కల
ఆహారము,నిద్ర,భయము,మైథునము సర్వజీవులకు సమానం. మూడు అవస్థలన్నారు. అవి జాగృతి,స్వప్న,సుషుప్తి, (మెలకువ,కల,నిద్ర). మెలకువ,నిద్ర కానిదే కల. కల అనేది మానవులకే పరిమితం అనుకుంటా. కలలో మనసు మెలకువగా ఉంటుంది,లయం కాదు.
కునుకుపడితె మనసు కాస్త కుదుట పడతది
కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది
అన్నారో సినీకవి.
నిద్రలేనిది కలలేదు. కలను మనసే సృష్టించుకుంటుంది. సాధ్యాసాధ్యాలు,స్థలకాలాలు,సమయం లేనిది కల. తనకు కావలసినవన్నీ సమకూర్చుకుంటుంది. వాటిని అనుభవిస్తుంది. ఏడుస్తుంది, నవ్వుతుంది, ఏమైనా చేస్తుంది. మెలకువ వచ్చాకా ఓ! ఇది కలా అని విస్తుపోతూ ఉంటుంది.
కలలోనే ఒక కలగా
ఆ కలలోనే మెలుకువగా
కలయో నిజమో వైష్ణవ మాయో
తెలిసి తెలియని అయోమయంలో
నీవేనా నను తలచినది,నీవేనా నను పిలచినది
అంటారో సినీకవి మరో చోట.
కల దానిలో నిద్ర,ఆ నిద్రలో కల,కలనుంచి మెలకువ ఇలా చిక్కులు బడిపోతూ ఉన్న మనసు, ఏది నిజం,ఏది కల తెలియని అయోమయమే వైష్ణవమాయ...
ఇటువంటి అయోమయ స్థితి లో పడిపోయినది యశోద
కలయో! వైష్ణవమాయమో ఇతర సంకల్పార్ధమో సత్యమో ......ఇలా అయోమయస్థితిలో పడింది, కన్నయ్య నోటిలో భువనభాండమ్ములు జూచి.
వైష్ణవమాయలో చిక్కుకోకు, మనసును చెదరగొట్ట బడనివ్వకు.
ఓం! భద్రం నో అపివాతయ మనః
ఇది మన్యుసూక్తంలో చెప్పబడ్డ మొదటి మంత్రం.
మనసుకు మనసే శత్రువు. .