టివేళ్లు పేర్చి, దానిపై జింకచర్మం పరిచి రావణుడి పార్థివదేహాన్నుంచారు.
పెరుగు, నెయ్యి కలిపిన పాత్ర పెట్టారు. సోమలతను తెచ్చిన బండిని కాళ్ల వైపు, తొడల మధ్య సోమలతను దంచిన కర్రరోలు ఉంచారు. ఇక అరణులు, చెక్క పాత్రలు, రోకలి తదితర యజ్ఞ సంబంధ వస్తువులను సముచిత ప్రదేశాల్లో ఉంచి మంత్రపూరితంగా మేకను బలి ఇచ్చారు. ఆపైన నేతితో తడిపిన దర్భలుంచారు. శరీరంపై పుష్ప మాలలు, వస్త్రాలుంచిన తర్వాత విభీషణుడు చితికి నిప్పు అంటించాడు. ఇవన్నీ ఎందుకంటే.. రావణుడు బ్రహ్మ మనవడు, అనేక యజ్ఞాలు చేసినవాడు.
సోమలత తేవడానికి కొత్తబండిని, దాన్ని దంచడానికి రోళ్లు తయారుచేస్తారు. నేతిని అగ్నిలో ఆహుతి చేసేందుకు సృక్కులు, సృవాలు ఉంటాయి. అగ్నిని మథించే అరణులుంటాయి. ఇలా యజ్ఞానికి వలసినవన్నీ కర్ర రూపంలో ఉండేవే. ఒకసారి వాడినవి మరో యజ్ఞానికి వాడకూడదు. యజ్ఞం చేసినవారు, గతంలో ఉపయోగించిన సామగ్రినంతా భద్రపరచాలి. అలా దాచినవన్నీ మరణానంతరం పార్థివ శరీరంతోపాటు కాష్ఠం మీద వేసి తగలేస్తారు. అందుకే రావణుడి యజ్ఞ సామాగ్రి అంతా చితి మీద పేర్చారు.
నిత్యకర్మలో ఉపయోగించివాటినీ అంతే. ఎవరైనా వస్తువులను దాచుకుంటే 'వాటిని నీ మీదేసి తగలేస్తారా?' అని, కోపమొస్తే 'నీకు నల్ల మేకపోతును బలిస్తారా?' తరహాలో పరుషంగా అనడం తెలిసిందే.
కేవలం కట్టెలు కాకుండా అన్నన్ని వస్తువులున్నందున రావణకాష్ఠం చాలా ఎక్కువ కాలం తగలబడింది. అందుకే ఎంతకూ తెగని తగవులను, దీర్ఘకాలం సాగే కోర్టుకేసులను రావణకాష్ఠంతో పోలుస్తారు.
బౌద్ధ,జైన,ప్రభావాల వలన అహింసను అవలంబించారు కాని,పూర్వకాలంలో
యజ్ఞాలలోను,ఇతర సందర్భాలలోను జంతువధ,మాంసాహారము బ్రాహ్మణులతోసహాహిందువులందరూ
చేసేవారని పురాణాల ద్వారా తెలుస్తున్నది.
2016-12-26 5:33 GMT+05:30 కష్టేఫలే :
> kastephale posted: “రావణకాష్ఠం రావణ కాష్ఠం అంటారు కదా దీని సంగతేంటో
> చూడాలని రామాయణం తిరగేశా. అందులో వాల్మీకి ఇలా చెప్పేరు. శ్లోకాలు
> పెట్టాలనుకున్నాగాని, టైప్ చెయ్యలేక మానేశాను, అర్ధం మాత్రమే రాస్తున్నా!
> ”రావణ కాష్ఠానికి గాను చందనపు కఱ్ఱలు, పద్మకములు, పేర్చారు, వట్టివేళ్”
>
రమణా రావు ముద్దుగారు,
చరిత్ర చెబుతున్నమాటదే!
ఈ సందర్భంలో వాల్మీకి, మేకను బలిచ్చారన్నారు వాల్మీకి, అంతే.
ధన్యవాదాలు.
మధ్యలో మేకపోతేం చేసింది పాపం? రాచపీనుగ సామెత లాగా !
విన్నకోట నరసింహారావుగారు,
మేకను బలిచ్చారన్నారు వాల్మీకి.
ఇప్పటికిన్నీ మగళ,శుక్రవారాల్లో చనిపోతే పాడెకు ఒక కోడిని కట్టడం ఆచారం పల్లెలలో ఉంది. మాంసాహారులు కానివారు పిండి బొమ్మను చేసి శవంతో పాటు దహించడమూ ఉంది. ఈ ఆచారం కొనసాగుతూనే ఉందండి.
ధన్యవాదాలు.