Thursday, 31 August 2023

Solve this problem

 Solve this problem


111=13

112=24

113=35

114=46

117?


Monday, 28 August 2023

తులసి ప్రదక్షిణం పాట

 


  తులసి   ప్రదక్షిణం పాట




గోప ప్రదక్షిణం నీకిస్తినమ్మా!

గోవిందు సన్నిధి నాకీయవమ్మా


ఒంటి ప్రదక్షిణం నీకిస్తినమ్మా

వైకుంఠసన్నిధి నాకీయవమ్మా


రెండో ప్రదక్షిణం నీకిస్తినమ్మా

నిండైన సంపదలు నాకియ్యవమ్మా


మూడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా

ముత్తైదువతనం నాకీయవమ్మా


నాలుగో ప్రదక్షిణం నీకిస్తినమ్మా

నవధాన్య రాసుల్లు నాకీయవమ్మా


ఐదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా

ఆయువైదోతనం నా కియ్యవమ్మా


ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మా

అత్తగల పుత్రుణ్ణి నా కియ్యవమ్మా


ఏడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా

వెన్నుని ఏకాంత సేవీయవమ్మా


ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా

యమునిచే బాధలు తప్పించవమ్మా


తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా

తోడుగా కన్యలకు తోడియ్యవమ్మా


పదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా

పద్మాక్షి  నీ సేవ నాకియ్యవమ్మా


ఎవ్వరు పాడినా ఏకాశి మరణం

పుణ్యస్త్రీలు పాడితే పుత్ర సంతానం


రామతులసి లక్ష్మి తులసి

నిత్యం మా ఇంట కొలువై విలసిల్లవమ్మా

Courtesy:What's app

Thursday, 24 August 2023

అనుమానం

 అనుమానం


పై చిత్రం నిజం కాదని కల్పితమనీ ఇప్పుడే తెలిసింది. at 3PM today the 24/8/23


నిన్న సాయంత్రం చంద్రయాన్-3 లేండర్ నెమ్మదిగా చంద్రుని ఉపరితలాన్ని తాకింది. ఇలా చంద్రుని ఉపరితలాన్ని లేండర్ తాకే సమయంలో దుమ్ము లేస్తుందనీ అది కాస్తా తగ్గిన తరవాత లేండర్ నుంచి క్రాలర్ బయటికొస్తుందనీ దాని చక్రాలకి ఇలా చంద్రుని మీద చెరగని భారత ముద్రలుంటాయని అంటున్నారు. (చంద్రునిపై గాలి లేనందున, ముద్రలెప్పటికి అలాగే ఉంటాయని) చంద్రుని పై గాలి లేనప్పుడు శూన్యప్రదేశంలో దుమ్మెలా లేస్తుందన్నది అనుమానం.    


తెలిసినవారు చెప్పకోర్తాను. 


Wednesday, 23 August 2023

సాలెగూడు

సాలెగూడు 

మానవ సంబంధాలన్నీ సున్నితమైనవేనంటారు. మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలేనన్నారటా మార్క్స్ మహాశయులు.ఎంత సున్నితమైనవంటే సాలె పురుగు గూటిలో దారం అంత సున్నితం అంటారు. 


ఎప్పుడేనా సాలెగూడు చూసారా? దీన్ని సాలె పట్టు అనికూడా అంటుంటారు. ఒక కేంద్రం నుంచి నాలుగు, లేదా ఐదు, ఆరు పక్కలకి ఒక గూడు అల్లేస్తుంది. అదికూడా ఎంతో కళాత్మకంగానూ ఉంటుంది. మరే ఇంజనీరింగ్ కాలేజిలో చదువుకుందో మాత్రం తెలీదు సుమా! ఈ సున్నితమైన దారాలని ఎక్కడనుంచి తెస్తుంది? తన నుంచి ఒక ద్రవం విడుదలచేస్తే అది బయటకొచ్చాకా గట్టిపడి దారంలా తయారవుతుంది. దీన్ని ఉపయోగిస్తుంది. చూడ్డానికీ దారం ఎంత సున్నితమంటే గాలేస్తే తెగిపోతుందేమో అనిపిస్తుంది. కాని రెండు వందలకిలోమీటర్ల వేగంతో గాలి వీచినా ఈ దారపుపోగు తెగదు. జడివాన కురిసినా తెగదు. కాని చిన్న పుల్ల ముక్కకి మాత్రం చుట్టుకుపోతుంది. మరో చిత్రం కొంతకాలమైన తరవాత ఆ సాలెపురుగు ఈ గూటినంతనీ తనలోకి మళ్ళీ వెనక్కి తీసుకోగలదు. దీనికి ఊర్ణనాభమని పేరు. 


మానవ సంబంధాలు కూడా సున్నితంగా కనపడినా బలమైనవే కాని చిన్న బలహీనత, అదే డబ్బు. దీనితో ఇంత బలంగా కనపడే మానవ సంబంధాలూ తల్లి,పిల్ల అని చూడక తెగిపోతాయి, అదే చిత్రం. ఆడ మగా తేడా లేక అవసరానికి మానవులంతా, ఇలా సాలెగూడు అల్లేస్తూ ఉంటారు అదో చిత్రం.  అది సాలెగూడని తెలిసి, తెలిసి అందులో చిక్కుకుని మోసపోతుంటారిదీ మరీ చిత్రం.

Monday, 21 August 2023

"ఆగఛ్ఛ మూర్ఖ"

"ఆగఛ్ఛ మూర్ఖ"

 భోజరాజుగారి పట్టపు దేవేరి తన ఇష్ట సఖితో, ఉద్యానవనంలో, ఉదయకాలంలో ముచ్చటలాడుతుండగా భోజరాజుగారు ప్రవేశించారు. 


మహరాజావారొస్తున్నారొహో! అనే హెచ్చరికలు ముందు చేయడం, అంతేగాక మహరాణీవారితో మాటాడాలన్నా, ముచ్చటించాలన్నా కూడా  ముందుగా రాణివారికి కబురంపి, వారి అనుమతితోనే రాజావారైనా రావడం అన్నది రాజవంశాలలో అలవాటు. ఇల్లాటి ఏ హెచ్చరికలు, కబురూ లేకనే రాజా వారు దయచేసేరు, ఆ సమయానికి మహరాణీవారు ఇష్ట సఖితో ముచ్చట్లాడుతున్నారు. అంతట మహరాణీవారు "ఆగఛ్ఛ మూర్ఖ" అని ఆహ్వానించారు. రాజావారు తెల్లబోయారుగాని కారణం ఉండచ్చు తనను మూర్ఖ అని సంబోధించడంలో అనుకుని సభకు వెళ్ళిపోయారు. 


సభలో కవులు,పండితులు కొలువుతీరి వున్నారు. కొంత మంది కొత్తగా సభలోనూ ప్రవేశిస్తున్నారు. ఇలా వస్తున్నవారిని ఆగఛ్ఛ మూర్ఖ అని రాజావారు సంబోధిస్తున్నారు. అందరూ ఇదేమో అర్ధంకాక తెల్లబోయి చూస్తున్నారంతా. ఇంతలో కాళిదాసుగారు సభలో ప్రవేశించారు. ఆయన్నూ ఆగఛ్ఛ మూర్ఖ అని ఆహ్వానించారు. విన్న కాళిదాసుగారు, చతురుడు,బుద్ధిశాలి కనక ఏదో జరిగి ఉంటుందని ఊహించి, ఈ కింది శ్లోకం చెప్పేరు. 


ఖాదన్న గఛ్ఛామి హసన్న జల్ఫే

గతం నా శోచామి కృతం న మన్యే

ద్వాభ్యాం తృతీయో న భవామి రాజన్

కిం కారణం భోజ భవామి మూర్ఖః

Courtesy:

https://kavulu.blogspot.com/2023/08/blog-post_531.html

"నడుస్తూ తినను, నవ్వుతూ మాటాడను,గతించిన దాని గురించి దుఃఖ పడను, ఇద్దరు ఏకాంతంలో ఉన్నపుడు ఆహ్వానింపబడక మూడవవానిగా చేరను, ఏ కారణం తో నన్ను మూర్ఖుడా అని సంబోధించారు భోజరాజా" అని అడిగాడు.

ఇప్పుడు రాజావారికి మహరాణీవారు తనను అగఛ్ఛ మూర్ఖ అని సంబోధించడం లో ఆంతర్యం.

( ట్రోల్ ఆర్మీ వారికి పండగే! కానివ్వచ్చు,  మీదే ఆలస్యం . :) )


Thursday, 17 August 2023

ఎంతో కొంత, అంతా హిరణ్యకశిపులే!

 

ఎంతో కొంత,  అంతా హిరణ్యకశిపులే!


నడకల్లో రకాలున్నాయట. నత్తనడక, పిల్లినడక,పెళ్ళివారి నడక...ఇలా...ఆధునికులైతే మార్నింగ్ వాక్,ఈవినింగ్ వాక్, స్టేరింగ్ వాక్, ...ఇలా.

మొన్న నడకలో ఎముక చిట్లినదగ్గర్నుంచి మంచానికే అతుక్కుపోయా! నిన్న కాలికి కట్టిప్పేరు దాంతో   ఇక్కడికొచ్చా! ఈమధ్యలో మందస్మితవదనారవింద సుందరి, 

( అబ్బా ఇంత పేరా!   ఎత్తుపళ్ళ సుందరి అంటే బాగోదుగా)  దరహాసోజ్జ్వలన్ముఖి తో
జరిగిన సంభాషణ.   


''అయ్యయో! ఎలా జరిగింది? ఏమయింది?'' అడిగింది.

''నడుస్తోంటే జరిగింది,  (విరిగింది)నెప్పిగా ఉంది'' 

''చిన్నపిల్లాణ్ణనుకుంటున్నారా, గెంతుకుంటూ నడవడానికి, నెమ్మదిగా నడవాలిగా? ''  అభిమానం, ప్రేమ,  ఆతృత, ఆవేదన,  కొంచం  విచారం, కోపం,విసుగు,  కలగలిపి.

బుస్సున కోపమొచ్చింది.తమాయించుకున్నా! ఊరుకున్నా! 

ఒకరోజు తరవాత. ''తిట్టేవా?'' అడిగా

''మరి! నైస్!! బలే పడ్డారు!!! అని అప్రీసియేట్ చేశా అనుకున్నారా?'' అడిగిందీ సారి నిజంగానే కోపంగా.

''కాలు కావాలని విరుచుకుంటారా?నీకు దయ లేదు'' అనేశా!

''నాకు దయ ఉంది. మీకు భయం లేదు. జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్న.. పర్వా లేదు కదా.. ''అన్నది

నేనేదో సమాధానం చెప్పేనుగాని, ఆలోచనలో పడ్డా.

విరిగిందంటే, ఇలా అన్నదేం! అని. నా కాలు  విరిగిందన్న బాధ,   బాధ పడుతున్నానన్న బాధ అదనం, అభిమానం, ప్రేమ,  ఆతృత, ఆవేదన,   కలగలిపి,అభిమానం పెల్లుబికి అన్నమాటగా చెప్పుకుని.....

   

"ఏంటి భయం,జాగ్రత్త, పర్వా లేదు కదా"  అని ఆలోచనలో పడ్డా! 

భయం ఎలాపుడుతుంది? స్వయంగా ఒక సంఘటన చూడడం లేదా వినడం ద్వారా భయం పుడుతుంది. భయంనుంచి జాగ్రత్త పుడుతుంది. 


ఒక ఉదాహరణ చూదాం. భాగవతం దగ్గరకెళితే...

హిరణ్యాక్షుడు హరి చేతిలో మరణించిన తరవాత హిరణ్యకశిపుడికి భయం పుట్టుకొచ్చింది. మనమూ 

 ఇంతేనేమో అని. అందుకు తపస్సుచేసేడు.బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ''వత్సా! ఏమి నీకోరికంటే?'' ''చావులేని వరంకావాల''న్నాడు. ''అది ఇవ్వడం కుదరదుగాని మరేమన్నా కోరుకోమంటే!'' ''గాలిన్ కుంభిని..అని ఈ చోట్ల, వీళ్ళచేత చావు రాకూడ''దన్నాడు. ''సరే! ఇచ్చానురా!! చాలామందికి వరాలిచ్చా గాని ఇలాటి వరం అడిగినవాడు లేడు, బుద్ధికలిగి బతుకు'', అన్జెప్పి తిరోహితులయ్యారు, బ్రహ్మగారు..ఆ తరవాత కత తెలిసిందే! వీడేవైతే కాదనుకున్నాడో, వాటిని తప్పించి నరసింహ రూపంలో గడపమీద గోళ్ళతో పొట్ట చీల్చి చంపేడు. వీడు తీసుకున్న జాగ్రత్తలు ఉపయోగించాయా?


ఇలాటిదే మరొకటి భారతం నుంచి

శాపానికి మరణిస్తావంటే భయపడ్డాడు,ఒంటి స్థంభం మేడలో దాగాడు, ఎన్నిజాగ్రత్తలో తీసుకున్నాడు,చివరికి చావు తప్పిందా?  చివరికి పండులో పురుగుగా వచ్చి కాటేసిపోయాడు,  తక్షకుడు.


అభివృద్ధి చెందేమనుకుంటున్న వారు, ఆ దేశాల మనుషులు, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.ఆరోగ్య రక్షణలుంటాయి, చెకప్ లుంటాయి,హాస్పిటళ్ళుంటాయి, మేధావులైన డాక్టర్లుంటారు,డబ్బుకైతే లోటే లేదు. కానీ, చిత్రంగా ఆ దేశాల్లోనూ పౌరులు చచ్చిపోతున్నారు, వ్యాధుల మూలంగా! మరీ జాగ్రత్తలు ఎందుకు పనిచెయ్యటం లేదు? అర్ధం కాలేదు.

  కాలం ఎవరిని వదలదు. అందుకే కాలగ్రాసీభూతులయ్యారంటుంటారు,అంటే కాలం మింగేసిందన మాట. కాలOమూడితే (కాలం పూర్తైతే) జాగ్రత్తలేం పని చెయ్యవు.అదే  విధి 

ఏమనమాట? కాలాన్ని జయించినవారు లేరు. జాగ్రత్తలేం పని చెయ్యవు. 

నిన్న పుట్టిన శరీరం పెరిగింది. పెరిగినది శాశ్వతంగా ఉండదు. నశిస్తుందనే స్పృహ లేకపోతోంది. నిన్న మధువులొలికించిన సోగకళ్ళు నేడు లొత్తపోయాయి. నిన్నటి వయసు అందాలు నేడు జారిపోయాయి. నిన్న హరి నామస్మరణ చేసినవారిని నిందించిన నోరు పెగలటం లేదు. నిన్న అందరిని తన్నిన కాలు నేడు లేవటం లేదు. నిన్న విచక్షణలేక దండించిన చేయి నేడు ఎండిపోయింది. ఐనా మానవులకి జ్ఞాననాడి ఆడటం మొదలు కావటం లేదు. మనసును జయించే ఆలోచనే మొదలుకావటం లేదు. కనీసం పగ,అసూయ,ఈర్ష్య,ద్వేషాలను వదలించు కోవాలనే కోరిక ఆలోచనకే రావటం లేదు.

శరీర సుఖాలతో కాలం గడిపెయ్యచ్చనే ఆలోచన కలిగిన 

మానవులంతా ఎంతోకొంత, అంతా హిరణ్యకశిపులే!


విధి తప్పదు! అందుకే వేదం చెప్పేమాట

త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుక మివబంధనాత్మృత్యో ముక్షీయమామృతాత్!

ఎంత చక్కటి కోరిక!! అపమృత్యువు నుంచి రక్షించు!  దోసకాయ ముగ్గిన తరవాత తొడిమనుంచి విడిపోయినట్టు, కాలం చెల్లిన తరవాత తీసుకుపో!!!