Saturday, 12 February 2022

మూర్ఖులకిచ్చే సలహా ప్రమాదకరం


 అనగనగా ఒక అడవి, అందులో ఒక చింతచెట్టు చివర కొమ్మని, ఒక పిచుకల జంట గూడు కట్టుకుని ఉంటోంది. అదే చెట్టు మీద కింది పలవలో ఒక కోతి ఆవాసం. ఒక రోజు రాత్రి పెద్ద గాలి,వానా కుదిపేశాయి. పిచుకల జంట భయం భయంగానే చిటారు కొమ్మన వెచ్చగా ఉన్న గూటిలో గడిపేయి. కోతి వానకి తడిసి, చలికి వణుకుతూ ఉండిపోయింది.తెల్లారింది, పిచుకల జంట బయటకి చూస్తే అడవి అల్లకల్లోలంగా ఉంది, వర్షం కొంచం తగ్గింది. కింది కొమ్మల్లో కోతి చలికి వణుకుతూ కనిపించింది.ఆ జంట కోతితో, బావా! నువ్వు బలవంతుడివి కదా! నాలుగు కొమ్మలు విరిచుకుని, గూడు వేసుకుంటే ఈ తిప్పలు తప్పేవి కదా అన్నాయి. ఇది విన్న కోతికి అరికాలు మంట నెత్తికి ఎక్కింది. చర్రున లేచి, పిచుకల గూటిపై దాడి చేసింది. గూడు చిటారు కొమ్మన ఉండిపోవడంతో వెంటనే చిక్కలేదు. సంగతి గ్రహించిన పిచుకల జంట గూడు వదలి ఎగిరిపోయింది.. కోతి ఆగ్రహం పట్టలేక గూడున్న కొమ్మ విరిచి కింద పారేసింది. చూచిన జంట చెప్పిన సలహాకి  వగచి వేరు చెట్టుకు చేరాయి. 

సందర్భ శుద్ధి లేకఇచ్చే సలహా గాని మాటగాని రాణించవు.

మూర్ఖులకి సలహా ఇవ్వకూడదు, అది ప్రమాదకరం.

7 comments:

  1. // "చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు" // అన్నాడు కదా భర్తృహరి.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      ఇది దానికి పొడిగింపేనండి. విష్ణుశర్మ పంచతంత్రం లో కత ఇది.

      Delete
  2. మూర్ఖులని తెలిసికోవటం ఎట్లా?

    ReplyDelete
    Replies
    1. లక్కరాజావారు,
      మూర్ఖులెవరో పోల్చుకోడం ఎలాగ?



      ప్ర: మూర్ఖులకి దూరంగా ఉండమని చెప్తుంటారు. మూర్ఖులెవరో పోల్చుకోడం ఎలాగ?



      జవాబు:



      మూర్ఖస్య పంచ చిహ్నాని

      గర్వీ దుర్వచనీ తథా

      హరీ చాఽప్రియవాదీ చ

      పరోక్తం నైవ మన్యతే



      మూర్ఖుని ఐదు లక్షణాలు

      1. గర్వం ఎక్కువగా వుండటం 2. చెడ్డ మాటలు మాట్లాడే నైజం 3. మొండి పట్టుదల 4. అప్రియంగా మాట్లాడటం, వాదించడం 5.ఎదుటివాళ్ళు చెప్పిన దానిని వ్యతిరేకించి దానిని కాదనడమే లక్ష్యంగా పెట్టుకోవడం. ఈ ఐదు లక్షణాలున్నవారిని దూరంగా వదలిపెట్టాలని శాస్త్రం.

      Delete
    2. నాకు తెలుసు ఒక పద్యం ఎక్కడో ఉంటుందని. శర్మ గారూ థాంక్స్.

      Delete
  3. 1. గర్వం ఎక్కువగా వుండటం
    2. చెడ్డ మాటలు మాట్లాడే నైజం
    3. మొండి పట్టుదల
    4. అప్రియంగా మాట్లాడటం, వాదించడం
    5.ఎదుటివాళ్ళు చెప్పిన దానిని వ్యతిరేకించి దానిని కాదనడమే లక్ష్యంగా పెట్టుకోవడం.

    ఈ ఐదు లక్షణాలున్న ఒక మనిషి మనందరికీ సుపరిచయం. చక్రం తిప్పేస్తానని అన్నారు ఈ మధ్యనే!

    ReplyDelete
    Replies
    1. YJs గారు,
      చక్రం తిరిగిందాండీ :)

      Delete