కరోనా కాలం-కష్ట కాలం.
కితం సంవత్సరం ఫిబ్రవరిలో మొదలైన కరోనాతో కాలు బయట పెట్టేది లేక లాక్ డవున్ లో లాకప్ లో ఉండిపోయాం. అప్పటినుంచి ఇల్లు వదిలిందే లేదు. బయటికొస్తే చంపుతానంటోంది కరోనా, లోపలుంటే మా మాటేంటీ అని నస పెడుతున్నాయి ఆస్థాన విద్వాంసులు,సుగరు,బి.పి లు.. కొన్నాళ్ళు జోకొట్టినా తరవాత కాలంలో డాక్టర్ ని కలవక తప్పటం లేదు. అక్కడా గుంపులే ఎవరి బాధ వారిది,తప్పదు కదా! టెస్టుకి వెళ్ళిన ప్రతిసారి భయం,బ్లడ్ తీసేవాడినుంచే సోకుతుందేమోనని భయం. భయమే చంపేస్తుందేమో చెప్పలేనిది.
ఎంత నిబ్బరంగా ఉందామన్నా పరిస్థితులు చూస్తుంతే నీరుగారిపోతున్నాం.ఇక మేధావుల మాటలకి అంతే లేదు. మూడో పొర వస్తుంది పిల్లలని చంపుతుంది...ఇది జాగరత చెప్పినట్టు లేదు, భయపెడుతున్నట్టే ఉంది..ఇక మందులు జాగరతలు చెప్పే వారికి అంతులేదు, పాపం వీరంతా మందికి మంచి జరగాలని చెప్పేదే! ఆనందయ్య మందు ఎక్కడికక్కడ తయారు చేసి పంచిన వారున్నారు.కరోనాకి చిక్కి బయటపడిన వారు సర్వం దానం చేసినవారున్నారు, ప్రాణావసరమైన మందులు ఇతరాలు దాచి విపరీత ధరలకి అమ్ముకున్నవారున్నారు.కరోనా ఎదురింటికి వచ్చి ఆగింది.
ఇక ఎండ కష్టాలు చెప్పేదేంటి, పాత పాటే కదా! వద్దనుకుంటూనే ఏ.సిలో వాసం,ప్రతి నిమిషం భయం, కరోనా ఎదురింటి దాకా రావడంతో.....ఆగిపోయింది మా జీవన స్రవంతి, గేటు తాళం తీసి బయట కాలు పెట్టలేదెవరమూ...ఇక నెట్ లోకి కూడా రాలేదు కీ బోర్డ్ చెడిపోడంతో.
ఏప్రిల్ మే, జూన్ నెలల్లో చాలా మంది మిత్రులు/అమ్మలు వాట్సాప్ లోనూ మైల్ లోనూ పలకరించి ధైర్యం చెప్పినందుకు ధన్యవాదాలు,నమస్కారం. నా ఫొన్ నంబర్ దొరక్క వెతికి వెతికి అబ్బాయితో మాటాడి నా కుశలం కనుక్కున్న ప్రియ శత్రువుకి నమస్కారం.టపా రాదామనుకుంటే కీ బోర్డ్ చెడిపోయింది. బ్లాగు మొదలెట్టిన తరవాత మార్చిన ఆరో కీ బోర్డిది.
ఏప్రిల్ నెల తరవాత కరంటు రీడింగ్ తీయలేదు. అసలే వేసవి, మా దగ్గరైతే వేడి 41 పై మాటె. ఎంతకాదనుకున్నా ఏ.సి తప్పలేదు.. మొన్న రెండు నెలల బిల్లూ ఒక సారి చేతిలో పెట్టేటప్పటికి కళ్ళు తిరిగాయి.
వాడుకున్నదే కాని ఒక్కాసారిగా కట్టాలంటేనే బాధ.బంగారు పళ్ళేనికి కూడా గోడ చేరుపు కావాలి కదా! డబ్బులకోసం అప్పుకెళ్ళేలా కూడా లేదు, ధాన్యం అమ్మి నెలపైగా ఐనా ప్రభుత్వం నుంచి సొమ్ములూ రాలేదు.కరంటు బిల్లు కట్టడం ఆలస్యమయ్యేలా ఉంది..
జూన్ పదేనుకి కూడా ఇంకా కాలవ రాలేదన్నాడు అబ్బాయి.నిన్ననొచ్చిందని చెప్పేడు, ఇక హడావుడి, పెట్టుబడికి సొమ్ములు అవసరం...కరోనా ఉండగా ఇది మూడో పంట పూర్తిగా మాసూలు కావడం. నాలుగో పంట వేయబోతాం. కరోనా మొదలయ్యేనాటికి కూలిపనికి ఐదొందలు. ఆ తరవాతది నెమ్మదిగా పైకి పాకి ఇప్పుడు రోజుకి వెయ్యికి చేరుకుంది.పంట దిగుబడి పెరగలేదు, పెట్టుబడిలు పెరిగిపోయాయి.వ్యవసాయం లో మిగిలినది ఏమీ లేకపోయినా గింజలు పండించి ఇచ్చామనే తృప్తి మిగిలింది. ఏమీ మిగలకపోతే ఎందుకు వ్యవసాయం చేయడం అడగచ్చు, ఇదొక వ్యసనం, మరే పనీ చేతకాదు, మరొకరికి తిండికి గింజలిచ్చిన తృప్తే మాకు మిగిలుతోంది.
కరోనా తో కలిగినవారికి బాధ లేదు, లేనివారికీ బాధ లేదు, మధ్య తరగతి వారే మాడిపోతున్నారు. కొంతమంది రోజు కూలికి వెళుతున్నారు. అలవాటు లేని పని కావడంతో బాధ పడుతున్నారు. ఇందులో ముఖ్యంగా ప్రయివేటు స్కూళ్ళ టీచర్లున్నారు.కరోనా టికాలు జోరుగా వేస్తున్నారు, పల్లెలలో వెతికి మరీ వేస్తున్నారు.
బడికెళ్ళే పిల్లల స్థితి అధ్వాన్నంగా ఉంది. శారీరకంగా పోల్చుకోలేనంతగ మారిపోయారు, బయటికి వెళ్ళినది లేదు, ఆట లేదు పాట లేదు ఆన్ లైన్ చదువు నడుస్తోందంతే. బడులు తీస్తామంటారొకపక్క,కరోనా మూడో పొర పిల్లల పాలిట గండమంటారు మరో మేధావి, పిల్లల ని మానసికంగా హింసించేస్తున్నారు. బడులు తీసినా పిల్లలు వెళ్ళేందుకు భయపడుతున్నారు, తల్లితండ్రులూ బడికి పంపేందుకు భయపడుతున్నారు, పిల్లలు బతికుంటే అంతే చాలనుకుంటున్నారు. ఆడపిల్లలు మగపిల్లలకి పెళ్ళిల్లు వెనకబడిపోయాయి.
జమానా జమానా అంత కూల బడి పోయింది శర్మాచార్య. స్థితిగతులు, పరిస్థితులు, పర్యావసానాలు అన్ని తలకిందులు. ఈ రాబోయే కోవిడ్ డెల్టా ప్లస్ ఐతే కొందరంటున్నారు టీకాలకు సైతం లొంగదని.. కొందరు పిల్లలపై ప్రభావం బలంగానే ఉంటుందని. మాస్కులు, శానిటైజర్లు వాడుతు సామాజికంగా భౌతిక దూరం పాటిస్తు, పౌష్టికాహారం సేవిస్తున్నవారు త్వరిత గతిన కోలుకుంటున్నారు. ఒకసారి వచ్చి వెళ్ళిందిలే మరల రాదు, పైగా టీకాలు పడ్డాయిలే ఇహ మాములుగానే తిరిగెద్దామనే భ్రమలో ఇంకొంత ఎక్కువే వ్యాప్తి చెందిస్తున్నారు సగటు జనవాహిని.. చూడాలి.. ముందు ముందు ఎన్ని అవంతరాలొస్తాయో.. వాటిని ఎలా అధిగమించాలో.. మనోధైర్యం కోల్పోకుండ ఎవరికి వారే వారి వారి ఆరోగ్యాలకు శ్రీరామ రక్ష..!
ReplyDeleteశ్రీధరా!
Deleteకరోనా నాకురాదు, నా బాది ఉక్కు అనుకున్నవారే తుక్కు తుక్కయ్యారు. వచ్చినా నన్నె ం చేయలేదనుకోడం వెర్రితనం. రాకుండా జాగర్త్తలే ముఇఖ్యం, విధి వక్రించి వస్తే తీసుకోగల జాగ్రత్తలు వైద్యం తప్పనిసరి, లేకపోతే టిక్కట్టు చింపెయ్యడం ఖాయం.మరో సారి మరోసారి అనుకోవడం తప్పు లేదు.
మన సమాజమే కాదు మొత్తం ప్రపంచమే తల్లకిందులైపోయింది, జాగరత్తలు తీసుకోకపోతే మరోసారి, మరోసారి వస్తూనే ఉంటుంది.
ఎవరి గోల వారిదే !
తస్మాత్ జాగ్రత! జాగ్రత!!
భగభగ మండే వేసవిలో సైతం గీజర్ పెట్టుకుని వేడినీటితో స్నానం చేసేవారు
Deleteచిటపట చినుకులతో పుడమి పురివిప్పే వర్షాకాలం లోను చలి చివుక్కూల శీతాకాలంలో సైతం ఏయిర్ కండీషనర్ పెట్టుకునే వారు ఎవరంటే తేరగా డబ్బుంటే విచ్చలవిడిగా ఖర్చు చేసేవారు నా భార్య కోవకు చెందిన వారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే అవి ఆమే నాన్న గారి కష్టార్జితం తో సమకూర్చుకున్నవి కాదు.. పవర్ బిల్లు మాత్రం నా అకౌంట్. ప్చ్..
Deleteశ్రీధరా!
సంపాదించేది అనుభవానికే కదు సార్. వేసవిలో కూడా వేడి నీళ్ళు పోసుకుంటా తప్పదు మరి.వాడుకుంటే బిల్లు కట్టాలి కదు సార్!
భర్త అంటేనే. భరించేవాడు, నాయనా శ్రీధరా 😁.
Deleteనమస్తే మాష్టారూ. కాస్త సంతోషంగా వుందండీ యిలా పలకరించుకోవడం. మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు ... ఎలా పదిహేను నెలల కాలం గడిచిపోయిందో... బ్లాగు లోకానికి రావాలనుకుంటూనే రాలేక మనలేక.. ఇప్పటికి యిలా పలకరింపు.
ReplyDeleteవనజగారు,
Deleteనమస్తే!
గత పదేను నెలలుగా జరిగినది పీడకలగా మరచిపోదాం, తప్పదు. జీవితం లో చాలా కష్టాలు ఎదుర్కొన్నాం, ఇది మరొకటి, మానవాళి మనుగడకే ముప్పైన కష్టం ఎదుర్కోక తప్పదు.ఈ కష్టం పూర్తిగా గట్టేక్కినట్టు లేదు, సుడిగుండంలోనే ఉన్నాం, మునక తప్పించుకోడానికి జాగ్రత తీసుకుంటూ జీవించాలి.
ఈ కష్టకాలంలో ఓదార్పు, పలకరింపు ధైర్యాన్నిస్తాయి కదండి.