ఎలపట దాపట.
ఎలపట దాపట అనే పదాలకి అర్ధం నేటి కాలంవారికి తెలిస్తేనే విశేషం. ఈ పదాలు నిఘంటువులకి కూడా ఎక్కినట్టవుపడటం లేదు.
ఎలపట దాపట ఎడ్లదోలుకో
చాలు తప్పక కొండ్ర వేసుకో
ఇత్తనమ్ములిసిరిసిరి జల్లుకో
సినిమాలో కొసరాజువారి గీతంలో పల్లెటూరి వాసనకొడుతున్న మాటలు.🤣
ఇప్పుడెందుకీ గోల అనికదా విసుగు చూపుతున్నారు. చిత్తగించండి.
సుగర్ వ్యాధి ఉన్నవారికి మెట్ఫార్మిన్ వాడక తప్పదు. అలా మెట్ఫార్మిన్ వాడినా,వాడకపోయినా అవకరాలు తప్పవు. కళ్ళు,కాళ్ళు పోవడం అందులో కొన్ని. ఇప్పుడివన్నీ ఏకరువుపెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కళ్ళు పోవడం అంటే కనపడకపోవడం. ఇది కాట్రాక్టుతో మొదలవుతుంది.
ఇలా చాలా సంవత్సరాలు ఎలపటలో కాటరాక్టు పెరగడం తో ఒక కంటితో ఇబ్బంది పడలేక ఎనిమిదో పదిలో పుట్టినరోజు బల్లేక్కేను,అంటే మా పల్లెటూరి భాషలో సర్జరీ చేయించుకుని కళ్ళజోడేసుకుని కాలక్షేపం చేసా, దాపటకన్ను మొండికేసి ఉన్నదే కాని ఎలపటకన్ను మొండికెయ్యడం ప్రారంభించింది. డాక్టర్ గారి దగ్గరికిపోయా. ఆయన చూసి బల్లెక్కండి తప్పదు అని చెబుతూ ఈ చిన్నకత చెప్పేరు.
మీలాటి రైతు ఎడ్లని బండికి అరకకి కట్టి పని చేయించుకునేవాడు. ఎలపట మొండి కేసింది. భారం దాపట మీద పడి కొంతకాలాని అదీ మొండి కేసింది. దాంతో బండాగిపోయింది. ఎలపటని పనిలో తర్ఫీదిచ్చి ఉపయోగించుకోడం మొదలెట్టేడు. పని జరుగుతోంది కదా అని అశ్రద్ధ చేసేడు. దాపటకి తర్ఫీదివ్వక వదిలేసేడు. దాంతో రెండెద్దులూ పని చెయ్యక బండి మొండికి పడిపోయింది. అలా కాకుండా ఉండాలంటే బల్లెక్కాల్సిందే,అన్నారు. భయపడుతున్నారని కోడలమ్మాయి కొస ఇచ్చింది. దానికి డాక్టర గారు మొదట బల్లెక్కినప్పుడే భయపడలేదు కదా! మరి ఇప్పుడెందుకూ భయం అన్నారు. తేరుకోగలనా అనేదే భయంసార్,చెప్పేసా! ఓస్! అదా భయం లేదు,నేనున్నగా అన్నారు. బలెక్కేసేను.
సర్జరీకి మేడం వచ్చారు. ఇదేమిరా అనుకున్నా. బల్లమీద బుట్టలో తలపెట్టుకు పడుకున్నా. రోటిలో తలదూర్చి రోకటిపోటుకు వెరువ తగునా అనే సూక్తి గుర్తు చేసుకున్నా. సర్జరి మొదలుపెడుతూ మేడం ఇలా లైట్ కేసి చూడండి, చేతులు పక్కనపెట్టుకోండన్నారు. తెలిసినదేగా, అలాచేస్తూ నాకు తెలియకనే కను రెప్ప వాలుతోంది అన్నా! అదా నేను చూకుంటాలెండి అని భరోసా ఇచ్చారు. ఇంకేం! ధైర్యం వచ్చేసింది. పది నిమిషాల్లో బల్లదిగమన్నారు. రెండు చేతులూ ఎత్తి చూపు ప్రదాతకి నమస్కారం చేస్తే, కన్ను బాగుంది భయంలేదన్నారు. ఇంటికెళ్ళచ్చన్నారు. మరునాడు డాక్టర్ గారు కన్ను చాలాబాగుంది. మీకెలా ఉందని అడిగితే చాలా బాగుందని చెప్పేను. జాగ్రత్తలు చెప్పి కంటిలో చుక్కలేసుకోమని ఇచ్చి పంపేసేరు. 20 రోజుల తరవాతెళ్ళేను. చెక్ చేచేసేరు, కళ్ళ జోడు కొత్తదానికి రాసిచ్చారు. వెలుతురు చూడడం కష్టంగా ఉందంటే కంటిలో మరికొద్దికాలం చుక్కలేసుకోమన్నారు. వెలుతురుకు కన్ను అలవాటు పడుతుందని చెప్పడంతో మరో వారం అన్నిటికి దూరంగా ఉండిపోయాను. కొత్త కళ్ళజోడు రావడానికి కొంత ఆలస్యమయింది. నేడు క్షురకర్మచేయించుకుని నెత్తిననీళ్ళు పోసుకుని ఇలా తయారయ్యాను.
గత రెండు నెలలకితం శ్యామలీయంవారు రెండు కళ్ళూ విజయవంతంగా సర్జరీ చేయించేసుకున్నారు. అలాగే విన్నకోటవారు, మొదటికన్నుసర్జరీ తరవాత, కొద్ది ఎక్కువ విరామం తరవాత రెండవకన్ను చేయించుకున్నారు. విజయవంతంగానే ఉన్నారు. కళ్ళజోదుకు మరువారం వెళతారు.
నా కళ్ళు ఇరవైల్లోనూ మనసు ముఫ్ఫైల్లోనూ వయసు తొమ్మిది పదుల్లోనూ నడుస్తోంది. అంతా కొత్తగా ఉంది. 🤣
ఇదీ ఎలపటదాపట కత.
శుభమస్తు
with new glasses.

నాకు కళ్ళకు జూన్ జూలై నెలల్లో చేసారు - సంవత్సరం క్రిందట. శారద అంత అనారోగ్యపరిస్థితిలోనూ నాప్రక్కనే ఉండి చేయించింది. ఆవీల్ ఛైర్ మీదే గంటలుగంటలు ఓపిగ్గా కూర్చుంది పాపం. అది సరే, కానీ అప్పుడే శిరస్నానం చేసారే! కొంచెం ఆగవలసిందేమో. చుక్కల మందులు నెలవరకూ వేసుకోవాలి కాని అవసరం ఐతే మరో పక్షంరోజులు వేసుకోవాలి. ఈరోజుల్లో కేటరాక్ట్ సర్జరీకి నొప్పి అంటూ ఏమీ ఉండదస్సలు.
రిప్లయితొలగించండిమీరన్న మాటల్లో చెప్పాలంటే, నాకు మెదడు ముఫ్ఫైలోనూ ఆరోగ్యం అరవైలోనూ మనసు తొంభైలోనూ ఉన్నట్లుగా తోస్తున్నది. ఇంకా ప్రోగ్రాములు వ్రాసుకుంటూ ఉన్నాను, మందులు మితంగానే వేసుకుంటున్నాను. కాని ప్రపంచం పట్లు విరక్తి అపరిమితంగా ఉంది.
రిప్లయితొలగించండిశ్యామలీయం9 ఆగస్టు, 2026 9:32 AMకి
తొలగించండిశ్యామలీయం9 ఆగస్టు, 2026 9:36 AMకి
శ్యామలీయం వారు,
మీ కళ్ళకి శారదగారుండగానే సర్జరీ జరిగిందన్నమాట మరచాను. మా డాక్టర్ 21 రోజుల తరవాత శిరస్నాన చేయమన్నారు,నేనే నెల దగ్గరగా చేసాను. తల గూళ్ళబుట్టలా తయారయింది. 🤣 నొప్పి లేదుగాని ఎక్కువవెలుతురు భరించడం ఇప్పటికిన్నీ కష్టంగానే ఉన్నది. చుక్కలు మరో నెలదాకా వేసుకోమన్నారు,నడుస్తున్నాయి. బండి మెల్లగా నడుస్తోంది.
మీరూ ముసలంటే ఎలా సార్! ఎనిమిదో పదికి మొదట్లో ఉన్నవారు కదా! నేనో తొమ్మిదో పదిలోకి పశ్చిమార్ధానికొచ్చేసేను కదా! నేనేమనుకోవాలి? బండి నడపండి,అంతే,వయసు గురించి ఆలోచన వద్దు. అసలు జీవితమంతా ఇప్పుడే అనగా తొమ్మిదో పదిలోనే ఉందిట. 🤣🤣 ఎంజాయ్ సార్!
ధన్యవాదాలు
అంతా ఓల్డు ఆసాముల సాముగరిడీల్లా వున్నాయ్ :)
రిప్లయితొలగించండినారదా
వింటున్నావా ?
జిలేబి
Zilebi9 ఆగస్టు, 2026 3:23 PMకి
తొలగించండిజిలేబి,
ఇది నీకూ నాకూ కొత్తకాదు. మారకు సుమా! నీ నారదదుడు స్వామితోపాటు యోగ నిద్రలోకి జారుకున్నారట. తెలియలేదా? ఎంజాయ్! ఎంజాయ్!
ధన్యవాదాలు.
ఆపరేషన్ సూపర్ సక్సెస్ అయ్యి నందుకు శుభాకాంక్షలు.. మరెన్నో టపాలు మీ నుండి రావాలని చూస్తున్నాం
రిప్లయితొలగించండిsrinivasrjy12 ఆగస్టు, 2026 2:02 PMకి
తొలగించండిశ్రీనివాస్ జీ,
ఆపరేషన్ సూపర్ సక్సెస్,అనుమానం లేదు. రికవరీ లేట్ గా ఉంది. ఇప్పటికిన్నీ ఎక్కువవెలురు ఇబ్బంది పెడుతోంది. రాయాలనే ఉంది,కాని బద్ధకం, నెలనుంచి అలవాటు తప్పడం మరో కారణం. నాలుగు రోజులుగా నెట్ సర్వీస్ తొలగించాల్సివచ్చింది. నిన్న సాయంత్రమే పునరుద్ధరించుకున్నాము. వేడి ఎప్పటిలాగానే ఉంది. దేశమంతా పట్టణాలలో వర్షం ముంచుతోంది,మా దగ్గర చుక్క కనపట్టం లేదు. ఎప్పుడేనా కొద్ది చిందిస్తే అక్షతల్లా రాలుతున్నాయి,చినుకులు. ఆగస్టు నెల సగం గడచింది,చినుకులేదు. పడ్డ నాలుగు చినుకులూ వేడి మరింత పెంచుతున్నాయి,అంతే
ధన్యవాదాలు.