Thursday, 3 July 2025

మగాడు

 మగాడు

తాతా! ఒంటరిగా అడవిలోకి పోతున్నా అందో మనవరాలు ఓ రోజు పొద్దుటే ఛాట్ లో.

ఏమైందబ్బా అని సోచాయించి,బంగారం ఒంటరిగా అడవిలోకి పోకు(జనారణ్యం లోకైనా) పెద్దపులులెత్తుకుపోతాయి. బంగారాన్ని పులెత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకోనా! ఓ పని చెయ్యి. ఎక్కడిదక్కడ వదిలేసి నా దగ్గరకొచ్చెయ్యి. నీకు కోపమనిపిస్తేతిట్టు,నాకు వినపడదుగా బాధలేదు(పిచ్చి నవ్వు నవ్వుతూ ఉంటా) కొట్టాలనిపిస్తే కొట్టు పంచ్ బేగ్ లా,అనేసాను.   


ఎవరి మీద కోపమొచ్చి ఉంటుందబ్బా! అని ఆలోచిస్తే,ముత్యం లాటి మొగుడు,చెప్పినమాట వింటాడు. రత్నంలాటి కొడుకు చదువుకుంటున్నాడు. రేపో,నేడో రెక్కలు కట్టుకుని ఎగిరిపోడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంక మావ కాపరానికి వెళ్ళకముందే కాటికిపోయాడు. అత్త ఎక్కడో దూరాన ఉంది. తెలుసుకుందామని ఎవరి మీదా కోపం అడిగేసా. 


ఎంజాయ్ చేసే వయసులో పని,పని అని విసుక్కుంది. ఆ! బిజీగానే ఉండు,ఖాళీగా కూచోకు,అంటే జీవితం ఎంజాయ్ చెయ్యకుండా పనులు తగిలించుకున్నదెవరు? నువ్వు కాదా! తగ్గించుకో!! ఎంజాయ్ చెయ్యి, వచ్చెయ్యి,వచ్చెయ్యి అన్నా. వస్తా! మా ఆయనతో చెప్పి, అని కట్ చేసింది.

-------------

కట్ చేస్తే 

పడిపోయాను అని ఏడుస్తూ అమ్మకి చెబితే ఆడపిల్లలా ఏడుపేంట్రా మగాడివికాదూ! అంది.

సూతోవాచా ! 

పరిక్ష పోయింది నాన్నా అంటే నాలుగుతికేడు, ఏడుస్తుంటే, ఎందుకాఏడుపు ఆడదానిలా అని మరో రెండు ఉతికాడు. 

మాస్టారు తిట్టారు,ఆఫీసర్ తిట్టాడు అని కొలీగ్ కి చెప్పుకుంటే ఏడవకు మగాళ్ళం కదూ అనేసాడు.

దేనికి ఏడుపొచ్చినా ఏడవకూడదనీ,అది ఆడవారి స్వామ్యం అనీ, చిన్నప్పటినుంచి  ఎగో పెంచిపోషించేసేరు. పెళ్ళాం తిట్టినా,కొట్టినా ఏడవలేదు. పనెక్కువైనా,ఆరోగ్యం బాగోకపోయినా,కొడుకు కోడలూ వినకపోయినా,మనవలు,మనవరాళ్ళూ తిట్టుకున్నా ఏడవలేడు. మగాడు కదూ! కుటుంబం కోసం గాడిదలా  చాకిరీ చెయ్యడం,ఎద్దులా సంపాదించడమే గాని మనసారా,కరువుతీరా ఏడవనుకూడా ఏడవలేడుగా! అదీ మగాడు.

No comments:

Post a Comment