Monday, 15 September 2025

దయ్యం.

 దయ్యం.

దయ్యమా,దెయ్యమా ఏది సాధువు? తెలీదు.

దెయ్యం ఏంటో తెలుసుకొవాలనుకున్నా. కమేని అడిగా,అందమైన దయ్యం అని,అదే మొదటి ప్రశ్న.మొగాడి ఫోటో చూపించింది. కమే మగాళ్ళే దయ్యాలనుకుంది,అదే అడిగా ఆకుకి అందని పోకకి పొందని సమాధానం చెప్పింది.

మన తెనుగు సాహిత్యం లో చూదామని బయలుదేరా! దయ్యం/దెయ్యం ప్రయోగం నాకు వెంటనే ఇక్కడ స్ఫురించింది,

బ్రతుకవచ్చు నొడల ప్రాణంబు లుండిన

బ్రతుకు గలిగెనేని భార్య గలదు

బ్రతికితీవు భార్యపట్టు దైవ/దయ్య మెరుంగు

వలదు వలదు చైద్య! వలదు వలదు.

ఇక్కడా నా అనుమానం తీరలేదు. ఆంధ్రభారతి రెండు వాడుకలో ఉన్నాయంది. హా హతవిధీ! దెయ్యానికెన్ని తిప్పలొచ్చాయనుకున్నా. దెయ్యం ఇంటర్నేషనల్, అన్ని దేశాల్లోనూ దెయ్యాలున్నాయష. దెయ్యమూ లేదు,భూతమూ లేదు, అదంతా మానసిక వికారం,కొంతమంది బతికేందుకు చేసిన సృష్టి అన్నారు, మేధావులు.  ఏమోగాని దెయ్యం కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపార పెట్టుబడి అన్నారు,మరో మేధావి. ఏంటో మరింత చిక్కుబడిపోయింది. 

పోనీ సినిమా లో చూదామనుకున్నా! మొదటగా దయ్యాన్ని పరిచయం చేసినది హిందీ సినిమా అనుకుంటా, ఒక సినిమాలో పేరు గుర్తులేదు, దెయ్యం ఆడది, మధుబాలంత అందంగా ఉంటుందని చెప్పేరు. అదేమో తెలీదుగాని దెయ్యానికి కూడా దేశ భేదం,భాషా భేదం,లింగ భేదం  ఉంటుందన్నారు,మరికొందరు. తెనుగు సినిమా దెయ్యం మరీ వికృతంగా  ఉంటుంది,దెయ్యాల్లోనూ మంచి దెయ్యాలు,చెడ్డ దెయ్యలూ ఉన్నాయట. బోల్డన్ని కతలున్నాయంట. 

దయ్యాలో రకాలున్నయట. అన్ని దయాలూ కనపడవట గాని ఒక్క దయ్యం మాత్రం కనపడుద్దట, అదే కొరివి దయ్యం. మిగతా దయ్యలు ఎక్కదబడితే అక్కడే ఉంటాయటగాని కొరివిదయ్యం మాత్రం శ్మశానంలోనే ఉంటదట. 

ఎంతజెప్పినా దయ్యం దయ్యమేగాని దెయ్యం కాదన్నాడు మా సుబ్బరాజు. అరధంగాలేదు 

Wednesday, 10 September 2025

నేటి అంతర్జాతీయ రాజకీయాలు.

నేటి  అంతర్జాతీయ రాజకీయాలు.

(నిన్నటి తరువాయి)


ఈ నవెర్రో అనే అమెరికావాసి, ట్రంప్ గారు, అరెరె! తప్పుజేసి రెండు దేశాలని వ్యాపారంలో చైనాకి వదులుకున్నానే అనుకుంటున్నా, మెత్తబడినా, ఈయన  ఇంకామాటల ఈటెలు విసురుతూనే వున్నారు. రెండు దేశాల సంబంధాలూ పూర్తిగా బెడిసికొట్టేలాగా. పాపం ఆయనకు ఇంత చిత్త విభ్రమం కలగడానికి కారణం భారత్ ఆయనతో సమానంగా వాక్కలహంలో దిగకపోవడం. ఆయన మాత్రం కలహంలో పల్లెటూరి స్త్రీలా రెచ్చిపోతూనే ఉన్నారు.


ఇక రెండో పక్క చూదాం. ముగ్గురు ఆసియావాసులు,బలమైన దేశాలు ఒకటైతే తన ఉనికికే ప్రమాదమన్నది అమెరికా బాధ,అర్ధం చేసుకోవచ్చు. కాని రష్యా,భారత్,చైనాలు ఒకమాటమీదకొస్తే చాలా ప్రమాదం, అందుకుగాను మిత్ర భేదం కొసం అమెరికా ప్రయత్నించడం సర్వ సహజం. భారత్,చైనా సంబంధాలు అంత సవ్యం లేకపోవడం కారణం. మొన్నటి బంధం, ప్రస్తుతం ఒక ఇబ్బందిని గట్టెకేందుకు చైనా,భారత్ లు తీసుకున్న నిర్ణయం. ఇది ఇతర రంగాలకు కూడా పాకి మిత్రత్వం చొరబడితే, రష్యా,చైనా,భారత్ లని మించగల శక్తి భూమి మీద లేదు.కాని ఇది సాధ్యమా అన్నదే కొచ్చను.


నేపాల్ లో ఖాట్మండూ మేయర్ ని అమెరికా రాయబారి కలసిన తరవాత,దేశంలో అవినీతి పేరిట యువత అల్లర్లు,సోషల్ మీడియా బేన్,కొద్ది సేపటికే బేన్ రద్దు,వామపక్ష ప్రధాని శర్మఓలి రాజీనామా,తదుపరి, సుప్రీం కోర్ట్,పార్లమెంటును తగలబెట్టిన యువత, ముఖ్యుల ఇళ్ళను తగలబెట్టిన యువత,మొత్తం మీద 19 మంది మరణం. అర్ధమవుతోందా! నిద్రపోకండి. అనూహ్యంగా శాంతికోసం సైన్యం విజ్ఞప్తి.

 అమెరికన్ డీప్ స్టేట్ తనపని మొదలెట్టింది.  తరవాత కత వెండి తెరపై చూడచ్చు. భారత్ బహు పరాక్! అందోళనలు లేవదీసేవారిని ఒకకంట కనిపెట్టండి.  

చౌయన్ లై -నెహ్రూ లు కలసి హిందీ చీనీ భాయ్,భాయ్ అని హోరెత్తించి,పంచశీలని ఊదరగొట్టి, భారత్ కు వెన్నుపోటు పొడిచిన చరిత్రగలది చైనా. నేటికిన్ని సరిహద్దులు కొన్ని చోట్ల నిర్వచింపబడలేదు. పాక్ తను ఆక్రమించిన కాశ్మీర్ లో కొంత భాగం చైనా కి ధారదత్తం చేసింది, 1962 లో జరిగిన యుద్ధం లో కొంత భాగం ఆక్రమించుకుంది. నెహ్రూ గారు ఆ ప్రాంతంలో గడ్డి కూడా మొలవదని శలవిచ్చారు,నాటి పార్లమెంటులో. నిన్నమొన్న సరిహద్దులలో ఆక్రమణ దానిపై సైనిక చర్య జరిగింది.    

    ఆనాటి నుంచి యుద్ధం లేదంటారు గాని నిత్య కలహం తప్పలేదు.పంచ శీలలో మొదటిది, మరో దేశం ఆక్రమించకూడదు,రెండు, అంతర్గత వ్యావహారాలలో జోక్యం కూడదు. కాని ఈ రెండు శీలలే మొదట ఊడిపోయాయి. పాపం నెహ్రూగారు ఈ బెంగతోనే కాలం చేసేరు. ఇందిరా గాంధీ అధికారంలో కొచ్చిన తరవాత భారత్ లో వీరి అనుచరులు చర్యలకు పట్టపగ్గాలే లేకపోయాయి. నేటికీ సాయుధంగా ప్రభుత్వంపైన దాడి చేసేవారు కొందరు కొనసాగుతూనే ఉన్నారు. అంతేనా మరో రకం అర్బన్ నక్సల్స్ కోర్టులలో కూడా కొనసాగాలని చూస్తున్నారు,నక్సల్ అభిమానులు రాజకీయపదవులకూ ఎగబాకాలనుకుంటున్నారు. ఈ దేశంతో స్నేహం కొనసాగేనా? అనుమానమే! ఇది అవసర స్నేహం కావచ్చు. నమ్మదగిన స్నేహం కాదేమో!!   

ఈ దేశం తమదేశం నుంచి కారకోరం ద్వారా రోడ్డు నిర్మించి గిల్గిట్ చేరింది. అక్కడనుంచి ఆరోడ్డును గ్వాదర్ రేవుకు చేర్చి దాని ద్వారా యూరప్,ఇతరదేశాలతో వ్యాపారం చేయాలని చైనా ఊహ,అంతేకాదు అరేబియా సముద్రం ప్రాంతాలపై ఆధిపత్యం సాగించాలని కోరిక .  ఐతే ఈ రోడ్డు బలూచిస్థాన్ ద్వారా గ్వాదర్ చేరాలి. స్వతంత్ర పిపాసులైన బలూచ్ లు  దానిని అడ్డుకుంటున్నారు. జరిగేలా లేదు. ఈ రోడ్డు పని చైనా ప్రస్థుతం ఆపేసింది. చైనా ఎప్పుడూ పాక్ తో కలసి భారత్ నాశనం కోరుకున్నదే,మొన్న జరిగిన దానితో సహా!ఎప్పుడూ భారత్ కు వ్యతిరేకంగా పాక్ కు సహాయం అందించినదే! ఈ దేశానికున్న మరో కోరిక చైనా నుంచి భూటాన్ ప్రాంతం ద్వారా చిన్నదైన చికెన్ నెక్ ప్రాంతాన్ని ఆక్రమించి బంగ్లాదేశ్ ద్వారా చిటకాంగ్ చేరి వ్యాపారానికి ఉపయోగించుకోవాలని కోరిక. ఇదే పాపం బంగ్లా దేశపు యూనిస్ చైనాకి చెప్పింది. ఇదే చైనా ప్లాన్,బంగ్లా ప్లాన్, ఇప్పుడు పాక్ కూడా దీనికి వంత పాడుతోంది. షర్జీల్ ఇమాం చెప్పిన పథకం ఇదే!  అసోం ముఖ్యమంత్రి ఒక చికెన్ నెక్ ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తే రెండు చికెన్ నెక్ లున్నాయి,మీకు. దాంతో మీరు ఖతం,ఒళ్ళు జాగర్తపెట్టుకోండని హెచ్చరిక చేసేరు. బంగాళాఖాతం ప్రాంతాన్ని తన నౌకా బలం ద్వారా అధికారం చేయాల నీ కోరిక. 


ఈ సందర్భంగా ఒక  కత,భారతం నుంచి, చిన్నదిగా చెబుతున్నాను.భారతంలో ఉన్నదే ప్రపంచంలో ఉన్నది. ఈ కత నేటి రాజకీయాలకి సరిపోతుందా ఆలోచించండి.

అడవిలో ఒక చెట్టుకింద బొరియలో ఒక ఎలక నివాసం. ఆ చెట్టుపైన ఒక పిల్లి నివాసం, మరో కొమ్మన గుడ్లగూబ నివాసం. రోజులు గడుపుతుండగా ఒక రోజు వేటగాడు తన కుక్కలతో వచ్చి,పిల్లికోసం ఒక వల పన్ని పోయాడు. వేటకి వెళ్ళిన పిల్లి వస్తూ వలలో చిక్కుకుంది. చిక్కులు తొలగించుకోవాలనుకున్నకొద్దీ ఎక్కువ అవుతున్నాయి.  అరుస్తోంది,సహాయం కోసం. ఈ లోగా ఎలుక బయటకుపోయినది తిరిగొస్తూ పిల్లిని వలలో చూసింది. పిల్లి ఎలుకను పిలిచి చాలాకాలంగా మనం పక్కపక్కల ఉంటున్నాం. ఇప్పుడు నేను ఆపదలో ఉన్నాను. వలకొరికి నన్ను రక్షించు, ఎప్పటికీ నిన్ను రక్షిస్తూ ఉంటానని మాటిచ్చింది. ఎలుక ఆలోచించి పిల్లిని నమ్మచ్చా! ఇప్పుడు ఆపదలో ఉంది కనక ఇలా అంటోంది,ఆపద గడిస్తే మీద పడదా! అని ఆలోచిస్తుంటే పిల్లి ఎలక ఆలోచన పసికట్టి అటువంటి అనుమానాలు పెట్టుకోకని బతిమాలుతూ ఉంది. చెట్టు మీద గుడ్లగూబ ఇది చూస్తూ వీళ్ళిద్దరూ స్నేహితులైపోతున్నారా? ఎలకని ఎప్పటికైనా మింగుదామనుకున్న నాది కలేనా,చూదాం అనుకుంటూ ఉండగా,  ఎలుక వలకొరకుతాననీ చెప్పలేదు,కొరకననీ చెప్పలేదు,   వలచుట్టూ తిరుగుతూ  కాలక్షేపం చేస్తోంది. పిల్లికి గాభరా పెరిగిపోయింది, వేటగాడు వస్తున్నాడు, కుక్కల అరుపులు   వినపడుతున్నాయి, వలకొరుకు, నన్ను రక్షించు అని తొందరపెట్టింది. వేటగాడు కనుచూపు మేర కనపడగానే ఎలుక వల కొరకడం మొదలెట్టింది. కొద్దిదూరంలో వేటగాడుండగా వల పూర్తిగా కొరికేసింది, పిల్లి బతికేను జీవుడా అనుకుంటూ చెట్టెక్కేసింది, ఎలుక బొరియలొకి పారిపోయింది. జరుగుతున్నది చూస్తున్న గూబ నిరాశపడిపోయింది.   

       అంటే నమ్మదగిన మిత్రుడు రష్యా,అమెరికా,చైనా ఇద్దరూ ఒకలాటివారే. ఇద్దరూ స్వార్థపరులే ఆక్రమ దారులే. వ్యాపారంతో ఆక్రమణ చేయాలని అమెరికా,భూభాగం ఆక్రమించాలని చైనా పన్నాగాలు. భారత్ కి  ఎప్పటికీ అలీనవిధానమే మంచిది. యూరప్ తో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కుదరబోతోందని చాలామంది చంకలు గుద్దుకుంటున్నారు. ఎవరిమీదా అతిగా ఆధారపడకూడదు. అరాచక చర్యలన్నిటికీ మూలం యూరప్,ఎవరినీ  నమ్మద్దు. వ్యాపారం వ్యాపారమే, వ్యవహారం వ్యవహారమే! పేకాట పేకాటే పెద్దన్న పెద్దన్నే! అదీ సంగతి

శలవు.  

      

Tuesday, 9 September 2025

జరుగుతున్న అంతర్జాతీయ....

 జరుగుతున్న అంతర్జాతీయ....

(నిన్నటి తరువాయి....)


రష్యాతో చమురు వ్యాపారం చేసి భారత్ డబ్బు సంపాదించి రష్యా యూక్రైన్ యుద్ధానికి తోడపడుతోందని అమెరికా అంటోంది. యూరప్ దేశాలూ వంత పాడుతున్నాయి. అంతేకాదు రష్యాతో వ్యాపారం చేసేవాళ్ళని శిక్షిస్తామనీ అంటున్నారు. జయశంకర్ గారు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఎక్కడ? రష్యానుంచి చమురు ఇతర చమురు ఉత్పత్తులూ యూరప్ కొనడం మానేయచ్చుగా! ఎందుకు మానేయటంలేదు? అమెరికా రష్యాతో వ్యాపారం మానేసిందా? ఎందుకు చేస్తోంది ఇంకా?  భారత్ కొనే ఆయిల్  సొమ్ముతోనే రష్యా యుద్ధకర్చులు సరిపోతున్నాయా? ఇది చిన్నప్పుడు చదువుకున్న గొర్రెపిల్ల తోడేలు కతలా ఉంది,అదే గుర్తొస్తోంది.    


అసలు రష్యా యూక్రైన్ మధ్య గొడవకి కారణం ఎవరు? యూక్రైన్ లో జలనిస్కీని గద్దెనెక్కించిందెవరు? ఆ తరవాత జలనిస్కీ నాటో లో చేరతామని మొదలు పెట్టడం ఎవరి ఆలోచన? యూక్రైన్ నాటోలో చేరడమంటే శత్రువును ముంగిటిలోకి తెచ్చుకోవడం కాదా, రష్యాకు. నాటో లో చేరను అని ఒకమాట చెప్పు యుద్ధం ఆపేస్తానంటున్నదే రష్యా! అసలు అమెరికా యూక్రైన్ లో యుద్ధం ఆగాలని ఎందుకు అనుకుంటోంది? ఇప్పటికి జరిగినయుద్ధంలో రష్యా యూక్రైన్లో తూర్పుభాగం ఆక్రమించుకుంది. యుద్ధం ఆగితే, ఆ భాగాన్ని రష్యా వదిలేస్తే, ఆ భాగంలో ఉన్న rare earths అన్నిటిని జలనిస్కీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం తను వశం చేసుకోవాలని కాదా? మోడిగారు చెబితే పుతిన్ గారు విని యుద్ధం మానేస్తారని అమెరికా భ్రమ పదటం చిన్నపిల్లల మస్తత్వం కాదా? ఇదో అంతులేని కత. అమెరికన్ డీప్ స్టేట్ కి కావలసింది అశాంతి,యుద్ధం, తామనుకున్నట్టు జరగాలంటే ప్రభుత్వాలను కూలకొట్టడం కొత్త విద్య కాదు. భారత్ లో మోడీ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకుంటే కుదరలేదు,ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. భారత్ ప్రజలు హెచ్చరికతోనే ఉన్నారు.   భారత్ తనకు ఏది మంచిదో నిర్ణయించుకునే హక్కు ఉంది. మాతో ఉండవలసిన భారత్ చైనా,రష్యాలతో ఉండడమే అనడం జాత్యహంకారం చూపించుకోడం కాదా?  అవసరాన్ని బట్టి అందరితోనూ కలవడమే భారత్ విధానం.  

 సశేషం.....


Monday, 8 September 2025

అంతర్జాతీయ రాజకీయాలు

 అంతర్జాతీయ రాజకీయాలు


అంతర్జాతీయ రాజకీయాలు ఇంత వేగంగా జరుగుతుండడం ఇదే మొదటి సారేమో అనిపిస్తుంది. 

ట్రంపుగారు రెండో సారి గద్దెనెక్కేకా అరు నెలల్లో ప్రపంచ రాజకీయాలనే ఒక కొలిక్కి తెచ్చేసినట్టుంది. ముఖ్యంగా కనపడుతున్నది, ఆసియాలోని పెద్ద దేశాలూ బలమైన దేశాలని ఒకతాటికి తెచ్చినట్టుంది. భారత్ చైనాల మధ్య సంబంధాలు తెగిపోలేదు,చెడిపోలేదుగాని గొప్పగా మాత్రం లేవు, చైనా ప్రెసిడెంట్ గత నవంబర్ డిసెంబర్ నెలల్లో  భారత్ రాష్ట్రపతికి ఒక ఉత్తరం  రాయడంతో మెరుగుపడటంకి ఊపందుకుంది. భారత్ రష్యా సంబంధాలు ఒకప్పుడు కింది స్థాయికి చేరిపోయాయనుకున్నపుడు కూడా చెడ్డమాటలు వినపడలేదు. అంతే కాదు ఎప్పుడూ భారత్ రష్యాని అంతర్జాతీయంగా వెనకేసుకునే వచ్చింది. నిజానికి ఈ పని ఒకప్పుడు రష్యా భారత్ కు చేసింది. రష్యా భారత్ సంబంధాలు యూక్రైన్ రష్యాల మధ్య యుద్ధంతో మరింత మెరుగు చూపాయి. మొన్న చైనాలో జరిగిన SCO తో భారత్-చైనా, భారత్ రష్యా సంబంధాలు మెరుగునపడ్డాయి. వీటితో పాటు మరికొన్ని దేశాలూ అన గా బ్రెజిల్, S. ఆఫ్రికా పాకిస్థాన్,టర్కీ,అజర్బైజాన్, మరికొన్ని దేశాలు కలవడం అమెరికాకి వెర్రెక్కించింది. కారణం, ఈ మూడు దేశాలూ,వీరితో మరికొన్ని దేశాలూ తమ వ్యాపారాన్ని రూపాయలలో చేసుకుంటున్నాయి,డాలర్ తో కాక. ఇది డాలర్ కి పెద్ద విఘాతం కల్పించేదే! అందుకే అమెరికా భారత్ మీద విషం చిమ్ముతోంది. ఇంకా చిమ్ముతానంటోంది. టాక్సులు పెంచడమే కాక ఇతర చర్యలూ తీసుకుంటాము,మా మాట వినకపోతే అని మొహమాటం లేకుండానే చెబుతున్నారు. భారత్ దేనికీ అతిగా స్పందించకపోవడం అమెరికాకి మరింత వెర్రెక్కించింది.

 సోషల్ మీడియాలో కూడా అమెరికా వ్యతిరేకంగా మాటాడినవాళ్ళకి వీసాలు ఇవ్వమనీ చెబుతున్నారు,ఇదేమో! !  

ఇదే మరే దేశమైనా ఐతే మీ దేశంలో Freedom of speech  లేదు అని చెబుతారు. ఇదేమీ? ఇంతేనా ఈ దేశం లో లింగ వివక్ష, వర్ణ వివక్ష లేదు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వారుండచ్చంటారు, అదే నోటితో మొన్న దేశంలో బొట్టు పెట్టుకున్న స్త్రీ, దేశపౌరురాలు అటార్నీ ఐతే ఎంతంత మాటలు మాటాడేరు? వివేక్ రామసామి పోటీ చేసినప్పుడు ఏం మాటాడేరు?     వాన్స్ భార్యకి , భారతీయ  మూలాలుంటే ఏం మాటాడేరు? కమలాహేరిస్ కి భారత మూలాలున్నందుకు ఏం మాటాడేరు  మేమంతా కళ్ళు మూసుకునిలేము,కళ్ళు మూసుకుపోయీ లేము.  మొన్న నీ మధ్య పీటర్ నవార్రో మాటాడినమాటలెంత గొప్పగా ఉన్నాయి? మరొక మహానుభావుడు భారత్ టుకడే టుకడే గేంగ్ లీడర్లా మాటాడేడు కదా! మరో పెద్దమనిషి మీ ఎకానమీని పాడుచేసేస్తామని చెప్పలేదా! ట్రంప్ మహా శయులే మీది,రష్యాది చచ్చిన ఎకానమీ అనలేదూ? అమెరికా తరవాత కాలంలో భారత్ తో వ్యాపారం చేసినా వ్యవహారం చేసినా,ఇప్పుడు జరిగినవి మరచిపోతారా? ఇదివరలో కూడా భారత్ ఆపద సమయాల్లో శత్రువుతో కూడినదికాదా,ఈ అమెరికా?  

ప్రపంచంలో ఏదేశంతోనూ భారత్ కి వైరం లేదు. కాని భారత్ మా శత్రుదేశమని ప్రకటించుకున్న పాక్ కి కూడా మొన్న సింధుజలాల  ఒప్పందం నిలుపుదల చేసినా,  వరద రాబోతోంది, నీరు కిందకి జాగ్రత్తగా వదులుతున్నాము, ఇప్పటికే మీ దేశం వరదల్లో ఉన్నదని చెప్పి, కబురు చేసింది భారత్, చెప్పవలసిన అవసరం  లేకపోయినా,మానవతా దృష్టితో చెప్పింది. 

ఆ దేశం  ఘోషయాత్రలో దెబ్బలుతిని, ధర్మారాజుచేత విడిపింపబడి, మంచిమాటలు చెప్పించుకుని యుద్ధానికి దూరంగా పోయి గుడారం వేసుకుని ఉన్నవాడి దగ్గరకి, యుద్ధం నుంచి పారిపోయిన కర్ణుడు ఓదారుస్తూ, పాండవులు నీ దేశపౌరులు   రాజు కష్టంలో ఉన్నపుడు రక్షించడం వారి విధి,ఎందు తెగ బాధ పడిపోతావంటాడు, అలా వాళ్ళు కాఫిర్లు, వాళ్ళు మేము కష్టంలో ఉంటే చెప్పాల్సిందే, లేకపోతే సింధునదిలో నీటికి బదులు భారతీయుల రక్తం పారుతుందనీ అనగలరు. అటువంటివారితో భారత్ కు వ్యతిరేకంగా ఎన్ని సార్లు అమెరికా అనుకూలంగా ప్రవర్తించలేదు. ఇలా చెప్పుకుంటూపోతే ఇదో పెద్దగాథ. ఏదీ మరచిపోము. 


అన్ని దేశాలకంటే చాలా తక్కువ పన్నులతో తప్పించుకున్న సింగపూర్ ప్రధాని మాటాడుతు, ఏమన్నారు, ఇప్పుడు తప్పించుకున్నా,ఏరోజు ఏం జరుగుతుందో చెప్పలేం,కనక మనం మన ఉత్పత్తులకు వేరు,వేరు దేశాలని వెతుక్కోవడం మంచిదని కదా! అంటే పిచ్చివాడి చేతిలో రాయిలా ఉన్నది వ్యవహారం అన్న మాట కాదా? చాలా చిన్నదేశం బుర్కినాఫాసో, బహుశః చాలామందికి పేరుకూడా తెలియకపోవచ్చు,ఆ దేశ ప్రెసిదెంట్ మాట పశ్చిమదేశాలు దేనికైనా లెక్చర్లిస్తాయి,వారు మాత్రం ఆచరించరు. అందరినీ నీచంగా చూస్తారు. అదే ఆసియా దేశాలలో భారత్ వారు మాత్రం విషయాన్ని వివరిస్తారు,సమానదృష్టితో  చూస్తారు,సాయం చేస్తారని చెప్పలేదూ! చాలా దేశాలు ఎదురు చెప్పలేక తలవంచుకున్నాయి, అలా మేము చెప్పిన మాట వేద వాక్యం విని తీరాలి,అన్న దానికి బ్రెజిల్ ఎదిరిస్తే 50% పన్నులెయ్యలేదా? జపానుకు 15%  సుంకాలు వేసిందెందుకు? ఆ దేశపు మిగులంతా అమెరికాలో పెట్టుబడి పెట్టడమనే షరతు కదా! వచ్చిన లాభంలో కూడా వాటాకావలన్నారుగా!  MAGA (make amerikaa great again) ఎలా అవుతుంది? అంటే మరొకరు చెడి అమెరికాను గొప్ప చేయాలా? ఏడూళ్ళు చెడితేగాని ఏడిద కాలేదని మా దగ్గర చిన్న నానుడి చెబుతారు.           

సశేషం......   

Sunday, 7 September 2025

దాయాదికి కంటిలోనూ పాముకి.......

 
దాయాదికి కంటిలోనూ పాముకి.......






తలనుండు విషము ఫణికిని

వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్

దలదోక యనక యుండును 

ఖలునకు నిలువెల్ల విషముగదరా సుమతీ!


దాయాదికి కంటిలోనూ పాముకి పంటిలోనూ విషం.

చవక కొననివ్వదు కరువు తిననివ్వదు.

నలుగురు నడిచే దారిలో గడ్డి మొలవదు.

అత్తచేతపోయినది అడుగోటి కుండ, కోడలు చేతపోయినది కొత్తకుండ.

విగ్రహపుష్టి నైవేద్య నష్టి

Saturday, 6 September 2025

నా నోట్లో నీ వేలు పెట్టు..

 నా నోట్లో నీ వేలు పెట్టు..



నా నోట్లో నీ వేలు పెట్టు, నీ కంటిలో నా వేలు పెడతా!

ఇదే కొన్ని గొప్ప దేశాల మాట.


దీపం నలుమూలల వెలుగు వెదజల్లుతుంది, కానీ దానిక్రిందన చీకటి ఉంటుంది.
అలాగే
మానవుని విజ్ఞానమనే వెలుగు పెరిగిన కొద్దీ చీకటి  అనే అహం పెరుగుతోంది.
 
చక్కనమ్మ చిక్కినా అందమే.

సాటి అమ్మ 'సరి' పెట్టుకుంటే తోటి అమ్మ 'ఉరి' కట్టు కుంటుందా? 

కలిగినమ్మ కొప్పైనా పెట్టగలదు సిగ అయిన పెట్టగలదు.

పెద్దకోడలూ అద్దగోడకీ పనెక్కువ.

మనుషులపై ఇష్టాయిష్టాలు ఎందుకు ఏర్పడతాయి? మాయ 

మనసు చిక్కితే చిక్కబడుతుంది.
చిక్కబడితే మరిన్ని చిక్కుల బడుతుంది.

అష్టమచంద్రుడు నైథనతార.

దంతంబుల్పడనప్పుడే తనువునన్‌ దార్ఢ్యంబు నున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు గానప్పుడే
వింతల్మేనఁ జరించనప్పుడె కురుల్వెల్వెల్ల గానప్పుడే
చింతింపన్‌వలె నీ పదాంబుజములన్‌ శ్రీకాళహస్తీశ్వరా!