కరోన గురించి వార్తల కి కొదవ లేదు. ఒక దానికొకదానికి పొంతనా లేదు. చివరికి హు వారు శలవిచ్చిన మాట. కరోన ప్రభావం అందరి మీద ఒకలా ఉండదు, అది ఎవరి తత్త్వాన్ని బట్టి వారి మీద ప్రభావం చూపుతుందీ, అని. Is it to say ''survival of the fittest?'' అంటే ఎవరి కర్మ వారిదే అని చెప్పకనే చెప్పినట్టుంది.ఎవరిని కదిలించినా జగ్రత్తలు తీసుకోండి అన్నమాటే!
ఉదయం పాలపేకట్లు నీళ్ళల్లో వేయించి, కడుక్కుని తీసుకుని సబ్బు అరిగేలా తోముకుని స్నానం చేస్తున్నాం. కూరగాయలొస్తే ఉప్పునీళ్ళలో తోమి ఎండబెట్టుకుని తీసుకుంటున్నాం. కిరాణా వగైరా ఏ సరుకైనా, ఏండలో ఎండబెట్టుకునే ముట్టుకుంటూవున్నాం. బయటికి అడుగెడితే మూ.ము గుడ్డ కట్టుకుంటున్నాం. కర్మంజాలక బయటికెళితే దూరదూరంగా ఉంటున్నాం,మనుషుల్ని చూసి భయపడుతున్నాం. ఇంటికొచ్చి బట్టలు మిషన్లో వేసి వేడి నీళ్ళుతో సబ్బు అరగతోమి స్నానం చేసి లోపలికొస్తున్నాం. ఎక్కడికీ వెళటం లేదు, ఎవరిని ఇంటికి రానివ్వటం లేదు. గేటు తాళమేసే ఉంటోంది, అవసరపడితే కాని తియ్యటమే లేదు. నడక పెరటిలోనే,సూర్యుణ్ణి మాత్రం చూస్తున్నాం. ఈ సూర్యుణ్ణి కూడా చూడలేని జీవాలెన్నో!
మగవాళ్ళకిదో కర్మ, నెలకొకసారైనా శిరోముండనం తప్పదు కదా! సెలూన్ కెళితే భయం, అక్కడో గుంపు. అందుకు ఇంటికే రప్పించుకున్నవాడిని డెట్టాల్ వగైరాలతో క్లీన్ చేసి అప్పుడు తలప్పజెపితే, ఏమో అదృష్టం ఎలా ఉందో, ఎవరు చెప్పగలరు?
నాకేంటి ఉక్కు ఉక్కు అన్నవాళ్ళు తుక్కు తుక్కు ఐపోతున్నారు.చిత్రం,మాయ, పెనుమాయ..నేనెవరో తెలుసా! మాకేంటి, డబ్బు,హోదా, డాక్టర్లు, అని అనుకున్న ఇంటినుంచి ఆరుగురు గాయబ్, పదిరోజుల్లో. నిన్నటిదాకా సందడి సందడిగా ఉన్న ఇల్లు ఈ వేళ నిశ్శబ్దం.పెద్దాళ్ళు, కలిగినవాళ్ళు,పిట్టల్లా రాలిపోతున్నారు, మాకేంటన్నవాళ్ళు మాటలేకపోతున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం కారణమంటే నమ్మలేకున్నారు. ఈ రోగనిరోధక శక్తి ఒక రోజులో రాదంటే కూడా నమ్మలేకున్నారు. అన్నీ మందులతోనే జరిగిపోతాయనే భ్రమలో ఉన్నారు.కొంతమంది భయంతో జారిపోతున్నారు, కొంతమంది నాకేంభయంలేదని మొరాయించి తిరిగి కరోనాలో చిక్కుకుని జారిపోతున్నారు. కొంతమంది కరోనాకి చిక్కి హాస్పిటల్ లో అల్లాడుతున్నారు, వీరి స్థితి మరీ ఘోరం.
ఇదింతేనయ్యా! మందులేదు, వేక్సిన్ రాదు. యోగముంటే బతకడం లేకపోతే చావడం అన్నవారొక మేధావి. మరొక మేధావి ఇదంతా ఉత్తిదే, పెట్టుబడిదారీ దేశాలాడుతున్న నాటకం. మిమ్మల్ని అందరిని పిచ్చాళ్ళని చేసి భయపెట్టి చంపుతున్నారన్నారు. పేరా సిటమాల్,చిన్న మందులు చాలయ్యా!కరోనా ఏం చెయ్యలేదు.ఏది నిజం? పరమాత్మా!హు వారు, ఇంతకంటే పెద్ద పెద్ద వ్యాధులకి మానవజాతి సిద్ధంగా ఉండాలని శలవిస్తున్నారు.
ఆరు నెలల నుంచి ఇంట్లో ఉంటూనే ఉన్నాం బయటికి కదల లేదు. ఇదెంత కాలం? తెలీటం లేదు. ఎక్కడో ఒక చోటికి కదలాలిగా తప్పదు.ఆరు నెలల కితం ఉన్న పాత రోగాలకైనా వైద్యం చేయించుకోవాలిగా!ఎంత మందులేసుకున్నా అవీ పెరుగుతాయిగాని తగ్గవు.
ఎక్కడ చూసినా గుంపులే, ఒక్క మందుకొట్టు దగ్గర మాత్రం క్యూ ఉంది. మందు తాగిన వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. :) రోజూ క్యూలో వాళ్ళే కనపడుతున్నారట. గుంపు మనస్తత్త్వం, బానిస మనస్తత్వం, మన నరనరానా జీర్ణించుకుపోయిందనుకుంటా. పోదనుకుంటా. క్యూ లో నిలబడ్డం అంటే మనకి చిన్నతనం, ఎవరో ఒకరు అదుపుచేస్తే క్యూలో నిలబడతాం.ఒకరికి ఒకరు తగలకుండా అసలు నిలబడలేం, తోసుకోకుండా ఉండలేం. డాక్టర్ని కలవడం తప్పించుకుంటున్నాం. వీడియో లో కలుస్తాం,సరే. మరి టెస్టులు తప్పవు కదా! అక్కడా గుంపులే.టెస్టులకి పల్లెలలో మరీ చిరాకు. చెప్పుకుంటే అదో కత.వెనక నుయ్యి ముందు గొయ్యిలా వుంది రోజు, అలాగే ఉంది బతుకు.మన గొయ్యి మనమే తీసుకుంటున్నాం, అది చెప్పినా వినేలా లేరు, జనం
భారతంలో ఇటువంటిదే ఒక కత చిన్నదే వినండి.
పరిక్షిత్తు రాజ్యం చేస్తున్నాడు. వేటకి వెళ్ళేడు. దాహమేసింది. పరిశీలిస్తే ఒక ముని ధ్యానం లో కనపడ్డాడు. దగ్గరకెళ్ళి మంచినీళ్ళడిగాడు. మునిలో చలనం లేదు. రాజుకి కోపమొచ్చి అశక్త దుర్జనత్వంతో పక్కనే చచ్చి పడి ఉన్న పామును ఆ ముని మెడలో వేసి వెళ్ళేడు. ముని కొడుకొచ్చి చూసి, విషయం తెలుసుకుని, కోపించి శపించాడు, ఈ పని చేసినవాడు తక్షకుని కాటుతో మరణిస్తాడని. ముని ధ్యానం నుంచి బయటికొచ్చి విషయం తెలుసుకుని కొడుకును మందలించి విషయం రాజుకు శిష్యుల ద్వారా చేరవేసేడు.రాజు రక్షణ కోసం ఒంటి స్థంభం మేడలోకి చేరిపోయాడు. చీమ దోమ కూడా లోపలికి రాలేని కట్టుదిట్టం చేసుకున్నాడు.తక్షకుడు బయలుదేరేడు,కాటుకి. భద్రత చూస్తే అబ్బో భయమేసింది, చీమ కూడా లోపలికిపోలేదు, మరి దోమ ఎగిరి కూడాలోపలికి పోలేదు.లోపలికి చేరడం ఎలాగబ్బా,ఆలోచించాడు. ''ఏ పాటు తప్పినా సాపాటు తప్పదని'' సామెత కదా! రాజుకోసం వెళ్ళే సాపాటుతో లోపలికి చేరలేమా అని ఆలోచించాడు. అబ్బే మెతుకు మెతుకు పట్టి చూసి మరీ పంపుతున్నారు లోపలికి. పళ్ళు కూడా వెడుతునాయి, లోపలికి. చూశాడు, నెమ్మదిగా చిన్న పురుగుగా ఒక పండులో ప్రవేశించాడు. పైకి చూడడానికి పండు బాగానే ఉంది, పరిక్ష చేసి లోపలికి పంపేరు. లోపలికి చేరిపోయాడు తక్షకుడు,చేరలేననుకున్న ఒంటి స్థంభం మేడలో రాజు దగ్గరికి. రాజు పండు కోశాడు, తక్షకుడు బయటి కొచ్చాడు, క్షణాల్లో పెరిగాడు, రాజు అరిచేలోపు కాటేశాడు, పనైపోయింది. అంతే!
శ్రీమద్రమారమణగోవిందో హరి
రాజు తప్పించుకోగలిగాడా? మనమెంత?కొంత కాలం తప్పించుకోగలమేమో! అంతే.
కొసమాట:-కరోన చాలా మందినే చేరుతోందిగాని మరణాలు తక్కువేననిపిస్తూ ఉంది.ఆశాజీవులం.