Wednesday, 16 October 2024

కొత్తకారు,కొత్తపెళ్ళాం 😁

 కొత్తకారు,కొత్తపెళ్ళాం😁


"కొత్తకారు,కొత్తపెళ్ళాం కొత్తలో ఇబ్బంది పెడతాయి తమ్ముడూ! నెట్టు,నెట్టూ" అన్నాడు మా ఎన్టీవోడు, గుండమ్మకతలోనేమో!!.


కొత్తకారా! బలేటోరే!! జీవితంలో కారెక్కిందే ఏ రెండు మూడు సార్లో,"సేవలందుటెకాని సేవించుటెరుగని" జీవితం కాదు, "సేవించుటేగాని సేవలందుటెరుగని" జీవితం, ఇలా కానిద్దురూ! ఆముచ్చటెందుకులేండి,ఇప్పుడు. 


కొత్తపెళ్ళాం ముచ్చటా! అప్పడాలూ లేదు, వడియాలూ లేదు. అప్పడాలు ఏభైయారేళ్ళు నేనుగనక నీతో కాపరంజేసేను, మరొకతైతే మూడో నిద్దరరోజే,  నెత్తిన చేటగొట్టి

  వదిలేసి పోయేదనుకుందో  ఏమోగాని,ఆరేళ్ళకితం దేవుడిదగ్గరకెళ్ళిపోయింది.  వడియాలా బలే! బలే!! ఒకప్పుడు సైన్యంలో పనిచేసేవారికి పిల్లనిచ్చేవారు కాదు. ఆతరవాతది పూజారులకూ, పురోహితలకూ పాకింది, నేడు టెకీలకీ పిల్లనిచ్చేవాడు కనపట్టం లేదు, నాకెక్కడబాబూ! ఐనా వడియాలుతో వేగే ఓపికలేదండోయ్! ఎవరూ కష్టపడి సంబంధం చూడద్దు సుమా!!!!


మరి ఈ ముచ్చట, ఇప్పుడెందుకనికదా కొచ్చను?

ఇరవైఏళ్ళకితం తప్పిపోతానని ఒక పంపురాయి జేబులో పడేసేరు, అలామొదలయింది,నాఫోన్ జీవితం. దాంతో ఒక ఐదేళ్ళు నడిపేను. ఓ రోజు పుట్టినరోజని మరో కొత్తఫోన్ చేతిలోపెట్టేరు, పదేళ్ళకితం, చిన్నబ్బాయి,కోడలు, దాంతో గడుస్తోంది కాలం. మొన్న విజయదశమి రోజు మరో కొత్తఫోన్ తెచ్చి పుట్టినరోజు బహుమతని, చిన్నకోడలూ,అబ్బాయి ఫోన్ చేతిలో పెట్టి పాతది తీసేసేరు,  ఇది స్లో ఐపోయింది, కొత్తదిబాగుంటుందని.   ఎప్పుడో మరచిపోయిన రెండో పుట్టినరోజును గుర్తుచేస్తూ!


  మూడునిద్దరలయినా కొత్తగానే ఉంది,కొత్తఫోన్ తో. సంసారంలో ఏదెక్కడందో కొత్తే,ప్రతిసారి వెతుక్కోడమే!  ప్రతిసారి పిల్లలని అడిగితే చిరాకు పడతారేమోనని భయం. ఏది నొక్కితే ఏమవుతుందోననీ భయమే! అంతేకాదు, ఇబ్బందుంటే పిల్లలకి చెబితే ఏమంటారో? మరో భయం. చెప్పింది గుర్తుండి చావటం లేదు, ఎలా? నాటిరోజులకి సెల్ ఫోన్ వాడుకలోకి రాలేదు గనక మా ఎన్టీవోడు దాన్ని చెప్పుండడు, లేకపోతే దీన్నీ చెప్పీవోడేనేమో. కొత్తఫోన్ కు అలవాటు పడ్డానికి సమయం పట్టుద్దా!లొంగుబాటుకొస్తదా? కొచ్చను? 


సెల్ తోనే వేగలేకుంటే డెస్క్ టాప్ మార్చేసేరు, విండోస్ ఎప్పటిదో ఉంది అంటూ, ఎలాబాబూ అలవాటు పడ్డం. ఇదీ కొచ్చనే? అంతా కొత్తబాబూ, కొత్త,కొత్త,కొత్త......... 

15 comments:

  1. కొత్త కొట్టు(డు) బావుంది :)


    ReplyDelete
    Replies
    1. Zilebi16 October 2024 at 14:54
      ధన్యవాదాలు

      Delete
  2. అంతా కొత్తేనండీ !
    యెంతైనా మనిషె పాత , యేతావాతా
    సంతోషమె కొత్తదనము ,
    చింతన ? పరమాత్మ దరికి చేరే దెపుడో ?!

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల16 October 2024 at 17:54
      మనిషిపాతే! పరమాత్ముని స్మరణా పాతదే! చిన్నచిన్నవి ఆనందాలనుకుని... :)

      Delete
  3. మీ కష్టాలు గొప్పగా ఉన్నాయండి 🙂. అయినా మీరు టెక్నాలజీ మేధావులు కదా, త్వరలోనే దాని మర్మం పట్టేస్తారు లెండి 👍.

    // “ నేడు టెకీలకీ పిల్లనిచ్చేవాడు కనపట్టం లేదు, ” // …… అదేవిటి అలా అంటున్నారు? పెళ్లిసంబంధం చూడబోతే మాకు సాఫ్ట్ వేర్ అబ్బాయే కావాలండీ అంటారుగా మూతి తిప్పుకుంటూ ?

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు16 October 2024 at 19:03
      అవునండీ! కాని చెప్పినవి కొత్తగా ఉన్నవి గుర్తుండటం లేదు,అదండీ బాధ.
      +++++++++++++++++++++
      టెకీలని చేసుకోడానికెవరూ ఇష్టపడటం లేదు. వాళ్ళకి లేప్ టాప్,బాసూ లేదా బాసిణి(శూర్పణక లాటిది. తనకి లేని సుఖం తనకంటే చిన్నోడికి తక్కుతోందా? పెళ్ళాంతో) అని హింసపెట్టేవాళ్ళే ఎక్కువట,బాసులో ఇంతేమాట. ఇంటిదగ్గరున్నా సతాయిస్తోనే ఉంటారట, ఇది టెకీలు చెప్పుకునేదే! వెళ్ళన పిల్ల డబ్బుతోనూ,మేడలతోనూ కాపరం చెయ్యాలి. ముద్దు,ముచ్చట ఉండదు. కాస్టింగ్ కౌచ్ అనేది ఈ రంగానికీ కొత్తకాదు. మరో కొత్తమాటా చెప్పుకుంటున్నారు వైఫ్ స్వాపింగ్ అందుకు తెలిసినవారెవరూ పిల్లనివ్వటంలేదు, అక్కడ బ్రహ్మచారిణులు కూడా పెళ్ళిళ్ళుకాక ముదురుబెండకాయలైపోతున్నారుట. వయసు 30 పెళ్ళిలేదు,35 పెళ్ళిలేదు,40 పెళ్ళిలేదు,ఆ తరవాత పెళ్ళి చేసుకుని ఉపయోగం లేదు.

      Delete
  4. // “ కొత్తకారు,కొత్తపెళ్ళాం ” //

    దీని మీద ఒక ఇంగ్లీషు జోక్ ఉందండి 🙂.
    పెళ్ళాం కారెక్కడానికి, కారు దిగడానికీ కారు తలుపు తీసి పట్టుకుంటే ….. కారు అయినా కొత్తది అయ్యుంటుంది, పెళ్ళాం అయినా కొత్తది అయ్యుంటుంది.
    🙂🙂

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు16 October 2024 at 19:06
      రెండూ కొత్తవైతే ఇంక వాడి బతుకు బస్టాండేనా! :)

      Delete
    2. అంతేగా అంతేగా 🙂.
      “బందరు బస్టాండ్” అని సినిమా వాళ్ళ పదప్రయోగం (మధ్యలో బందరేం చేసిందో అర్థం కావడం లేదు 😟. కోనసీమకు రాకముందు నేను చదువుకున్న ఊరు లెండి).

      Delete

    3. విన్నకోట నరసింహా రావు17 October 2024 at 10:30
      బతుకు బస్టాండు అనుకున్నా సార్! బతుకు బందరు బస్టాండా? సినీవారి ప్రయోగమా? :)

      Delete
    4. బతుకు బస్టాండు అన్నదే కొంత వరకు నయం సార్. సినిమా వాళ్ళ మాటలకు, డయలాగులకు అర్థం వెదకడం వృధా ప్రయాస.

      Delete
    5. బతుకు బస్టాండు, బందరు బస్టాండు అంటే అనునిత్యమూ బిజీ బిజీ కాని ఎందుకు బిజీ యో ఎవరికీ అర్థం కాదు‌ అన్న అర్థంలో ఆ పదం వాడేరండి

      Delete
    6. కాదనుకుంటాను “జిలేబి” గారు.
      బతుకు చిందర వందర అయిందనే అర్థంలో వాడతారనుకుంటాను. అందుకే దానికి బందరుకీ సంబంధం ఏమిటని పైన నేను అడిగినది. బహుశః rhyme కోసం బందరును తీసుకొచ్చారేమో సినీ జనాలు? .

      Delete
    7. ఈయన మీ బ్యాచా జూనియరాండీ ?

      https://te.quora.com/%E0%B0%A8%E0%B1%80-%E0%B0%AC%E0%B0%A4%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%AC%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B1%81-%E0%B0%AC%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE%E0%B0%82%E0%B0%A1%E0%B1%87

      Delete
    8. చూస్తుంటే జూనియర్ లాగానే ఉన్నాడు. కానీ తనెప్పుడూ బందరులో ఉండలేదు అంటున్నాడుగా, ఇక జూనియరా సీనియరా అనే ప్రశ్నే రాదు కదా.

      బందరు బస్టాండు, రోడ్ల గురించి వీరేమీ ప్రత్యేకం వేలు పెట్టి చూపించనక్కరలేదు. కోస్తా జిల్లాల్లో …. ఆ మాటకొస్తే మన దేశంలోనే …. దాదాపు అన్ని ఊళ్ళూ అలాగే అఘోరిస్తాయి నాలుగు చినుకులు పడగానే. చెప్పాగా బందరు పేరు తీసుకోవడం ప్రాస కోసం తిప్పలు అని.

      బందరు గురించి 1977 లో చెప్పాలా ఏమిటి? అంతకు శతాబ్దం ముందే 1864 లో ముంచెత్తిన “బందరు ఉప్పెన” గురించి తెలుసుకుంటే చాలు. బందరును divided AP రాష్ట్ర రాజధానిగా ఆలోచించక పోవడానికి ఉప్పెనల ప్రమాదం అధికం కాబట్టే అని కొందరంటారు.

      Delete