కోక అంటే స్త్రీలు కట్టుకునే వస్త్రం చీర, అనే అర్ధం స్థిరపడిపోయింది నేడు, కాని స్త్రీ,పురుషులు ఎవరైనా నడుముకిందనుంచి కట్టుకునే వస్త్రాన్ని కోక అనడమే పాతకాలపు అలవాటు. "కుళ్ళాయుంచితి కోకచుట్టితి మహాకూర్పాసమున్ దొడ్వితిన్" ఇది శ్రీనాథుని మాట. స్త్రీలు, పురుషులు కోక కట్టేటప్పుడు ముందు వైపు కుచ్చెళ్ళు పెడతారు. అవి చాలా ఒత్తుగా ఉంటాయి, చాలా మడతలుంటాయి. ఒక కొంగు రెండుకాళ్ళ మధ్యనుంచి వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి వెనక దోపుతారు. దీన్నే కౘ్చ అంటారు, వాడుకలో గోచీ దోపడం అంటారు. ఒకప్పుడు ఎనిమిదిగజాల పంచలు,చీరలు ఉండేవి, అవి ఆ తరవాత ఆరుగజాలకు, ఆ తరవాత ఐదు గజాలకు కుంచించుకుపోయాయి. ఇక కచ్చ దోపడానికి వస్త్రమెక్కడ? కచ్చపోసి కోక కట్టిన ఆడదిగాని మగాడుగాని కనపట్టం లేదు. దీన్నే మడికట్టు అంటారు తమిళులు. ఈ కౘ్చలో నిప్పు పడితే, ఎక్కడ పడిందో వెతుకులాటకే ఎక్కువ సమయం పడుతుంది. నిలబడి దులుపుకున్నా, నిప్పురవ్వ ఆ మడతలలో నుంచి బయట పడ్టం తేలికకాదు.ఈ లోగా అది చేయాల్సిన నష్టం చేసేస్తుంది, అందుకు నష్టం తప్పదు. లేదా కోక, పంచ విప్పేసినా విప్పిన వాటిని కాల్చేస్తుంది, నిప్పు. అంచేత కచ్చలో నిప్పు కష్టం,నష్టం కలగజేస్తుంది.
కోళ్ళగంప
కచేరి అంటే కోర్టు. ఇందులో కాయితంపడటం అంటే, మనం ఎవరిమీదనో దావా చేయడం, లేదా మరొకరు మనమీద దావా చేయడమనమాట. కోర్టులో దావా నెగ్గినవాడు ఇంట్లోనూ, ఓడినవాడు వీధిలోనూ ఏడ్చారని నానుడి. నెగ్గినవాడెందుకు ఏడ్చాడు? నెగ్గినవాడు లాయర్లకి కోర్టు ఖర్చులకి, తిరుగుళ్ళకి, సాక్షులకి అయిన ఖర్చు తలుచుకు,ఇంటిలోనే ఏడ్చాడు. ఓడిన వాడు వీటన్నిటితో కేసూ పోయిందని భోరున కోర్టులోనే ఏడ్చాడు. అందుకే కచేరిలో కాయితం పడితే నష్టమనమాట స్థిరపడిపోయింది.
No comments:
Post a Comment