Monday, 29 April 2024

రాజుని చూసినకళ్ళ మొగుణ్ణి చూస్తే

 రాజుని చూసినకళ్ళ మొగుణ్ణి చూస్తే మొట్టబుద్ధి.

రాజుఎలా ఉంటాడు? ఎర్రగా బుర్రగా ఉంటాడు. చుట్టూ మంది మార్బలం, కైవారాలు , వందిమాగధులు ఇలా ఉంటాడు. ఊరేగితే ఏనుగు మీద ఎక్కి తిరుగుతాడు. అటువంటివాడిని చూసిన ఇల్లాలు, మొగుణ్ణి చూస్తే లోకువగానూ,చీదరించుకునేలా కనపడడూ? ఎందుకంటే రాజులా ఎర్రగా బుర్రగా ఉండడు,కూడా ఎవరూ ఉండరు, చెప్పినమాట వినేవాడే ఉండడు. 

ఈ దేశంలో పుట్టిపెరిగి ఇక్కడ పల్లెలో,చెరువులో పిత్తపరిగిలు పట్టుకునే  వాడికి,  తల్లితండ్రులు కడుపుకట్టుకు చదివిస్తే, దశ తిరిగి అమెరికా వెళితే,  ఇక్కడ దేశం దరిద్రంతో ఓడుతున్నట్టు కనపడదూ? ఇక్కడ జనాలంతా అనాగరికుల్లా కనపడరూ?   తల్లితండ్రులు బిచ్చగాళ్ళలా అనిపించరూ?

పేదవానికోపము పెదవికిచోటు.

పేదవాడికి కోపమొస్తుంది,ఎందుకు? తనకి అన్యాయం జరిగినపుడు. ఏం చేయగలడు? ఏమీ చేయలేడు. చేయగలది తననుతాను తిట్టుకోవడం. అదే పేదవానికోపము పెదవికి చోటు,చేటు కాదు.

అడిగేవాడికి చెప్పేవాడు లోకువ.

అడిగేవాడు తాను గొప్పవాణ్ణనుకుంటాడు.  అడుగుతూనే  ఉంటాడు. వాడికి సమాధానం చెప్పినకొద్దీ లోకువ కదా! అలా అడుగుతూనే ఉంటాడు. ఇదే లోక రీతి. వినేవాడికి చెప్పేవాడులోకువ ఇదీ మరొక లోకోక్తి.

Saturday, 27 April 2024

అశక్త దుర్జనత్వం అంటే ఎమిటి?

 అశక్త దుర్జనత్వం అంటే ఎమిటి?

Thursday, 25 April 2024

ప్రజలను ఆకర్షించు విద్యలు.

 ప్రజలను ఆకర్షించు విద్యలు.

 ఉచ్చై రధ్యయనం, చిరంతన కథా:, స్త్రీభి: సమాలాపనమ్,

తాసా మర్భక లాలనం, పతినుతి:, తత్పాక మిథ్యాస్తవమ్
మిథ్యా దాన, మభూత పూర్వ చరితం, సాముద్రికం, జ్యోతిషం
వైద్యం, గారుడ మంత్రజాల మధికం భిక్షాటనే ద్వాదశ

గట్టిగా చదవటం,
ఎక్కడెక్కడివో గాథలు చెప్పటం,
స్త్రీలతో సక్కగా మాట్లాడటం,
వారి బిడ్డలను ముద్దుచేయడం,
పై అధికారిని పొగడడం,
వండిన వంటను మెచ్చుకోవడం,
దానం చేసినట్లు కనిపించడం,
లేని కథలు అల్లి చెప్పడం,
హస్తసాముద్రికం,
జ్యోతిషం,
వైద్యం,
పాము తేలు మంత్రం
- అనేవి ఇతరులను ఆకర్షించు విద్యలు.
Courtesy:http://sahitinandanam.blogspot.in/


నేటికీ రాజకీయులు ఉపయోగిస్తున్న ట్రిక్కులు ఇవేనేమో సుమ్మీ/సూవె/సుమా! 

Tuesday, 23 April 2024

ఆడలేక....

 ఆడలేక....


మా వాళ్ళు వాట్సాప్ మీటింగేసేరు,పొద్దుటే!


బి.జె.పి కి నాలుగొందల సీట్లొస్తాయంటావా? అన్నాడు సుబ్బరాజు. రాకెక్కడికిపోతాయిలే సూరత్ లో లాగా చేస్తే అన్నాడు పొడిగింపుగా.


సుబ్బరాజూ! నాలుగొందలొస్తాయో లేదో చెప్పలేనుగాని సూరత్ లో వేసినట్టు నామినేషన్లు వేసుకుంటే ఐదొందలూ వస్తాయి.నూరేళ్ళు నిండిన పార్టీ అని జెప్పుకుంటారుగా! నామినేషన్లు కూడా సరిగా వేసుకోలేరా? దానికీ ఆళ్ళనే తిడ్తావా? జనాలు నవ్వుతారయ్యా! మనపల్లెలలో ముతక సామెత జెపుతారు, నీకూ తెలిసిందే!! ఇక్కడ జెపితే బాగోదనుకో, ఇనుకో! ఆడలేక మద్దెల ఓడన్నదట ఒక సాని. అలాగుందో! అన్నాడు సత్తిబాబు.


మనదగ్గరేటి చెప్పూ అన్నాడు సుబ్బరాజు. వద్దో!నా నోరు తిన్నగుండదు,నీకేమో బాధ కలుగుద్ది. నే పోతన్నా! ప్రచారానికిపోవాల! అని వెళ్ళిపోయాడు మా సత్తిబాబు. 

Thursday, 18 April 2024

ఎండలు మండుతున్నాయి

 ఎండలు మండుతున్నాయి


వాట్సాప్ లో మీటింగెట్టేరు మావాళ్ళు.


ఎండలు మండుతున్నాయన్నాడు మా సుబ్బరాజు.


ఎండలు మండవో! మంటబెడతాయి, అన్నాడు మా సత్తిబాబు.


కోసట్టుకున్నావుగాని.ఎండలకి నీళ్ళు లేక బెంగళూరు సగం ఖాళీ అట, ఎడారి దేశంలో వరదలట.వరుణజపం చేస్తే వర్షాలు కురుస్తాయటగా? ఏంటయ్యా ఇదీ!


నీళ్ళు లేక బంగళూరు ఖాళీ అవుతోంది,ఎడారి దేశంలో వరదలూ నిజమే! నువ్వంటే నువ్వనుకుని నీళ్ళు లేకుండా చేసారు. ఎడారిదేశం వాళ్ళు టెక్నాలజీ ఉపయోగించి వర్షం కురిపించుకుంటే అదెక్కువై వరదలొచ్చేయి. మనకి టెక్నాలజీ ఉన్నా ఉపయోగించుకునేది లేదు. వరుణ జపాలమీద నమ్మకమూ లేదు. యతోభ్రష్ఠః తతో భ్రష్ఠః మనమింతేలే అనేసేడు సత్తిబాబు.


చైనాలో సింగపూర్ లో ఎండలు లేవంటగా అడిగాడు సుబ్బరాజు.


అవున్లే! భక్తులకట్టనే ఉంటదబ్బయా!


మనకీ ఎండలెక్కువగానే ఉన్నాయి 40,42,43,44,45 అంటున్నారు అన్నాడు సుబ్బరాజు.


కరువుబాబుగారు కుర్చీ ఎక్కుతాడు దానికి సూచనే ఈ ఎండలని చెప్పుకుంటన్నారులే వాళ్ళోళ్ళే. ఎల్తా! అన్నాడు సత్తిబాబు. 


ఓ! నిమిషం కూచోవో అడిగాడు సుబ్బరాజు.


నీది కడుపు నిండినబేరం. ఎండనబడి ఎవడో ఒకడి జండా భుజానవేసుకుపోకపోతే నాకు డొక్కాడదు. వస్తా అనెళ్ళేడు మా సత్తిబాబు. 


Tuesday, 9 April 2024

ఉగాది శుభకామనలు

 క్రోధి నామ సంవత్సర ఉగాది శుభకామనలు

చిగురేసె మొగ్గేసే సొగసంతా పూతపూసె ఇవ్వాలని లేదా ఏమి ఓ సిరిపాపా ఎన్నాళ్ళు దాస్తావేమి అన్నాడట సినీకవి . ఈ సంవత్సరం పూతలేదు కాపు లేదు,చిగురొచ్చేసింది చెట్టునిండా, 
 కాపు మళ్ళీ సంవత్సరానికి వాయిదా వేస్తూ!!!


ఇంత చిగురులోనూ రెండు కాయలు కనపడ్డాయి,చిత్రమే బహుచిత్రమే అంటూ!!!


చైత్ర వైశాఖమాసమౌలు-వసంత ఋతువు-- చెట్లు చిగిర్చి పూలు పూయును,కాయలు కాయును.


జ్యేష్ట ఆషాఢ మాసములు- గ్రీష్మ ఋతువు--ఎండలు మెండుగా కాయును.


శ్రావణ భాద్రపద మాసములు- వర్ష ఋతువు-వానలు ఎక్కువగా కురియును,నదులు పొంగును.


ఆశ్వయుజ కార్తీక మాసములు- శరదృతువు-- వెన్నెల బాగుగా కాయును.


మార్గశిర పుష్య మాసములు-- హిమవంత ఋతువు-- మంచుకురియును. చలి ఎక్కువగా ఉండును.


మాఘ ఫాల్గుణ మాసములు శిశిర ఋతువు-- చెట్లు ఆకు రాల్చును.


ఇవన్నీ పాతకాలం మాటలు. అంతా మార్పే! ఇప్పుడు వసంత ఋతువు రాకుండానే  గ్రీష్మ ఋతువు కనపడుతోంది, అందునా రోహిణీ కార్తె ఎండలు కాస్తున్నాయి. వేడి శివరాత్రికే 34 నుంచి రేసు గుఱ్ఱంలా ఈ రోజుకు, నలభై ఐదు రోజుల్లో 43  కి చేరిపోయింది, వేడి. 

ఇక ముందెలా ఉంటుందో చెప్పలేం. ఉన్నవి మూడు ఋతువుల్లాగా ఉంది.వసంత ఋతువు గ్రీష్మ ఋతువుతో కలిసిపోయి గ్రీష్మ ఋతువే కనపడుతోంది. అలాగే శిశిరం హేమంతంలో కలిసిపోయింది. 


 కారణాలు మీరంటే మీరంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ది చెందుతున్న దేశాలని తప్పుపడుతున్నాయి. మొన్ననో సారి గుయానా అద్యక్షునితో బి.బి.సి విలేకరి ఇలా తప్పుపట్టినట్టు మాటాడితే నోరెత్తనివ్వకుండా జవాబిచ్చారు. అలా జవాబిచ్చినపుడే ఆ దేశాలకి తెలుస్తుంది, తమ తప్పేంటో! 


Sunday, 7 April 2024

గేదెలకు దోమతెరలు.

 

గేదెలకు దోమతెరలు.

Thursday, 4 April 2024

రుద్ర పంచముఖధ్యానం-ఊర్ధ్వముఖం

 రుద్ర పంచముఖధ్యానం-ఊర్ధ్వముఖం


ఓం యం!! ఈశానసర్వవిద్యానా మీశ్వరస్సర్వ భూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిబ్రహ్మా శివోమే అస్తు సదా శివోమ్.


వ్యక్తావ్యక్త గుణేతరం పరతరం షట్త్రింశతత్త్వాత్మకం

తస్మాదుత్తమ తత్త్వమక్షరమిదం ధ్యేయం సదాయోగిభిః

ఓం కారాది సమస్త మన్త్రజనకం సూక్ష్మాతిసూక్షం పరం

శాంతం పంచమ మీశ్వరస్యవదనం ఖంవ్యాపి తేజోమయమ్.


ఓం నమోభగవతే రుద్రాయ. యం ఓం ఊర్ధ్వముఖాయనమః

-------------------------------------------------------

తాత్పర్యము: వ్యక్తము, అవ్యక్తము (స్పష్ట రూపము కలది, స్పష్ట రూపము లేనిది) అను రెండు రెండు లక్షణముల కంటెను ఇతరమగు లక్షణము కలదియు, ముప్ఫై ఆరు తత్వముల రూపమున పరిణమించు నదియు,  సకల తత్వముల కంటెను ఉన్నతమైనదియు అగు అనుత్తరము అను అక్షర (అకార) తత్వమును ఎల్లప్పుడును యోగులచే ధ్యానించబడ దగినదియు,  తమో గుణ రహితంను, మూడు కన్నులు కలదియు, సూక్ష్మాతిసూక్ష్మమగు దాని కంటే గోప్పదియు,  శాంతమునును, ఆకాశము నందంటను వ్యాపించు తేజమే తన రూపముగా కలదియు అగు ఈశ్వరుని ముఖమును నమస్కరింతును (గుణాతీత బ్రహ్మ తత్వమును ఇక్కడ స్తుతించబడినది)

-------------------------------------------------------------------------

పూర్వే పశుపతిఃపాతు దక్షిణేపాతు శంకరః

పశ్చిమేపాతు విశ్వేశో నీలంకంఠస్తదోత్తరే.


ఐశాన్యం పాతుమేశర్వో హాగ్నేయాం పార్వతీ పతిః

నైరృత్యాం పాతుమే రుద్రో వాయువ్యాం నీలలోహితః


ఊర్ధ్వే త్రిలోచనః పాతు అధరాయాం మహేశ్వరః

ఏతాభ్యో దశదిగ్భ్యస్తు సర్వతః పాతుశంకరః

---------------------------------------------------------------------

ఊర్ధ్వముఖ దర్శనం ముక్తిదాయకం.

Wednesday, 3 April 2024

రుద్ర పంచముఖధ్యానం-ఉత్తర ముఖం

 రుద్ర పంచముఖధ్యానం-ఉత్తర ముఖం 


ఓం వాం!!  వామదేవాయ నమో జ్యేష్ఠాయనమశ్రేష్ఠాయ నమోరుద్రాయ నమః   కాలాయనమః   కలవికరణాయనమో బలవికరణాయనమో బలాయనమో బలప్రమథనాథాయనమ సర్వభూతదమనాయ నమో మనోన్మనాయనమః


గౌరంకుంకుమపంకిలం సుతిలకం వ్యాపాండు గండస్థలం

భ్రూవిక్షేప కటాక్షవీక్షణ లసత్సంక కర్ణోత్పలమ్

స్నిగ్ధబింబఫలాధరం ప్రహసితం నీలాలకాలంకృతం

వందేపూర్ణశశాజ్ఞ్క మణ్డలనిభం వక్త్రంహరస్యోత్తరమ్


ఓ నమో భగవతే రుద్రాయ! వాం ఓం ఉత్తరముఖాయ నమః

-------------------------------------------------------------------------------------------------

తాత్పర్యము:  గౌర (ఎరుపుతో కలిపిన తెలుపు) వర్ణము కలదియు, కుంకుమ పూ పూతతో   నిండినదియు, అందమగు తిలకము కలదియు, విశేషముగా తెల్లదనముకల చెక్కిళ్ళు కలదియు, కనుబొమ్మల కదలికతో ఒప్పుచుండు కడగంటి చూపుతో ప్రకాశించుటతో పాటు, చెవికి అలంకారముగా నున్న తెల్ల కలువ పూవు కలదియు, నున్నని దొండపండు పోలు ఎర్రని క్రింద పెదవి పై పెదవి స్పష్టమగు నవ్వు కలదియు, నల్లని   ముంగురులచే  అలంకరించబడిన, నిండు చంద్రుని మండలమును పోలుచు ప్రకాశించునదియు అగు శివుని ఉత్తరాముఖమును నమస్కరించు చున్నాను. (గుణ త్రయ మిశ్రమమగు ఈశ్వర తత్త్వము ఇక్కడ స్తుతించ బడినది)


------------------------------------------------------------------------------

ఈ ముఖాన్ని వామదేవమని అంటారు, వాసుదేవమనీ పెద్దలమాట. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే!

ఉత్తర ముఖ శివ దర్శనం వలన ఆరోగ్య ఐశ్వర్యాలు సంరక్షింపబడతాయి,సక్రమ వృద్ధి చెందుతాయి,అనుభవింపబడతాయి.

Tuesday, 2 April 2024

రుద్ర పంచముఖధ్యానం-పశ్చిమ ముఖం

 రుద్ర పంచముఖధ్యానం-పశ్చిమ ముఖం


ఓం శిం. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయవై నమో నమః. భవే భవేనాతిభవే భవస్త్వమాం భవోద్భవాయ నమః


ప్రాలేయాచల మిందుకుంద ధవళం గోక్షీర ఫేనప్రభం

భస్మాభ్యక్త మనంగ దేహదహన జాలావళీ లోచనమ్

బ్రహ్మేన్ద్రాది మరుద్గణై స్స్తుతి పదైరభ్యర్చితం యోగిభిః

వందేహం సకలం కళంక రహితం స్థాణోర్ముఖం పశ్చిమమ్.


ఓం నమో భగవతే రుద్రాయ. శిం ఓం పశ్చిమ ముఖాయ నమః

--------------------------------


హిమవత్పర్వతం,చంద్రుడు,మొల్లపువ్వు వీటివలె తెల్లనిది పాలనురుగువలె తెల్లని కాంతికలది విభూతిపూయబడినదీ,మన్మధుని శరీరాన్ని దహించు జ్వాలలపంక్తితో నిండిన కన్ను కలది స్తోత్రము చేయుచున్న బ్రాహ్మ,ఇంద్రాది దేవతలు,మరుత్తులచేత ,యోగులచేత స్తుతింపబడుచున్నదైన,నిర్మలమైన నిండువదనముతో నున్నదైన శివుని పశ్చిమ ముఖమునకు నమస్కరించు చున్నాను. 

--------------------------------------------

పశ్చిమంగా ముఖమున్న శివుని సద్యోజాతాయ నమః అని నమస్కరించాలి. సద్యొజాత శివుడు కోరికల్ని సత్వరం నెరవేరుస్తూ ఉంటాడు. ఇది అనుభవం కూడా! ఇటువంటి శివాలయం దొరకడం అదృష్టమే! ఈ పంచముఖ శ్లోకాలు చదవడమే కష్టంగా ఉంది పలకడం మరెంత కష్టం అనిపిస్తుంది. కాని చాలా తేలిక. వర్ణక్రమం తెలిసుండాలి. వర్ణక్రమమేమని అడ్గద్దు, దాన్నే ఇంగ్లీషులో స్పెల్లింగ్ అంటారు. ఒక్క సారి విని స్పెల్లింగ్ చదవగలిగితే! ఆనందమే,ఆనందం!! అర్ధంకూడా బాగా తెలుస్తుంది.

Monday, 1 April 2024

రుద్ర పంచముఖధ్యానం- దక్షిణముఖం

 రుద్ర పంచముఖధ్యానం- దక్షిణముఖం


ఓం మం. అఘోరేభ్యోఽథఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః. సర్వేభ్యస్సర్వ శర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్యః.


కాలాభ్రభ్ర మరాంజన ద్యుతినిభం వ్యావృత్త పింగేక్షణం

కర్ణోద్భాసిత భోగిమస్తక మణిప్రోద్గీర్ణ  దంష్ట్రాంకురమ్  

సర్పప్రోతకపాలశుక్తిశకల వ్యాకీర్ణసచ్చేఖరం

వందే దక్షణమీశ్వరస్య కుటిల భ్రూభంగ రౌద్రం ముఖమ్


ఓం నమో భగవతే రుద్రాయ. మం ఓం. దక్షిణ ముఖాయనమః

(శ్రీ మార్తి వేంకట్రామ శర్మ గారి యాజుషస్మార్తగ్రన్థః నుండి)

---------------------------------------------------------

తాత్పర్యము: నల్లని మేఘములు, తుమ్మెదల కాటుక - వీటి కాంతిని పోలిన కాంతితో ప్రకాశించునదియు, మిక్కిలి మిట్టగా తిరుగుచుండు పింగా వర్ణపు కన్నులు కలదియు, చెవుల యందు మిక్కిలి ప్రకాశించుచుండు సర్ప శిరోరత్నములతో బాగా కలిసిపోవుచున్న కోరల మొలకలు కలదియు, సర్పములతో పాటు (హారముగా) కూర్చబడిన కపాలములతో, ముత్యపు చిప్పల ముక్కలతోను, ఎగుడు దిగుదగుచున్న నడకను పొందినదియు, వంకరలుగా నున్న కను బొమ్మల ముడులతో భయంకరముగా నున్న ఈశ్వరుని దక్షిణ ముఖమును నమస్కరించు చున్నాను. (తమో గుణ ప్రధాన లయ కర్త తత్వము ఇక్కడ స్తుతి చేయబడింది)

Courtesy:telugu one.com

------------------------------------------------------

దక్షిణముఖ ఈశ్వరుణ్ణి దక్షిణమూర్తి అని కూడా పిలుస్తారు. ఈ ముఖ ఈశ్వరుడు దర్శనం, ఆరోగ్యాన్ని,విద్యను ప్రసాదిస్తుందని పెద్దలు చెబుతారు