Thursday, 13 January 2022

పండగ -వయసు ముచ్చట్లు

 పండగ-వయసు ముచ్చట్లు 


పెళ్ళయిన మొదటి సంవత్సరం, పెద్ద పండగకి పిలవడానికి మామగారొచ్చాడు. పండక్కి తీసుకెళ్తా రమ్మన్నాడు. మీ అమ్మాయిని తీసుకెళ్ళండి, నేను తరవాతొస్తానన్నా! ఏమనుకుందోగాని ఇల్లాలు, ఇద్దరం కలిసివస్తాం,అనిజెప్పి తండ్రిని పంపేసింది. భోగి ముందురోజు ఉదయం డ్యూటీ చేసి సాయంత్రం బయల్దేరి ఇరవై కిలో మీటర్లు దూరం కోసం రెండు గంటలు ప్రయాణం కోసం వెచ్చించి కడియం చేరేం.గుమ్మంలో చేరగానే ఎదురింటి పిన్నిగారు "ఏమే పాపా! ఇదేనా రావడం? "  అంటూ పలకరించి, అదే వరసని "అల్లుడూ బాగున్నావా?"  అడిగింది. ఆవిడ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారి రెండో కోడలు,దుర్గేశ్వర శాస్త్రి గారి భార్య, ఇంకేంఉంది ఇల్లాలు పిన్ని చేతుల్లో వాలిపోయింది, అయస్కాంతానికి అతుక్కున్న ఇనప ముక్కలా. ఎంతకీ ఇనపముక్క ఊడి బయటకు రాదు. దగ్గేను, సకిలించేను ఉపయోగం లేకపోయింది. ఇనపముక్క ఊడలేదు.ఏం చేయాలి? లోపలికెళితే ఒక్కడివే వచ్చావు మా అమ్మాయేదీ? అంటే, అలాకాక మా అమ్మాయేదీ అంటే ఏం చెప్పాలి? తోచక నిలబడిపోయా! ఈలోగా అత్తగారు బయటికొచ్చి కూతుర్ని పిన్నమ్మ చేతుల్లో చూసి, నన్ను, నువ్వు లోపలికి రావయ్యా! అదొస్తుందిలే అంది. అమ్మయ్య ఒక గండం గడిచిందని లోపలికెళ్ళా! 


ఇల్లాలు ఇంట్లోకెప్పుడొచ్చిందో! మళ్ళీ కనపళ్ళా! భోజనాల దగ్గర మెరిసింది, కంచాలెత్తుతూ.ఆ తరవాతెప్పుడో గదిలోకి చేరి నిద్దరోతున్నారా? అడిగింది. లేదన్నా పొడిగా.ఈ మాత్రానికే అంత కోపమా అంది. అబ్బే కోపమేం లేదే అన్నా!పేదవాని కోపము పెదవికి చేటు అన్నది గుర్తు చేసుకుని. నాకు తెలవదేంటీ? అని సాగదీసింది. మొత్తానికి తెల్లారింది, దోమలు కుట్టి చంపుతూంటే, నిద్దరట్టక.


ఉదయమే భోగి తలంటాలన్నారు.వదినగారు తనూ కలిసి,తోడల్లుడికి నాకూ. కాదనలేక పీటమీద కూచున్నా. తలకి వంటాముదం రాసింది, వదినగారు, తబలాలా వాయించేసింది. ఆ తరవాత ఇల్లాలు ఒంటినిండా నువ్వుల నూనె రాసి, నలుగు పిండి రాసింది. నలుగెడతామన్నారు.అమ్మో! అని పరుగెట్టేను. తోడల్లుడు చక్కహా నలుగెట్టించుకున్నాడు. ఏం? అడిగింది ఇల్లాలు. నలుగు పిండి ఎండిపోయింది. నలిస్తే రాదుగాని ఒంటినున్న వెండ్రుకల్లో చిక్కుకుందేమో, నలుగెడితే అంతకంటే నరకం ఉండదని చెబితే ఆపింది. అమ్మయ్య మరో గండం గడిచిందనుకున్నా. ఈ లోగా కుంకుడుకాయ పులుసోసి నా తలని అప్పా,చెల్లీ చెడుగుడు ఆడుకుని, విడతల మీద, మొత్తానికి తలకి రాసిన జిడ్డు వదిల్చేరు. కుంకుడు కాయ పులుసుతో సున్ని పిండి కలిపి ఒళ్ళు రుద్దుకుని స్నానం అయిందనిపించుకుని బయట పడ్డా.  


కూడా, కుట్టించుకుని తెచ్చుకున్న కొత్తబట్టలు కట్టుకున్నా. మావగారికి,  అత్తగారికి దణ్ణం పెడితే మావగారు ఒక ఇరవై రూపాయలు పండగ బహుమతి ఇచ్చాడు, వాటిని ఇల్లాలు ఊడలాకుంది. నవ్వుకున్నాము. పన్నెండయింది, భోజనాలన్నారు, కానిచ్చి లేచేం. వెళ్తానన్నా! అదేం మాట అన్నారంతా! రేపు పండగ కదా అన్నారు కూడా కోరస్ గా. నేను సమాధానం చెప్పేలోగా ఇల్లాలు, "చిన్నంటి  కెళ్ళాలి లే! లేకపోతే ఆవిడకి కోపం వస్తుందంది". ఒక్క సారి నిశ్శబ్డం అయిపోయింది.అంతే కాదు నేనేదో ఘోరం , నేరం చేసినట్టు చూశారందరూ, చాలా ఇబ్బందికరంగా ఉంది, నాకు మాత్రం. ఈలోగా ఇల్లాలే కలగజేసుకుని ''సాయంత్రం నాలుక్కి డ్యూటీ'' అని చెప్పింది. అంతా ఒక్క సారి భళ్ళున నవ్వేసేరు.ఇదేం ఉద్యోగం! పండక్కి కూడా శలవు లేదూ అని బుగ్గలు నొక్కుకున్నారు ఇరుగూ పొరుగూ! పెళ్ళికే,ఒకరోజు రాత్రి  డ్యూటీ   చేసి మరునాడు అంటే పెళ్ళి రోజు వారపు శలవు తీసుకుని, పెళ్ళైన మర్నాడు సాయంత్రం ఉద్యోగానికెళ్ళిన ఘనత కలవాడు మా అయన చెప్పింది ఇల్లాలు.   అటువంటి ఉద్యోగం కూడా ఉంటుందని తెలియని రోజులు, ఎప్పుడూ అరవై ఏళ్ళకితం   మాట.  


9 comments:

  1. // “ నలిస్తే రాదుగాని ఒంటినున్న వెండ్రుకల్లో చిక్కుకుందేమో, నలుగెడితే అంతకంటే నరకం ఉండదని చెబితే ఆపింది.” //

    ఏం గుర్తు చేశారు, సర్. నలుగుని నలుస్తుంటే నిజంగా నరకమే - ఆ పని తల్లి చేసినా, భార్య చేసినా 😒. 

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      సంక్రాంతి శుభకామనలు.
      అది అనుభం ఐతేగాని తెలీదు :)
      కొంతమందికి ఒంటిమీద రోమాలే ఉండవు.
      కొందరికి ఒళ్ళంతా రోమాలుంటాయి. అందులోనూ కొందరికి, ఒక రోమ కూపంలో ఒకటే రోమం ఉంటే కొందరికి రెండు,మూడు, నాలుగు కూడా ఉండచ్చు.వారికి ఒంటికి నూనె రాస్తే బాధలేదుగాని, నలుగు పిండి తడిపిరాస్తే, అది ఎండి పోతుంది,ఒంటి వేడికి. నలిస్తే రాదు, ఎండక పోయినా ఆ రోమారణ్యంలో ఉన్న నలుగు పిండిని నలుస్తుంటే ఒక్కో రోమాన్ని తంటసంతో పీకినంత బాధ కలుగుతుంది, వేరుగా నరకం ఉండదు.ఆ నలిచినది తల్లి,చెల్లి, భార్య ఎవరైనా :)ఆ రోమాలైతే కొందరికి రెండు నుంచి నాలుగంగుళాల పొడుగుంటాయి, అలా కనపడవు రింగులుగా ఉంటాయి కనక.

      Delete
  2. శర్మాచార్య.. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!
      శతంజీవ శరదో వర్ధమానా....... ఆశీస్సులు.
      సంక్రాంతి శుభకామనలు.

      Delete
  3. మీకే నయం శర్మాచార్య.. మా పెళ్ళై మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు..! ఐతే.. మొదటి దసరా.. మొదటి ఉగాది.. తాను చూలాలు.. రెండవ దసరా.. రెండవ ఉగాది.. తాను బాలింత.. మూడవ దసరా.. తాను మరలా చూలాలు.. మూడవ ఉగాది.. తాను మరలా బాలింత.. నాల్గవ దసరా.. నాకు వాసెక్టమి సర్జరి.. ఇహ ఇప్పుడు సంక్రాంతి.. ఫోన్ చేస్తే వాలిపోయింది వారింట్లో.. ఐతే గీతే ఏ పండగ కైనా మరే పబ్బానికైనా ఓ గుడ్డ ముక్కైనా పెట్టిన పుణ్యానికి పోలేదు.. నాకూ లేదు సరి గదా నా సతిమణికీ లేదు.. ఎప్పుడూ లేదు..! పిల్లలనిద్దరు ఎప్పుడైనా వాళ్ళ అమ్మమ్మ ఊరంటే చాలు మూణ్ణాలుగు రోజులు భలే హుషారుగా ఉంటారు.. ఇహ తరువాతి రోజు జ్వరాలు, విరేచనాలు, వాంతులు ఆసుపత్రి కి దారులు పైన ఖర్చు.. నేనే పెట్టుకోవాలి తప్పితే అల్లుడు గారు అంటూ ఏ రోజు ఓ రూపాయి ఇచ్చింది లేదు.. పైగా ముందస్తుగా పిల్లలకై సిరప్ తేలేదెందుకని మా అత్త మందలింపు.. పండగ కాస్త గంభీరమౌతది. తీరా ఇంటి ముఖం పట్టినాక రెండవ రోజు ఇద్దరికి ఆరోగ్యం పుంజుకుంటుంది. ఇది నిత్యం పండుగకు జరిగే తంతు.. (పాపకు రెండేళ్ళ ఎనిమిది నెలలు, బాబుకు పదకొండు నెలలు)

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!
      ప్రతి ఇంట ఇబ్బందులుంటాయి, సద్దుకుపోవడమే జీవితం.

      Delete
    2. అంతే కదా ఆచార్య..! సదా మీ ఆశిస్సులు కోరుతు..!!

      Delete
  4. ఓ యాభై, వందేళ్ళ తర్వాత మీ ఈ రచనలు మరో బారిస్టర్ పార్వతీశం కథలు. పాత జీవన విధానాలు తెలిపే చరిత్ర పాఠాలు.

    ReplyDelete
    Replies
    1. మహేశుడు గారు,
      అంతేనంటారా? :)
      ధన్యవాదాలు.

      Delete