Thursday, 14 November 2024

భవదధీనం కురు విభో

 భవదధీనం కురు విభో


  సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ

నటత్యాశా శాఖా స్వటతి ఝుటితి స్వైరమభితః

కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం

ధృఢం భక్త్యా బద్వా శివ భవదధీనం కురు విభో


శివా! నా మనసనే కోతి మోహం అనే అడవిలో అదుపులేకుండా తిరుగుతోంది. యువతుల పాలిండ్లపై నాట్యం చేస్తోంది. ఆశ అనే వృక్షశాఖలపై తిరుగాడుతోంది. ప్రభో! నీవా కపాలం చేతబట్టి తిరుగాడే బిచ్చగాడివి నా చంచల మనసనే కోతిని నీ భక్తి అనే తాడుతో గట్టిగా కట్టి  నీ అధీనం చేసుకో!


నా అనుకోలు.

ఇది శివానందలహరి లో 20వ శ్లోకం. నేనా సంస్కృతం తెలిసినవాడిని కాదు,  శ్లోకం చదివితే నాకనిపించినది,ఇదీ.


శివునికి తన మనసులో మాట చెప్పుకుంటున్నాడిలా! 

శివా! నా మనసనే కోతి మోహాటవి అంటే కామక్రోధ,మోహ,లోభ,మద,మాత్సర్యాలతో నిండిన అడివిలో యధేఛ్ఛగా అడ్డు ఆపు,అదుపులేక తిరుగుతోంది. ఎలా? యువతుల కుచగిరులపై నర్తిస్తోంది అనగా స్త్రీవాంఛ మిక్కుటంగా ఉన్నది. అనుభవిస్తున్నకొద్దీ పెరుగుతోంది,తరగటం లేదు. ఆ పైగా మోహాటవిలో ఆశ అనే వృక్ష శాఖలపై ఒకదానినుంచి మరొకదానికి యధేఛ్ఛగా దూకుతోంది. అనగా కోరికలు అనంతంగా పుడుతూనే ఉన్నాయి. నెరవేరినా లేకున్నా. నా మనసనే కోతి ఒక కోరికనుంచి మరో కోరికకు తిరుగుతూనే ఉంది. ఈ కామానికి (కోరిక) మోహానికి అంతు కనపడటం లేదు. నీవా కపాలం చేతబట్టి తిరిగి బిచ్చమెత్తుకునే బిచ్చగాడివి. అంతేనా నిన్ను ఇలా వర్ణించింది శ్రీరుద్రం

 "ప్రాలేయాచలమిందుకుందధవళం గోక్షేరఫేనప్రభం

 భస్మాద్యనంగ దేహ దహన జ్వాలావళీ లోచనం"

 అంటే హిమాలయపర్వతం,చంద్రబింబం అంతతెల్లగా  , అప్పుడే పితికిన ఆవుపాలపై నురగంత తెల్లగా ఆపై ఒంటినిండా పూసుకున్న భస్మం, ఇంకా ఆపై మదనుని దహించిన మూడో కన్ను, ఇలా ఉంటావంది ఒకచోట నిన్ను వర్ణిస్తూ. చాలా చోట్ల చెప్పింది,వీటికి తోడు తలపై జటలుకట్టిన గుండ్రంగా తీర్చబడ్డ జుట్టూ, మెడలో, కాళ్ళకి చేతులకి పాములు ఒంటిని రక్తమోడుతున్న గజచర్మం ధరించి, ఒక చేత భిక్షాపాత్రగా కపాలం, మరొకచేత చేత శూలంతో విలక్షణంగా ఉంటావు. నిన్ను చూచి జాలితో బిచ్చం వేస్తుంటారు. అటువంటి ఆహార్యం తో ఉన్న నీకు ఒక కోతి కూడా ఉంటే బిచ్చంపెట్టేవాళ్ళు ఎక్కువౌతారు.  అందుకని నా మనసనే కోతిని నీ భక్తి అనే తాటితో బంధించి తీసుకుపో! ఎంత హృద్యంగా ఉంది వేడుకోలు. అంటే నాకు నేనుగా నీపై భక్తి నెరపలేను నీవే నా మనసును నీ పట్ల భక్తి అనేతాటితో బంధింపబడేలా చేయవయ్యా అనీ వేడుకుంటున్నాడు.

           


Tuesday, 12 November 2024

బుర్రలో గుంజుంటే

బుర్రలో గుంజుంటే

బతకడానికి,  బతికించడానికి,ఉపాధి కల్పించడానికి, పెద్ద చదువే అక్కరలేదు.   శేషప్ప కవిగారు ఎప్పుడో చెప్పేరు 'అధిక విద్యావంతులప్రయోజకులైరి ' అని. సామాన్య చదువు చాలు గాని, కావలసినది  బుర్రలో గుంజు, బతకాలి, పదిమందిని బతికించాలనే తపనుండాలి,స్వార్ధం కాదు.  

బుర్రలో గుంజుంటే బూడిదమ్ముకు బతకొచ్చని చాలాకాలం కితమే చెప్పేను. ప్రపంచంలో ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తున్నవారు,అధిక ధనవంతులు అందరూ ఎక్కువ చదువులేనివారే!  పెద్దచదువులు చదివినవారు తమ తల తాకట్టులో పెట్టుకుంటారు. స్వతంత్రంగా ఆలోచనలు పుట్టవు. బానిస బతుకులు వెళ్ళదీస్తుంటారు. 

పెద్ద చదువులేదని బాధపడద్దు. డబ్బు సంపాదించడానికి గాడిదలు కాయచ్చు. బూడిదమ్ముకు  బతకొచ్చు. ఆకులు కూడా అమ్ముకు బతకొచ్చు. పదిమందికి ఉపాధి కల్పించచ్చు. ఆకులా? ఈసడించకండి. అవును ఆకులే. ములగచెట్లు పెంచండి. ములాగకు అమ్ముకు బతకొచ్చు. ములగాకుకి విదేశాల్లో కావలసినంత డిమాండు,  అలాగే కరివేపాకు కూడా. ఇవి రెండూ నిత్య డాలర్ల పంట. 

మీరే  చెయ్యచ్చుగా, చచ్చు కొచ్చను ఒక మేధావినుంచి.   నా జీవితం గడచిపోయింది.నాకిక డబ్బూ అవసరం లేదు. మరొకరికోసం డబ్బు సంపాదించను. సంపాదించే ఓపికాలేదు. సంతృప్తి చెందాను. 

 ఒకప్పుడు నిశాని, అంటే చదువులేనివాడు,వేలిముద్ర తప్ప తన సంతకం చేయలేనివాడు, ఒక నిరుపేద మొక్కలు అమ్ముకుని బతకడం ప్రారంభించాడు,కడియం లో, ఊరూర కావిడిలో మొక్కలు పెట్టుకుని అమ్ముకునేవాడు, ఆ తరవాత లారీలకొద్దీ మొక్కలు ఎగుమతి చేసే స్థితికి ఎదిగాడు, ఆ తరవాత వేగన్లకొద్దీ మొక్కలు ఎగుమతి చేసేవాడు. ఎంతో మందికి ఉపాధి కల్పించాడు.అంతేనా ఇతన్ని చూసి మరికొంతమంది మొక్కలు పెంచడం అమ్మడం మొదలెట్టేరు. ఇప్పుడా వ్యాపారం ఒక 1000 చదరపు కిలో మీటర్ల పైగా విస్తీర్ణానికి చేరుకుంది. వేలకొద్దీ జనాలకి ఉపాధి సంవత్సరం పొడుగునా దొరికింది. తరవాత తరాల్లో పిల్లలు బోటనీ మైన్ గా విద్య అభ్యసించి ఆ వ్యాపారాన్ని మరికొంత పెంచారు, ఇప్పుడక్కడ బోన్సాయి నుంచి,విదేశాల మొక్కలు కూడా పెంచే స్థాయికి,డ్రాగన్ ఫ్రూట్ ఉత్పత్తికి ఉపయోగపడుతున్నారంటే. ఒక చదువురాని నిశాని ఒక మంచి వ్యాపారం అభివృద్ధి చేసి చూపించి కాలం చేసేడు.    ఇప్పుడు కడియం మొక్కలకు ప్రసిద్ధి. కావల్సింది బుర్రలో గుంజు. దానితో కొన్ని తరాలని, వేలమందిని  బతికించే ఒక పరిశ్రమనే స్థాపించి పోయాడు.  అదీ కావలసింది. కట్,పేస్టు, కాపీ,పేస్టు  పి.హెచ్.డి ల మేధావులు సమాజం లో ఒకరిపై మరొకరిని రెచ్చగొట్టి ద్వేషం పెంచడం తప్పించి మరెందుకు పనికిరారు, ఎందుకూ పనికిరారు.

Sunday, 10 November 2024

ఒక్కమెతుకు-అన్నప్రసాదం

 ఒక్కమెతుకు-అన్నప్రసాదం

సముద్రలో స్నానం చేయాలంటే దిగాలి,అలలకు వెరవక, జీవితమూ అంతే. శరీరబాధలు ఇలాగే ఉంటాయి,ఇకతగ్గవు,ఒక్కసారి సూర్యనారాయణుడి దర్శనం చేసుకొద్దామని బయలుదేరా,కుటుంబం,బంధువులతో కలసి,రెండు ఆటోల్లో. కార్తీకమాసం చొరబడ్డ మొదటి ఆదివారం. ఆటో నడుస్తోంది  సాఫీగా, ఏమని చూస్తే రోడ్డు బాగుచేస్తున్నారు అన్నాడు, అబ్బాయి.

  కొంతదూరం పోయే సరికి గోతులు మామూలయ్యాయి. పడుతూ లేస్తూ  బిక్కవోలు చేరాం,ముందుగా గణపతిని దర్శించాం. సమయం చూస్తే ఏడు దాటింది అంతే. వినాయుకుడి ఆలయం చిన్నది. ప్రదక్షిణం, దర్శనం తరవాత అక్కడే కూచున్నా. 


Bikkavolu

ఈలోగా ఒకమ్మాయి, చంకలో బేగ్ వగైరా కొన్ని వస్తువులు అక్కడ పెట్టి, దర్శనానికి వెళ్ళాలని ప్రయత్నంలో, సామాన్లు ఇక్కడ కొంచం చూడండని ఇద్దరు ముగ్గుర్ని అడిగింది, కాదు పొమ్మన్నారు. బిక్కమొహంతో నిలబడింది,ఏం చేయాలని. నాకు జాలేసింది. ఆ సామాన్లు అక్కడ పెట్టమ్మా, నొవ్వొచ్చీదాకా నేను ఇక్కడే వుంటా అని చెబితే ఆనందంగా దర్శనానికి  వెళ్ళింది. కొంచం సేపట్లో ఒకాయన సామాన్లు తీయాలని చూశాడు, ఒకమ్మాయి అక్కడ పెట్టుకెళ్ళింది తీయకు, అన్నా,కర్రతో బెదిరిస్తూ. అతను ఇవి మావేనండి అన్నాడు. మీవో ఎవరివో నాకనవసరం, ఆ అమ్మాయి వచ్చేదాకా నువ్వు చెయ్యి వెయ్యడానికీ వీల్లేదని, అటకాయించా. ఈ లోగా అమ్మాయొచ్చేసింది, నవ్వుతూ, ఈయన మా ఆయనండి అంది. నువ్వు చెప్పలేదు కదమ్మా! నేను చూడలేదు  కదా అన్నా! నవ్వుతో  సామాన్లు పట్టుకువెళ్ళిపోయింది.  ఎంతజూసినా ఏడున్నర  దాటింది.   



Star tortoise
ఎటుగాని టైము సుబ్రహ్మణ్యుని దర్శనం చేసుకుని టిఫిన్ చేదామని ముందుకు కదిలాం. గోలింగేశ్వరుణ్ణి దర్శించాం. కార్తీకమాసం జనం ఉంటారనుకున్నా. మేము తప్పించి ఏవరూ లేరు,వస్తారేమో. ప్రదక్షిణం దర్శనం చేసుకున్నాం తృప్తిగా. అక్కడే పక్కనే ఉన్న సుబ్రహ్మణ్యుని దర్శించి బయటికొచ్చాం. టిఫిన్ కి వెళదామంటే వెనక్కి వెళ్ళాలంటే ముందుకే కదులుదామని ముందుకు కదిలి మామిడాడ చేరాం.దర్శనం తర్వాత టిఫిన్ చేద్దామని అనుకున్నాం.  స్వామి ప్రదక్షణం చేసాను. జనమే జనం, దర్శనం చేసాను.


ఉషా,ఛాయా,పద్మిని,సౌఙా సమేత సూర్యనారాయణుడు.
కిందటి సారి వెళ్ళినపుడు తీసినది. అప్పుడు ఆగస్ట్ నెల జనం లేరు,తీరుబడిగా దర్శనం చేసినప్పుడు తీసుకున్న ఫోటో.

 ప్రదక్షణ సమయంలో ఒక బోర్డ్  చూసాను. క్షీరాభిషేకం చేయించుకున్నవారికి అన్న ప్రసాదం, అని. అనుమానం తీరక అమ్మకి చూపించా, మనకు కాదు అనేసింది. దర్శనం తరవాత కూచుని, అన్నప్రసాదం  అందరికి కాకపోవచ్చు, నేను వెళ్ళి ఒక్కమెతుకు అన్న ప్రసాదం పెట్టమని అడిగి తీసుకుని వస్తానని  బయలుదేరా. అమ్మ, అబ్బాయి కూడా వచ్చారు.  అందరూ బయలుదేరారు, ఏం జరుగుతుందో చూదామని. అన్నప్రసాద వితరణ చోటికెళ్ళి అక్కడున్న ఒక పెద్దాయనతో నామాట చెప్పుకున్నా! ఆయన నాకేసి చిత్రంగా చూసి వెళ్ళి కూచోండి అన్నారు. మహా ప్రసాదమని చెప్పి అప్పటికే అక్కడ కూచున్నవాళ్ళ  వరసలో కూచున్నా.  నా కూడా వచ్చిన మిగిలినవారు నిలబడ్డారు. ఇది చూసిన ఆ పెద్దాయన అందరూ వరసలో కూచోండి ప్రసాద వితరణ జరుగుతుందంటే ఆనంద పడ్డాం. భోజనం అవుతుండగా ఒకరు ఎలావుందని అడిగారు. ఈ రోజు నా జీవితం లో మరువలేనిది. ఒక్క మెతుకు అన్న ప్రసాదం కోసం వచ్చినవాడిని,స్వామిదయతో పూర్తిగా ఆహారం స్వీకరించా, చాలా బాగుందని చెప్పా. . ప్రసాదం అద్భుతంగా ఉంది, ఒక్క మెతుకు వదలలేదు. ఆకునాకి తిన్నాను, వేసిన, ఎక్కువగానే వున్న  తీపి ప్రసాదంతో సహా! సుగర్ అమాంతం పెరుగుతుందని,  తెలిసి కూడా తీనేసేను. చిత్రం మందులు కూడా తెచ్చుకోలేదు,మరచా!. కానున్నది కాకమానదు, చూదాo స్వామి దయ అనుకున్నా.  అన్నప్రసాదం తీసుకున్నాం. వస్తుంటే చెప్పేరు, ప్రతి ఆదివారం అందరికి అన్నప్రసాదం ఉంటుందని.  కొంతమంది విరాళాలివ్వడమూ చూసి,విరాళమిచ్చాను.ఆ పెద్దాయన నా సంగతి చూసి ప్రసాదం పొట్లం కట్టించి ఇస్తా పట్టుకెళ్ళమన్నారు. వద్దండి అన్నా! అప్పుడు గుర్తొచ్చి, ప్రసాదం ఒకసారి తిరస్కరించినది, నిలబడ్డా. ఈ లోగా వారు రెండు పొట్లాలు కట్టించి,తీపి ప్రసాదం,పులిహోర కూడా ఇచ్చారు. వారికి ధన్యదాలు చెప్పి,స్వామికి మరొకసారి అక్కడనుంచే నమస్కారం చేసుకుని వచ్చాం. నా కూడా ఉన్నవారికి ఇదంతా చిత్రం గానే తోచి ఉండచ్చు. 


ఇంతా చేస్తే సమయం పది, నిజంగా అది టిఫిన్ టైమూ కాదు భోజనం టైమూ కాదు. ఆ తరవాత రామాలయంలో రాముని దర్శించి వెనక్కి బయలుదేరాం. సమయం పదకొండు లోపు.  వచ్చేటపుడు ఆటో సాఫీగా పరుగెట్టింది, ఏమంటే మరో దారిని వెనక్కి వెళుతున్నామని. అన్నీ నేను తిరిగిన దారులే మార్పు వచ్చింది,నాకు మరపూ వచ్చింది. 



ఇంటికి చేరేం. సమయం  పదకొండున్నర. అన్న ప్రసాదం తీసుకుని రెండు గంటలయింది కదా సుగర్ ఎలా ఉందో చూదామని చూస్తే 235 ఉంది. మాత్రలు మరచాం కదా అని అప్పుడే వేసుకున్నా! మరునాటి ఉదయానికి మామూలుగానే ఉంది. రొటీన్ లో పడింది. ఆహారంకాని, వ్యాయామం కాని, మందులుగాని ఏమీ మారలేదు. ఎందుకీ సొద?


 కిందటి సారి సూర్యనారాయణున్ని దర్శించి వస్తుంటే ఒక పెద్దాయన నా దగ్గరకొచ్చి అన్నప్రసాదం తీసుకువెళ్ళండి, అని చెప్పేరు,ప్రత్యేకంగా. నేను మాది అనపర్తే దగ్గరకదా వెళ్ళిపోతామని వచ్చేసాను. దర్శనానికి  వెళ్ళాలనుకున్నపుడు అది గుర్తుకొచ్చి ఒక్కమెతుకైనా, అన్న ప్రసాదం తీసుకు రావాలని అనుకున్నా!   


ఇప్పుడు గుర్తొచ్చింది, ఆ తరవాత నుంచి చెలికత్తెల ప్రాభవం పెరిగింది. తప్పదని మందులు మింగి భరించా, ఇంతకాలమున్నూ. మందులు మింగినా చెలికత్తెల ప్రాభవం తగ్గలేదు, ఏరోజూ. 


కొస మెరుపు:- వారమయింది. దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని వచ్చి.  అదే హారం,అవే మందులు,అదే వ్యాయామం. ఏదీ మార్పు లేదు. రోజూ దిన చర్యలో మార్పు లేదు,  చెలికత్తెల బాధలు తగ్గుముఖం పట్టాయి,చెప్పుకోతగినంతగా! రెండేళ్ళు పైగా రాని మార్పు ఇప్పుడే ఎందుకొచ్చింది? మరి  చెలికత్తెల ప్రాభవం ఒక్క వారంలో ఎందుకు తగ్గింది? అర్ధం కాని, సమాధానం లేని ప్రశ్న.   

Friday, 1 November 2024

చెలికత్తె చెలగాటం

చెలికత్తె చెలగాటం

బయటకు కదలటం లేదు,నడకకు కూడా. ఊరుదాటి ప్రయాణం రెండున్నర సంవత్సరాలకితం,అత్తారింటికే. ఇప్పుడత్తారింటి కెందుకూ? బావమరిది రెండున్నరేళ్ళకితం పక్షవాతానికి గురయ్యాడు.అప్పటినుంచి ఆరోగ్యం మెరుగు పడలేదు. ఇప్పటికిన్నీ అలాగే ఉన్నాడు. చూసి చాలారోజులైందని,బయలుదేరాను మొన్న ఆదివారం,ఆటో మీద. దేనిమీదైనా ప్రయాణం ఒకటే అనుకోండీ! రోడ్డలా ఉంది మరి.  బావమరిది, వాడే మేనమామ కొడుకు కూడా, చూసి తిరిగొచ్చా.

 మొత్తం చేసిన ప్రయాణం  38 కిలో మీటర్లు. ఇంటికి  తిరిగొచ్చేటపుడు చిరకాల చెలికత్తె వెంటబడింది. తప్పదుగా ఆహ్వానించా!!వచ్చినావిడ అంత తొందరగా కదలదని తెలుసు,కాని ఆహ్వానించక తప్పదు మరి. ఇంకక్కడినుంచి ఒకటే గుసగుసలు. వదలిపెడితేనా? ఇంట్లో వాళ్ళ తిట్లు,ఎందుకావిణ్ణి అంత చంకెక్కించుకుంటారు,అని. ఆవిణ్ణి సాగనంపాలంటే చిన్నపనేం కాదు.  అందునా పాతకాలపు చెలికత్తె.  ఒకటే గుసగుసలు ఏమీ తోచనివ్వదు, కూచోనివ్వదు,నుంచోనివ్వదు, మూడు రోజులు తెగ ఇబ్బంది పెట్టేసింది,గుసగుసలతో!  

 అంగుళం పొడుగు మాత్రలు మింగమన్నారు,ఇంట్లో వాళ్ళు. అమ్మా! ఈవిడ అంగుళం పొడుగు మాత్రలకి వదలదు,వెళ్ళదు. వెళుతున్నట్టు నటిస్తుంది,అంతే సుమా అని చెప్పి, నా మంత్రం ఉపయోగించడం మొదలెట్టాను. అదే యోగా చేయడం.  మాత్రలు మింగితే చెలికత్తెలొస్తారు బయటికి, వారే ఆకలి మందగింపు,విరేచనం బంధించడం, ఆ తరవాత మరెవరొస్తారో చెప్పడం కష్టం. మరెలా అనుభవించక తప్పదు,కొంతకాలం. సాగనంపడానికి కావల్సిన సరంజామా. యోగా చేయడం, ఎక్కువ సేపు కూచోకపోవడం. ఇలా. అదేనండీ వెన్నునొప్పి, వెన్నుపోటు కాదండోయ్. వెన్నుపోటంటే మరో అర్ధమండీ! తెనుగు మాస్టార్ లకు బాగా తెలుస్తుందండి, ఈ తేడా!!

సాధారణ వెన్నునొప్పికి కారణాలు.

1.ఆహార విహారాల్లో సమయం పాటించకపోవడం. నిద్రాసమయాలు పాటించకపోవడం (సిరికార్డియన్ రిథం చెడిపోవడం)

2.సెల్ ఫోన్ కి అతుక్కుపోవడం.

3.అజీర్తి. వీరు పొదుపుగా నీరు తాగుతారు. నీరే అజీర్తికి మంచిమందు.

4.మలబద్ధం అజీర్తికి చెలికత్తె. అబ్బో! దీని గురించి చెప్పాలంటే గ్రంధాలే ఉన్నాయి.

5.వృత్తి పరమైనవి. నడక మంచి మందు. కూచుని చేసే ఉద్యోగాలవారు గంటకో రెండు గంటలకో ఒకసారి ఒక పది నిమిషాలు నడవాలి. ఇది చెయ్యరు. నడక అంటే ఒక్కసారే నడిచెయ్యాలి, అంత టైం లేదంటారు. ఒక్కసారి నడవ కూడదు. ప్రతి బోజనం తరవాత నడవాలి. టిఫిన్ తరవాత నడవాలి. టీచర్లు క్లాసులో నడవచ్చు,పిల్లలికి చెబుతూ. అలాగే ఇతరులు కూడా, వీలు బట్టి నడవాలి.

6. ఈ విషయం లో స్త్రీలు ప్రత్యేకమే. ఋతు కాలంలో వేధిస్తుంది వెన్ను నొప్పి రూపంలో. ఇది మొదలు గర్భ ధారణ,ప్రసూతి సమయాలు చెప్పక్కరలేదు. అజీర్తి,మలబద్ధం వీటికి జోడింపు. ఇందులో టీచర్లైతే, పొట్టివాళ్ళైతే బోర్డ్ మీద రాయడానికి సాగి, మెడలు వెనక్కి వంచి రాస్తారు. భుజాలనొప్పి,వెన్నునొప్పికి కారణాలు. ఇంతేకాదు,పేపర్లు అదేపనిగా దిద్దడం నేడు అవసరమైపోయింది,ఇది అదనపు కారణం.   

7.స్త్రీల వస్త్రధారణ కూడా కారణమంటే ఆశ్చర్యం కాదు. లో దుస్తులు బ్రా,పేంటీలు వెన్నును ఇరవైనాలుగు గంటలూ నొక్కుతూనే ఉంటాయి. ఇవి వెన్నునొప్పేకాదు కేన్సర్ కి కూడా కారణమని వైద్యులంటారు. అంతే కాదు తొడుక్కునే జాకెట్లు లో పేడ్ లూ చంకలలో పేడ్ లు మూలంగాను కూడా వెన్నునొప్పికి కారణమని చెబుతున్నారు వైద్యులు. కొందరు జాకెట్లలోనే పేడ్ లూ వేయించుకుని కుట్టించుకుంటున్నారు. ఇవి ఎంత బిగువంటే విప్పుకోడమే కష్టం. డాక్టర్లు కూడా ఇవి చెప్పటంలేదు. ఎవరేనా చెప్పబోతే మేము ఏమి దుస్తులు ధరించాలో కూడా మీరే చెప్పాలా అని దెబ్బలాటకొచ్చే ఫెమినిస్టులున్నకాలం.అంచేత ఎవరూ చెప్పరు,చెప్పలేరు.

8.చెప్పుకుంటూ పోతే కారణాలనేకం.

ఇవన్నీ అందరికీ తెలుసుగాని నివారణ చెప్పండి,అంటారా!

ఉధృతంగా ఉన్నపుడు డాక్టర్ ని సంప్రదించక తప్పదు. మందులే పరమావధి కాదు. జాగ్రత్తలు చాలా అవసరం.

1.నేల మీదగాని,బల్లమీద గాని పడుకోండి. బొంతగాని,రగ్గుగాని వేసుకోండి. తలకింద ఎత్తు పెట్టద్దు,తలగడ నిషేధం. బుర్రొంచుకునే పనులు తగ్గించుకోండి. పేపర్లు దిద్దదం లాటివి. నీరసం అలసట కూడా వెన్నునొప్పికి కారణాలంటే నమ్మలేరు. అది చూసుకోండి.

2.యోగా చెయ్యండి. చాలా ఆసనాలున్నాయిగాని వెన్నునొప్పికి సూచనలు.

2.1 ప్రాణాయామం చెయ్యండి. అదిన్నీ అనులోమ విలోమ ప్రాణాయామం, మిగిలినవి గురువు దగ్గర నేర్చుకోవలసినవే. ప్రమాదం లేనిది,ఇది. కుడిచేతి బొటనవేలు,మధ్యవేలు తో రెండు ముక్కులూ మూయండి,సుఖాసనంలో కూచుని. ఎడమ ముక్కు మూసినది  తెరవండి ఊపిరి తియ్యండి,ముక్కు మూయండి మధ్యవేలుతో, ఊపిరిబట్టండి, ఊపిరి నెమ్మదిగా కుడి ,ముక్కునుంచి వదలండి నెమ్మదిగా ! ఇలాగే కుడి ముక్కుతో గాలిపీల్చి కొనసాగండి. ఎంత సేపు? పీలచాలి వగైరా కదా! పది అంకెలు లెక్కేదాకా పీలచండి,అంతే సేపు బిగబట్టడం ,ఊపిరివదలడం. 


2.2  సుఖాసనంలో కూచోండి. కాళ్ళు ముందుకుచాచండి, వెన్ను నిలువుగా ఉండాలి..భుజాలు బిగబట్టకండి. ఇలా కూచోలేనివాళ్ళు చాలా మందే ఉన్నారు. ఆ తరవాత కాళ్ళు కొద్దిగా ముడవండి, శరీరం ముందుకు కాళ్ళమీదకి వంచండి.రెండు చేతులతో రెండు పాదాలూ పట్టుకోండి. శరీరం పైకి లేపకుండా కాళ్ళు ముందుకు చాపండి, ఇదే పశ్చిమోత్తాసనం. ఊపిరి బగబట్టకండి.


2.3 సుఖాసనంలో కూచోండి. రెండు కాళ్ళు ముందుకు చాచండి. ఒకకాలు ముడవండి పక్కగా, అరికాలు చాచినకాలుని తాకుతూ. శరీరం ముందుకు వంచండి, ఊపిరి వదలండి.. పై ఆసనంలోనూ  ఇందులోనూ మోకలిని ముద్దు పెట్టుకోగలగాలి,కాలు వంచకుండా. ఇలాగే రెండో వైపూ చేయండి. మొదటిరోజే కాళ్ళు వంగవు,కంగారొద్దు.నెమ్మదిగా వస్తుంది. రోజూ చేయాలి.


2.4 సుఖాసనంలో కూచోండి కాళ్ళు చాచండి. అరికాళ్ళు రెండూ ఎదురెదురుగా తాకేలా కాళ్ళు ముడవండి. పాదాలు రెండు చేతులతో పట్టుకోండి. ముడిచినకాళ్ళని పైకి కిందికి ఆడించండి. ఇది శలభాసనం. ఇలా ఉండగా వెన్నువంచి నుదుటితో అరికాళ్ళను తాకే ప్రయత్నం చేయండి. శరీరం వంచడం బహు కష్టం. రోజూ చేస్తే పూర్తిగా కాళ్ళకి నుదురు ఆనచగలరు. 


2.5వెన్నుపై పడుకోండి.కనులు మూసుకోండి. ఊపిరి నెమ్మదిగా తీయండి,నెమ్మదిగా వదలండి.చేతులు పక్కగా పెట్టండి. ఇదే యోగనిద్ర. ఊపిరులు ఎంత తగ్గితే ఆయువు అంత పెరుగుతుంది. మనిషి నిమిషానికి ఏడు ఊపిరులు తీస్తాడు, నిమిషానికి మూడు ఊపిరులు తీసే తాబేలు మూడువందల సంవత్సరాలు బతుకుతుంది. ఇదే శవాసనం. 

2.6వెన్నుపై పడుకోండి ఒక కాలు పైకెత్తండి. కాలు తిన్నగా లంబంగా రాదు. ఒక తువ్వాలు తీసుకోండి. తువ్వాలు అరికాలు మీంచి వేసి రెడు చేతులతో పట్టుకుని కాలు ముందుకు లాగండి. మోకాలు వంచద్దు. ఇలాగే రెండు కాళ్ళు చేయండి.


2.7వెన్నుపై పడుకోండి.కాలుపైకాలు అడ్డంగా వేసి చాచినకాలు ముడవండి నెమ్మదిగా, రెండు చేతులతో చాచిన కాలును దగ్గరకు లాక్కోండి. తల లేస్తుంది,ఎంత లేపగలిగితే అంత మంచిది. ఇలాగే రెండో కాలూ చేయండి. 


2.8 కాళ్ళు ముడుచుకు గోడ దగ్గరగా కూచోండి. నెమ్మదిగా వెన్ను వాల్చి గోడకి సమాంతరంగా దగ్గరగా పడుకోండి. కాళ్ళు చాపండి. చాపినకాళ్ళు నెమ్మదిగా గోడపైకి చేరుస్తూ శరీరం గోడకి లంబంగా చేయండి. ముడ్డి గోడకి చేరుతుంది. కాళ్ళు గోడపైనా చాచండీ,మోకాళ్ళు వంచకండి ఇది విపరీత కరణి  అనే ఆసనం. ఇదొక ముద్ర కూడా. ఇలా ఎంతసేపైనా ఉండచ్చు. . వెన్నుకు చాలా హాయిగా ఉంటుంది.  ఊపిరి  నెమ్మదిగా తీసుకు వదులుతుండండి.

2.9 వెన్నుపై పడుకోండి,కాళ్ళు చాచండి. చాచిన కాళ్ళు దగ్గరికి ముడుచుకోండి. మడిచిన రెండు కాళ్ళనూ రెండు చేతులతో బంధించండి,తలపైకెత్తండి,వీలున్నంత. వెన్ను కొద్దిగా విల్లులా వంగుతుంది. నెమ్మదిగా వెన్నుమీద ఊగండి,ఉయ్యాలా ఊపినట్టు. వెన్నుకు మర్దనా చేసినంత శమనగా ఉంటుంది,వెన్ను నొప్పికి  మంచిది. మరోమాట పాతకాలం స్త్రీలు పిల్లలను ఆ ముడిచిన కాళ్ళపై పడుకోబెట్టుకుని ఉయ్యాలా ఊగినట్టు ఊగేవారు. దాదం దక్కచ్చి అయ్యవారక్కొచ్చి అని చిన్నగా పాడుతూ. ఇది వెన్నునొప్పికి మంచిమందంటే నమ్మలేరు.


పడుకుని కూచుని వేసే ఆసనాలన్నీ 30 సెకండ్లు వేయాలి,అనగా ముఫై అంకెలు లెక్కపెడితేచాలు. కాళ్ళతో చెప్పినం ఆసనాలు ఒకవైపొకసారి మరోవైపొకసారిగా మూడు సార్లు చేయాలి.


ఇలా చాలా ఆసనాలున్నాయి, కొన్ని చేస్తే చాలు నెమ్మదిగా వెన్నునొప్పి పారిపోతుంది. మందుల బెడదుండదు. నేను ఈ మధ్య కొంత అశ్రద్ధ చేసాను, మళ్ళీ మూడు రోజులనుంచి చేస్తుండగా చెలికత్తె నెమ్మది నెమ్మదిగా లాడీ,బేడి సద్దుకుంటోంది,పారిపోడానికి.


నిజంగా కష్టమే పడ్డాను,ఓ మనవరాలు అడగటంతో ఇదంతా రాయాల్సివచ్చింది, 4 రోజులు కూచుని చెలికత్తెతో పోరాడుతూ రాసాను. చెలికత్తె పారిపోడానికి సిద్ధంగానే ఉంది.

ఇన్ని అవస్థలు ఎవరు పడతారు, అంగుళం మాత్రలు మింగితే సరిపాయె అనుకుంటే తమ చిత్తం.