Wednesday, 29 May 2024

లోకులు పలుగాకులు.

 

    లోకులు పలుగాకులు.


లోకుల్ని కాకులతోనే ఎందుకు పోల్చేరు? 

కాకి కూత కఠోరంగానే ఉంటుంది. ఏమిటి లోకం? పలుగాకుల లోకం   న్నారో సినీ కవి.    

కాకుల్లో చాలా రకాలట, బొంతకాకులు,నల్లకాకులు,పిల్లకాకులు. మిరపకాయి తిన్న కాకిలా అరవకంటారు, ఇంకా ఐతే మిరపకాయ తిన్న పిల్ల కాకిలా అరవకంటారు. పిల్ల కాకి బాగా అరుస్తుందిట. ముసలికాకులూ బాగానే అరుస్తాయిట.  బొంతకాకులు మిగిలిన కాకుల్ని బెదిరిస్తూ ఉంటాయి. తెల్లకాకులు లేవన్నాడు బద్దెనగారు. ఇప్పుడంతా తెల్ల కాకులదే మహిమ. వారు చెప్పిందే వేదం.  మెతుకులు కనపడ్డ చోటనే కాకి చేరుతుంది, మరిన్ని కాకుల్ని పిలుస్తుంది, కూతతో.

కాకి కూసిందని మన పని మనం చేయడమూ మానకూడదు, కాకి కూత కోసం ఎదురూ చూడ కూడదు. ఈ పలుగాకుల్లో చాలా రకాలుంటాయి. కాకి కూతలు వినాలి. కాకులు కూస్తున్నాయని వాటిని తోలుకుంటూ కూచుంటే మన పని చేయలేం. కాకి కూతలు వినాలి, కాకి కూతల్ని ఆస్వాదించి, నవ్వుకోవాలి.  

హేటు కూసే  కాకి,  కూసి కూసి, కొంతకాలానికి, కాకి అలసిపోతుంది. కాకిని అలసిపోనివ్వ కూడదు.  మెతుకులేస్తూ ఉండాలి.  కాకితో సహజీవనం తప్పదు. మరీ మీద మీదకొచ్చే కాకుల్ని ఉపేక్షించ కూడదు. కాకి కూతలు మన పనికి అడ్డంకి కాదు, అడ్డంకి చేసుకోరాదు. ఇది మనచేతనే ఉంది. కాకులు మొత్తాన్ని తోలుకుంటూ కూచుంటే ఎలా? మన పని చేసుకుంటూ, కాకి కూతలు వింటూ, కాలక్షేపం చెయ్యాలి. కాకి కూతని కాలక్షేపం చేసుకోవాలి. మరో సంగతి మరచిపో కూడనిది, మెతుకులున్న చోటకే కాకి చేరుతుంది.  కాకి కూతలు విని మనం పయనిస్తున్న దిశ సవ్యంగా ఉందా? లేదా? అనేది నిర్ణయించుకో కూడదు.ఇది తెలిస్తే ఆచరిస్తే జీవితమే హాయి!!!! అంచేత కాకుల్ని తరిమేయకండి. కాకి కూతలు వినండి.రోజూ ఉదయమే కూసే కాకి కొన్ని రోజులు కనపడకపోతే, కాకి కూత వినపడకపోతే కాకి ఆరోగ్యం గురించి విచారించండి.కాకి జిందాబాద్!!!




అధో సూచిక:- ఎవరికైనా ఇబ్బంది కలిగితే మన్నించాలి. నేనూ కాకుల్లో ఒకడినే :)

Tuesday, 28 May 2024

కడుపుతో ఉన్నమ్మ

 కడుపుతో ఉన్నమ్మ


కడుపుతో ఉన్నమ్మ కనక మానదు.

ఒండుకున్నమ్మ తినక మానదు. 


ఇదొక నానుడి కడుపుతో ఉన్న ఆవిడ సమయానికి ప్రసవిస్తుంది. అలాగే వంట చేసుకోడమెందుకు? తినడానికే! దానికీ సమయం ఉంటుంది. అది ఆకలేసిన సమయం. అప్పుడే తింటుంది, వద్దన్నా మానదు. పల్లెటూరివాళ్ళు ఈ మాటని జరగవలసిన పని జరగవలసిన  సమయం లో జరిగి తీరుతుంది, వద్దంటే మానదని చెప్పడానికి చెబుతారు. ఒక్కొకపుడు సమయం నడుస్తున్నట్టే కనపడదు, ఒక్కొకప్పుడు సమయం పరిగెడుతున్నట్టే ఉంటుంది. మనం చెప్పినట్టూ, మనకి కావలసినట్టూ సమయం నడవదు. ఎన్నికలవుతున్నాయి. పూర్తైన తరవాత లెక్కింపూ,ఆపై ఫలితాల ప్రకటనా ఉంటుంది. మనం కంగారు పడినంతలో సమయం పరుగెడుతుందా? 


కుంచమంత కూతురుంటే మంచం మీదే కూడు.


   కూతురుంటే తల్లికి చేదోడని ఈ నానుడి భావం. కూతురు 

పెద్దదై తల్లికి తోడవుతుంది. కొడుకు పెద్దవాడై తండ్రికి శత్రువవుతాడు. ఇది లోకరీతి. 


చిన్న పామైనా పెద్ద కఱ్ఱతో కొట్టాలి

 

 విషమున్న పాము చిన్నదైనా వదలకూడదని భావం. అంటే సమస్య చిన్నదే కదా అని ఉపేక్ష చేయకూడదు. అగ్ని కణం చిన్నదే అని ఊరుకుంటే కొంపలు కాల్చేస్తుంది, అలాగే శత్రువు బలహీనపడైపోయాడనుకుని వదిలేయకు. ప్రయత్నం పెద్దది చేసైనా దండించాల్సిందే! మరో మాట పిల్లపాముకే విషమెక్కువుంటుంది, ముదిరిన పాముకి విషం తగ్గిపోతుంది, కక్కి,కక్కి ఉంటుందిగా! 

Sunday, 26 May 2024

ఆశ.

 ఆశ.


ఆశ మానవుణ్ణి నడిపిస్తుంది.

పేరాశ మానవుణ్ణి పరుగుపెట్టిస్తుంది. ఫలితం ఉండదు.

దురాశ మానవుణ్ణి పరుగుపెట్టించి బోల్తా పడేలా చేస్తుంది.

నిరాశ మానవులకి దూరంగానే ఉండాలి. ఇది కమ్ముకుందా మరిలేవడు.  పొరబాటుగా నిరాశలో చిక్కుకున్నా, పడిపోయినా అది క్షణికంకావాలి. పడిపోయినందుకు సిగ్గుపడ కూడదు. నిరాశనుంచి బయటపడాలి బంతిలా పైకి లేవాలి.



కందుకమువోలె సుజనుడు 

కిందంబడి మగుడ మింటి కెగసెడును జుమీ

మందుడు మృత్పిండము వలె 

కిందంబడి అణగియుండు కృపణత్వమునన్


543 స్థానాలున్న లోక్ సభలో అన్ని స్థానాలకూ పోటీ చేసి లేదా ( 272 ఆపై స్థానాలకు)  మెజారిటీ రాగల స్థానాలకు పోటీ చేసిన పార్టీ వాడు ప్రధాని అవుతానని చెప్పుకోడం, ఆశ. ఎందుకంటే నెగ్గిన తరవాత పార్టీ కూడా ఎన్నుకోవాలిగా:)


543 స్థానాల్లో మెజారిటీ స్థానాలుకి (272) కూడా పోటీ చేయలేని పార్టీ వాడు ప్రధాని అవుతానని చెప్పుకోడం పేరాశ. ఎందుకంటే,ఆ పార్టీ వారు, ఈ పార్టీవారు నన్ను ఎన్నుకుంటారనుకోడమే పేరాశ.


543 స్థానాల్లో పదిస్థానాలకీ పోటీ చేయలేని పార్టీవాడు ప్రధాని ఐపోతానని ఆశ పడటం చెప్పుకోవడం దురాశ.   

Saturday, 25 May 2024

అల్లో నేరేడు పళ్ళు

  అల్లో నేరేడు పళ్ళు

 నేరేడు పళ్ళు, జంబూ ఫలం, Jamun Fruit,Black berry 

 kg. 400/- 

నిరుడు kg 3౦౦/-

Friday, 24 May 2024

విష్ణుమాయ

 


(సామాన్యుడు వేంకటేశ్వరునికి విన్న వించుకుంటున్న తీరు. అన్నమాచార్యల వారి పెద్ద కుమారుడు పెద తిరుమలయ్య తన కీర్తనలో వెలిబుచ్చుతున్న విధం)  



ఎక్కడి మానుషజన్మం బెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం బికనూ


జీవులన్నిటిలోను మానవజన్మ గొప్పది,అది పొందేను..  మానవజన్మ ఎందుకు గొప్పది? జీవులన్నిటిలోనూ మానవునికే అన్నీ అధికం, ఈ జన్మనుంచి మాత్రమే జన్మరాహిత్యం పొందడానికి సావకాశం. మిగతా ఉపాధులలో జన్మరాహిత్యం పొందేందుకు తగిన కర్మలు చేసే సావకాశం లేదు. అటువంటి జన్మ ఎత్తినా ఫలితం కనపడటం లేదు. ఇక నిన్నే నమ్ముకున్నా! ఇది నిజం, అంటే నీవేదప్ప ఇతఃపరంబెరుగ మన్నింపన్ దగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద మన్నింపు భద్రాత్మకా! అని గజేంద్రుడు శరణాగతి చేసినట్టు చెబుతున్నా! ఇక నీ చిత్తం పాలముంచినా నీట ముంచినా నీవే దిక్కని వేడుకోలు.


మఱవను ఆహారంబును మఱవను సంసారసుఖము
మఱవను ఇంద్రియభోగము మాధవ నీ మాయా
మఱచెద  సుజ్ఞానంబును మఱచెద తత్వరహస్యము
మఱచెద నురువును దైవము మాధవ నీ మాయా


మూడు పూటలా కంచం దగ్గరకి చేరడం మరిచిపోను, రాత్రికి మంచం దగ్గరకి చేరడమూ మరచిపోను (స్త్రీ సుఖమూ మరువను)సరే! ఇంతతో సరిపెడతానా? మిగిలిన ఇంద్రియ సుఖంకోసము పరుగులు పెడతాను.( మంచి సినిమా చూసేస్తాను, దమ్మరో దమ్ సంగీత కచేరి! ముందుంటాను. మంచి అత్తరొచ్చిందిట ఇంకేం కొనేస్తాను, ఈ శరీరానికి రాసేస్తాను. ఇవేవి మరచిపోను.) మాధవా నీమాయ సుమా! మంచిమాట మరచిపోతాను. నిన్ను తెలుసుకునే రహస్యం చెప్పినది మరచిపోతాను. చిత్రం చూడు! గురువునూ మరచిపోతాను,నిన్నే మరచిపోతాను!!! ఏంటయ్యా ఈ మాయ?



విడువను బాపము పుణ్యము విడువను నా దుర్గుణములు
విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీ మాయా
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును
విడిచెద నాచారంబును విష్ణుడ నీ మాయా

పాపమంటాను, పుణ్యమనీ అంటాను కాని ఏదీ వదలిపెట్టను, పాపాలు చేస్తూనే ఉంటాను. నా దుర్గుణాలు వదలను,పేరాశ, దురాశ, అంటూ ఉంటాను కాని వదలిపెట్టను, దేనినీ. ఇదంతా నీ మాయ విష్ణుడా! షట్కర్మలు వదిలేస్తా ( ఏమిటవి? అధ్యయనం,అధ్యాపనం;యజనం,యాజనం; దానం,ప్రతిగ్రహం.(చదవడం,బోధించడం;యజ్ఞం చేయడం,చేయించడం; దానమివ్వడం,పుచ్చుకోవడం) నిన్ను చేరే చదువు వదిలేస్తా, ఆచారమా గాడిదగుడ్డేం కాదూ! వదిలేస్తా!  గుర్తే రాదు, ఇదే కదా విష్ణుమాయ. 


తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధమ్ముల
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై
నగి నగి నను నీ వేలితి నాకా యీ మాయా

అనవసర విషయాలో వేలు పెట్టేస్తా, అనవసర బంధాల్లో తగులుకుంటా!!! మోక్ష మార్గం సుంతైనా తలపుకు రానివ్వను. అంతర్యామివైన నువ్వు నవ్వుతుంటావు, నా ఏలికవై  నీవుండగా  నాకేల ఈ విష్ణుమాయ, వేంకటేశ్వరునిగా నవ్వుతూ దర్శనమీయరాదా.  



ఎక్కడి మానుషజన్మం బెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం బికనూ

అన్నమయ్యను స్మరించుకుంటూ...


ధన్యవాదాలు.:-మొన్న ఒక కామెంట్ రాస్తూ ఈ కీర్తన చరణం మొదటి పాదమే రాయగలిగా మిగిలినది గుర్తుకు రాలేదు. >>>> పెట్టి వదిలేసా! మిత్రులు విన్నకోటవారు ఈ కీర్తన పట్టుకుని నాకు పంపించారు. దానినిలా సద్వినియోగం చేసుకున్నాను. విన్నకోటవారికి మరొక సారి ధన్యవాదాలు.

Thursday, 23 May 2024

వీరంతా ఒకటేనా?

వీరంతా ఒకటేనా? 


 అడ్వొకేటు


లాయరు


ప్లీడరు


వకీలు

వీరంతా ఒకటేనా? ఐతే ఇన్నిపేర్లెందుకున్నాయి?

Wednesday, 22 May 2024

దిష్టిచుక్క.

 


దిష్టిచుక్క. 


అంతా ఆనందం కోసమే వెతుకుతారు. ఎక్కడుందీ?

మనిషికి ఐదు జ్ఞానేంద్రియలు,ఐదు కర్మేంద్రియాలు, మనసు, ఇదొక గుత్తి. దీనినే మనోమయకోశం అంటారు. సామాన్యులు ఈ గుత్తి దాటిపోలేరు. ఆనందం వెతుకుతూ ఉంటారు. ఎఖ్ఖడా కనపడదు. ఆనందో బ్రహ్మా అంటే ఆనందమే పరమాత్మ, అదే తురీయావస్థ.  మనోమయకోశం లో, మనసు అధికారి, ఇంద్రియాల ద్వారా అనందం పొదాలని చూస్తుంటాడు. కొందరు చూపుద్వార, కొందరు నోటిద్వారా,కొందరు చెవి ద్వారా, కొందరు నాలుక ద్వారా, మరికొందరు స్పర్శ, ఆలింగనం ద్వారా ఇంద్రియ సుఖం పొంది, ఆనందం పొదాలని తాపత్రయ పడతారు. ఇదే ఇదే బ్రహ్మానందమనుకుంటారు.


ఎక్కడుంది ఆనందం అనే పరబ్రహ్మ (అదే దేవుడు)? అందంలోనే ఉంది ఆనందమన్నారు,చిరకాలంగా. అందమైన ఆడపిల్లని (ఆడవారిదే అందం అని అప్రాచ్యులు దాన్ని పరాయత్తం చేసేసేరు. ఇది మగవారి సొత్తు) అందంగా అలంకరించి,  చివరగా బుగ్గన పెట్టేదే దిష్టిచుక్క. పరమాత్మ ఎక్కడా అని వెతికే, హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే! అని చెప్పేడు. చూసే కన్ను కావాలోయ్!! అన్నాడు.


చూస్తే! పరికిస్తే!! పరిశీలిస్తే!!! అందమైన, అలంకరింపబడ్డ, ఆడపిల్ల మొహంలోని దిష్టి చుక్కలో లేడూ పరబ్రహ్మ? 


అన్నమయ కోశం,ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ మనోమయ కోశం మధ్యలోది. ఇది దాటి ఆనందమయ కోశంలో అడుగిడితే! ఆనందమే ఆనందం, అదే పరబ్రహ్మ!!!!!!!  


Monday, 20 May 2024

కొంతమంది నవ్వితే.......

 కొంతమంది నవ్వితే.....


కొంతమంది నవ్వితే అందం, కొంతమంది నవ్వకుంటేనే అందం,కొంతమంది మూతి ముడిస్తే అందం.కొంతమంది ఏడ్చినా అందమే. ముద్దు పళని నాయిక ముద్దు ముద్దుగా ఏడిస్తే పెద్దనగారి నాయిక బావురుమని ఏడిచిందట, అదీ అందమేనట.  కొంతమంది మాటాడితే అందం,కొంతమంది మాటాడకుంటే అందం, కొంతమందితో మాటాడక ఉండడమే అందం. కొంతమంది ఏం చేసినా అందమేట. హసితం మథురం, వదనం మథురం,గమనం మథురం, వచనం మథురం, మథురాధిపతేరఖిలం మథురం అన్నారు ఇంక ప్రత్యేకంగా చెప్పలేను, ఎన్నని చెప్పనని. ఏడ్చే మగాడిని మాటకి ముందు నవ్వేఆడదాన్ని నమ్మొద్దన్నారు పెద్దలు. కొంతమంది నవ్వితే ఏడ్చిట్టుంటుంది.


కొంతమంది మాటాడితే అందం, కొంతమందితో మాటాడితే అందం, కొంతమందితో మాటాడకుంటేనే అందం,  ఇది మరో  సారీ చెప్పిన మాట. కొంతమందిని తలుచుకుంటేనే అందం, కొంతమందిని తలుచుకోకుంటేనే అందం, ఆనందం .

  కొంత మంది మాటాడితే తిట్టినట్టుండే అందం, కొంతమంది మాటాడుతూ తిట్టినా అందమే!అరటాకెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లెళ్ళి అరటాకు మీద పడ్డా, చిరిగేది అరటాకే, అలాగే, అందమొచ్చి మీద పడ్డా, మనమెళ్ళి అందం మీద పడ్డా, కలిగేది ఆనందమన్నాడో కుర్రకవి. అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం అన్నారో పూర్వకాలపు సినీకవి.

 ఏంటో  వింత  లోకంకదా!

విష్ణుమాయ!!!



Saturday, 18 May 2024

ఏం పీకుదామని?

ఏం పీకుదామని?


పేషంట్:- డాక్టర్ గారు నావయసు 60 మరో 20 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?


డాక్టర్:- స్మోకింగ్  చేస్తారా?


పే:- లేదు డాక్టర్.


డా:- డ్రింక్ వగైరా అలవాటేమైనా..?


పే:_ ఛ..ఛ..మా ఇంటా..వంటా..లేదు.


డా:-మరో 20 ఏళ్ళు ఏం పీకుదామని..?

Courtesy: Whats app


 దీని భావమేమి తిరుమలేశా?



Monday, 13 May 2024

వోటేసేను.

 వోటేసేను.



 ఈ వేళ పొద్దుటే బూత్ దగ్గరకెళితే లైన్ లో నిలబడమన్నాడు పోలీసు, కర్చుకిచ్చేసేను, ఎనభై ఏళ్ళు దాటినవాడిని లైన్ లో నిలబడక్కరలేదు, తెలియకపోతే తెలుసుకో అంటూ, లోపలకెళ్ళిపోయా, వోటేసేను. 


మొదటిసారి వోటెప్పుడేసేనని ఆలోచిస్తే 67 లో వేసేను. 62 లోనే ఉద్యోగంలో చేరినా అప్పటికి ఇంకా 21 పూర్తికాలేదు కనక, ఒక చోట ఉండకపోవడం కారణాలు.  ఆరోజుల్లో మాకు వోటెయ్యడానికి గంట సమయం ఇచ్చేవారు, శలవు లేనే లేదు, దానికి ప్రతిఫలమూ లేదు, అందరికి శలవున్నా. ఆ తరవాత ఎన్ని సార్లు వేసేను,గుర్తులేదు. వోటెయ్యడం ఇదే ఆఖరు సారి కావచ్చు.


వోటేసిన తరవాత అబ్బాయి అక్కడ తెలిసినవారి ఇంటి దగ్గర కూచోబెట్టేడు, తను వోటేసొస్తాను, అప్పటి దాకా కూచోమని. ఈ లోగా ఒక నాలాటి ఆవిడే వచ్చింది, వేటేసేరా? అంటూ. వేలు చూపించా, ఎవరికేసేరంది, చెప్పేను, మీరెవరికేసేరన్నా? కమ్మోరమ్మాయికి రెడ్డోరబ్బాయికి ఓటేసా అంది. ఇద్దరూ  రెడ్డోరబ్బాయి లేగా అడిగా! అది సీక్రెట్టూ అని క్రాస్ వోటింగ్ జరుగుతుందని నవ్వేసింది, ఈలోగా మరోకరు మాలాటివాడే వస్తూ వోటేసేరా అని అడిగి, కరువొచ్చేలా ఉందండీ అన్నారు నర్మగర్భంగా. మొదటి కరువుకే చచ్చిపోలేదు, వచ్చే కరువులు మనల్ని ఏం చేస్తాయి లెద్దురూ, వయసైపోయినవాళ్ళం, చచ్చిపోతే గొడవేలేదందావిడ. ఈలోగా అబ్బాయొచ్చేడు, నేనొచ్చేసా!

Saturday, 11 May 2024

గవళ్ళగంగమ్మగారి....




 గవళ్ళగంగమ్మగారి....


కల్లు మానండోయ్ బాబూ! కళ్ళు తెరవండని నాటిరోజుల్లో మొత్తుకున్నారు. మానినట్టెఖ్ఖడా కనపడలేదు.నేడు అది కాస్తా పెరిగి పెద్దదిపోయిందంటే అనుమానం లేదు. ఒకప్పుడు పబ్బుల్లోనూ క్లబ్బుల్లోనూ కంపెనీ సరుకే తాగుతారానుకునీ వారు.కాలం మారింది. భూమి గుండ్రంగా ఉంది. ఆడా మగా తేడా లేక నేడు కార్లు పల్లెలకి పరిగెడుతున్నాయి,ఉదయమే. తాడి చెట్టునుంచి దించిన కల్లుకుండ చెట్టు మొదటిలోనే కాళీ ఐపోతోంది. చదువుకున్న ఆడపిల్లలు వయసుతో సంబంధం  లేక కల్లు తాగుతున్నారు. కల్లు తాగుతున్న వీడియోలో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.


తాటికల్లూ సరిపోయేలా లేదు కొబ్బరికల్లు కూడా గీయచ్చు, ఇక ముందు.


గవళ్ళగంగమ్మగారి హస్తోదకం జిందాబాద్!!! 

Friday, 10 May 2024

మూడు పువ్వులు....

 


మూడు పువ్వులు....


వాడికేంట్రా! వాడిపని మూడు పువ్వులూ ఆరు కాయలా ఉందీ, అంటారు, దీనర్ధం, ఏలేస్తే కోలు దిగేలా ఉందంటారు, పల్లెటూరివాళ్ళు. దీనికి ఆశ్లీలార్ధమూ చెప్పేవారున్నారు.


అబ్బాయిగారి పని మూడు పువ్వులూ ఆరుకాయల్లాగే ఉందిట. మొదట అమేటీ లో నెగ్గేరు అది సొంత సామ్రాజ్యం.   పువ్వు పిందయింది, అది ఉడుకు పిందయి రాలిపోయింది..

 అది దూరాక్రమణ పాలయిందనుకుని చింతించి,వగచి మరో పచ్చటి చోటుకి మారేరు. ఆ పూవు పిందయింది, ఇదీ ఉడుకుపిందయి రాలిపోతుందా? ఇప్పుడది ఎర్ర వారి కళ్ళ బడి దురాక్రమణ, మిత్రుల పేర వెన్నుపోటు తగిలేలా ఉంది, ఈపువ్వు పిందయ్యేనా? అనుమానమే! ఇప్పుడు మూడో పువ్వు చూసుకోక తప్పటం లేదు, అది బరేలీ. అమ్మ త్యాగమయి, తన స్వంత సీటు కొడుక్కోసం వదిలేసి రాజ్య సభకెళ్ళిపోయింది. అమ్మ ఒడి కదా భయమేల వెంటనే నామినేషన్ వేయచ్చుగా అడిగాడో సందేహి. నిజమేగాని ఇక్కడా మరే దురాక్రమణ దారు తయారవుతాడో చెప్పలేం కదా! అందుకే సస్పన్స్, దేశం ముక్త కంఠంతో పోటీ చెయ్యమనలేదూ! ఈ పూవు పిందయ్యేనా? పురిటిలోనే సంధి కొట్టేనా? కాలమే చెప్పాలి.


మూడు పువ్వులు ఆరు కాయలవుతాయా?  

Thursday, 9 May 2024

ఒక రోజు పెళ్ళికి మొహమంతా కాటుక

 ఒక రోజు పెళ్ళికి మొహమంతా కాటుక


పెళ్ళి ఐదురోజులు నుంచి సమయం తగ్గి మూడు రోజులు,ఒకరోజుకు తగ్గిన కాలం. ఒక పెళ్ళి జరుగుతోంది. బ్రహ్మగారు అగ్నిహోత్రం దగ్గర దంపతుల్ని కూచో బెట్టి హోమం చేయిస్తున్నారు. పొగ కమ్ముతోంది.పెళ్ళి కూతురుకి పొగ బాధగా ఉంది. కళ్ళ నీళ్ళొస్తున్నాయి. కొంగునగాని గుడ్డతోగాని తుడుచుకోలేదు,కారణం పెళ్ళి కూతురు ఏడుస్తోంది,పెళ్ళి ఇష్టం లేదేమో అని గుసగుసలు రావచ్చు. అందుకు కళ్ళు నులుపుకోడం చేస్తూ వచ్చింది. కళ్ళకి కొంచం దండిగానే కాటుక పెట్టడం తో అదికాస్తా మొహాన అలుముకుపోయింది. అందమైన పెళ్ళికూతురు మొహం భయంకరంగా మారింది.అందం కోసం కాటుక పెట్టుకుంటే అదికాస్తా భయంకరంగా మారినట్టు. అదుగో అలాపుట్టిందీ నానుడి. 


ఇప్పుడిదెందుకూ! శంక. ఎండ మలమల మాడబెడుతోంది ఇరవైరోజుల్నించి. చల్లబడితే బాగుణ్ణు అన్నది కోరిక. మొన్న మంగళవారం మధ్యాహ్నం పన్నెండు ఎండ దంచుతోంది, అప్పుడు గాలేసింది, కరంటుపోయింది,మబ్బేసింది,చినుకులు,పెరిగాయి. వర్షం నిలిచి మూడు గంటలు కురిసింది. కరంటు రాలేదు. చల్లబడిందనుకున్నాం కాదు పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడినట్టనిపించింది. ఇప్పటిదాకా లోపల చల్లగా బయట వేడిగా ఉందేది ఇప్పుడు బయటలోపలా కూడా వేడి,ఉక్కపోత దంచుతున్నాయి. ఇదేమని ఆలోచిస్తే చుట్టూ ఉన్న కాంక్రీట్ జంగిల్ నుంచి విడుదలైన వేడి, ఇంటి గోడలు వేడెక్కి ఉన్నవి నీరు పడటంతో వేడి లోపలికి వదలితే పొయ్యిలో ఉన్నట్టే, కుమ్ములో పెట్టన చిలకడదుంపయింది మా పని. అప్పటి నుంచీ బేటరీ మీదనే ఫేన్లు తిరుగుతూనే ఉన్నాయి. కరంటెప్పుడొస్తుందంటే ఆరు గంటల కిస్తామన్నారు. వాళ్ళేం అవస్థపడుతున్నరో అనుకుని మరి అడగ లేదు. (మొన్ననోరోజు సబ్ స్టేషన్ లో ట్రాన్స్ఫార్మర్లు వేడెక్కిపోతే, కాలిపోకుండేందుకుగాను, కరంటు గంట సేపు ఆపి, ఫైర్ ఇంజన్లతో వాటిపై వర్షం కురిపించి, మళ్ళీ కరంటిచ్చారు) మెతుకులు కతికా, బెడ్ మీద పడుకోలేను,వేడి. కింద పడుకుంటే అలవాటు లేదు. ఇలా అవస్థపడి మడతమంచమేసుకుని పడుకుని,కూచుని బాధ పడితే ఒంటిగంటకి కరంటొచ్చిపోయింది. అసలు ఊపిరొచ్చింది గనక బతికే సావకాశం ఉందని సంతసించి ఎదురుచూస్తే రెండు గంటలకి కరంటు స్థిరంగా నిలబడితే ఎ.సి వేసుకు పడుకుంటే నాలుగుకే అలవాటుగా మెలుకువ వచ్చేసింది.

వర్షం పడితే చల్లబడుతుందనుకుంటే ఒకరోజుపెళ్ళికి మొహమంతా కాటుక సామెతయింది. 


Wednesday, 8 May 2024

ఎవరెక్కువ తడుస్తారు?

 

ఎవరెక్కువ తడుస్తారు?



 నిలిచి కురుస్తున్న వర్షంలో ఎవరెక్కువ తడుస్తారు?

నడుస్తున్న 

లావుపాటివారా? సన్నపాటివారా?

Monday, 6 May 2024

శుభాకాంక్షలు.

 శుభాకాంక్షలు.


దేశ విదేశాల్లో ఉన్న మిత్రులూ,శత్రువులకూ,

ఎల్లరకూ


ఏప్రిల్ రెండో వారంలోనే మొదలైన

మలమాడ్చే ఎండలు (41,42,43,44,45,46,47 డిగ్రీల వేడి)

వడగాలి, ఉక్కపోత 

శుభాకాంక్షలు.


Thursday, 2 May 2024

ఎండ మలమల మాడుస్తోంది.

 ఎండ మలమల మాడుస్తోంది.


వేడి పాపం పెరిగినట్టు రేసు గుఱ్ఱంలా పరిగెడుతోంది 40 నుంచి 45. ఎక్కడా బెత్తెడు నేల కనపట్టంలేదు,మొక్క లేదు. అంతా కాంక్రీటే! ఎన్ని సార్లనుకుని ఉపయోగం లేదు. ఇది ఒకరోజు పాపం కాదు తరాల పాపం. అనుభవించక తప్పదు. 


చేసుకున్న కర్మమోయ్ శంభు లింగమా! 

అనుభవింపక తప్పదోయ్ ఆత్మ లింగమా!


ఎండ వేడి నుంచి రక్షించుకోడమెలా? పాపం! విపత్తు నివారణ సంస్థ వారు రేపటి గురించి ఈ రోజో ఇంట్లో ముసలాళ్ళలా కురుపు సలిపినట్టు ఒక మెసేజి ఇస్తూనే ఉన్నారు. లెక్క చేసేవారే కనపట్టం లేనట్టుంది.


వేసవి వేడి మూలంగా వచ్చే అనారోగ్యాలనుంచి కాపాడుకోవాలంటే కొన్ని పనులు తప్పవు. బయట తిరక్క తప్పని వారు చెవులకి గుడ్డ కట్టుకోవాలి,అందుకే మనవారు తలపాగా చుట్టేవారు. జేబులో ఒక బళ్ళారి ఉల్లిపాయ ఉంచుకుంటే ప్రమాదం నుంచి రక్షించుకోవచ్చు. ఎండలో దాహంగా ఉన్నపుడు,వడ తగిలిందేమో అనుమానం కలిగినపుడు, ఈ ఉల్లిపాయను నమిలిమింగండి, ప్రాణం కాపాడుతుంది, దాహం కడుతుంది. ఇది చాలా పురాతనంగా అనాగరికంగా కనపడచ్చు, కాని ఇది నిజం.


ఇక నీడపట్టునున్నవారు, ఎ.సి ఉన్నవారు, ఎ.సి లో ఉండేవారు, ఎ.సిని 27 లో ఉంచుకుని ఉంటే బహు బాగుంటుంది. ఇక తినే ఆహారంలో నీరుల్లి ఎక్కువ వాడితే మంచిది. నీళ్ళు ఎక్కువపోసిన మజ్జిగ నిమ్మకాయతో ఆరారా తాగడం  మంచిది. కొబ్బరి నీళ్ళు నిలవవికాక దొరికితే తాగడం మంచిది. తాటిముంజలు దొరికితే మంచిదే. వేసవి అంటే పళ్ళే. అన్నిటిని తినచ్చు,మితంగా. తాగేవాటిలో సబ్జా గింజలు నానబెట్టినవి,నీళ్ళతో గాని,మజ్జిగతో గాని, ఉప్పు,పంచదారలతో లేదా బెల్లం మహ మంచిది. ఈ అనుపానాలు వాడలేనివారు సబ్జా గింజల్ని నానబెట్టి మజ్జిగతో తీసుకోవచ్చు. ఆరారగ తాగితే బహుమంచిది. ఎ.సి లో ఉంటే నీళ్ళెక్కువ తాగాలి, అప్పుడు ఈ సబ్జా గింజల మజ్జిగ బహుమంచిది. ఎట్టి పరిస్తితులలోనూ ఫ్రిజ్ ఉన్న నీళ్ళు తాగద్దు, గది వేడి దగ్గరున్నవి,రాగి బిందెగాని ఇత్తడి బిందెలో ఉన్న నీళ్ళు తాగండి. ఆరోగ్యానికి మంచిది. సబ్జా గింజలంటే మరేమో కాదు తులసి విత్తనాలే! వీటి ఉపయోగాలనేకం, ఆరోగ్యానికి గొప్ప అవసరం.   ఛీ తులసి విత్తనాలా నానబెట్టుకుని తాగుతారా? అసలొప్పం కోకాకోలా తాగుతాం ,పిజ్జ తింటాం ఈ పిచ్చి తిళ్ళేం తింటామంటారా! అస్తు. 

చెప్పడమే నా ధర్మం 

వినకపోతె నీకర్మం